పప్పు పంటలను ఇలా కాపాడుకోండి | Protect the Pulses crops from insects | Sakshi
Sakshi News home page

పప్పు పంటలను ఇలా కాపాడుకోండి

Published Thu, Jul 24 2014 12:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పప్పు పంటలను ఇలా కాపాడుకోండి - Sakshi

పప్పు పంటలను ఇలా కాపాడుకోండి

పాడి-పంట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఇప్పటికే పెసర, మినుము విత్తనాలు వేసుకున్నారు. అయితే ఈ పైర్లను ఆశించి నష్టపరుస్తున్న చీడపీడల నివారణపై వారు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెసలు, మినుములకు మంచి ధర లభిస్తోంది. కాబట్టి రైతులు ఆయా పంటల్లో చీడపీడల నివారణపై తగిన శ్రద్ధ కనబరిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెసర, మినుము పైర్లలో పురుగులు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు...
 
ఇవి రసాన్ని పీలుస్తాయి
 పెసర, మినుము పైర్లలో రసం పీల్చే తెల్లదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు ఆకుల నుంచి రసాన్ని పీల్చడంతో పాటు పల్లాకు (ఎల్లో మొజాయిక్) తెగులును వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ పిల్ల పురుగులు ముందుగా కొద్దిసేపు ఆకులపై తిరుగుతాయి. ఆ తర్వాత ఒకే కణానికి అతుక్కుపోయి రసాన్ని పీలుస్తూ పెరుగుతుంటాయి. తెల్లదోమ నివారణకు విత్తనాలు వేసిన 15-20 రోజుల మధ్య లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల మెటాసిస్టాక్స్ లేదా 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
 తామర పురుగులు పైరు తొలి దశలోనూ, పూత దశలోనూ పంటను నష్టపరుస్తాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులు, మొగ్గలను గీకి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు మొక్కల లేత భాగాలను ఆశ్రయించి పెరగడం వల్ల ఆకులు పెళుసుగా మారతాయి. మొక్క గిడసబారుతుంది. పురుగు ఆశించిన మొగ్గలు, పూలు కాయలుగా మారవు. ఈ పురుగులు ఆకుముడత తెగులును వ్యాపింపజేస్తాయి. తామర పురుగుల కారణంగా పైరుకు 10-20% మేర నష్టం జరుగుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా ఒక మిల్లీలీటరు ఫిప్రోనిల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
పూత దశ నుంచి ఆశిస్తుంది
 మరుకా మచ్చల పురుగును పూత, గూడ, బూ జు పురుగు అని కూడా అంటారు. ఇది పూత దశలో పూలను గూడుగా చేసుకొని, లోపలి పదార్థాన్ని తినేస్తుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరికి చేర్చి, గూడు కట్టి, లోపల గింజలను తింటుంది. ఈ పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టకపోతే దిగుబడులు 80% వరకూ తగ్గే ప్రమాదం ఉంది. లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఒక గ్రాము థయోడికార్బ్/ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల స్పైనోశాడ్ లేదా 1.5 మిల్లీలీటర్ల ప్లూబెండియమైడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
ఆకులు జల్లెడలా మారతాయి
 పొగాకు లద్దె పురుగులు తొలి దశలో ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు తెల్లగా, జల్లెడ మాదిరిగా మారతాయి. పెద్ద పురుగులు ఆకులు, పూత, పిందె, కాయలను తినేస్తాయి. ఇవి పగటి వేళ భూమిలో దాగి ఉంటూ రాత్రి సమయంలో పైరుపై దాడి చేస్తుంటాయి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పెద్ద పురుగుల నివారణకు మొక్కల మొదళ్ల వద్ద సాయంకాలం వేళ విషపు ఎరలు వేయాలి. విషపు ఎరల తయారీ కోసం 500 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్/క్లోరిపైరిఫాస్+5 కిలోల తౌడు+అర కిలో బెల్లాన్ని తగినంత నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
 
అపార నష్టం కలిగిస్తుంది
 తెల్లదోమ ద్వారా వ్యాపించే పల్లాకు తెగులు పెసర, మినుము పైర్లకు అపార నష్టం కలిగిస్తుంది. తెగులు సోకిన లేత ఆకుల మీద ముందుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ పెద్దవై, ఆకులు పూర్తిగా పసుపు రంగుకు మారతాయి. పిందెలు, కాయ లు కూడా పసుపు రంగుకు మారి వంకర్లు తిరుగుతాయి. కాయల్లో విత్తనాలు ఏర్పడవు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు తెగులు సోకితే మొక్క లు గిడసబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు ముందుగా తెగులు సోకిన మొక్కలను పీకి దూరంగా పారేయాలి. పసుపు రంగు రేకు/అట్టకు ఆముదం/గ్రీజు పూసి పైరు మీద ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలి. పసుపు రంగుకు ఆకర్షితమయ్యే తెగులు కారక తెల్లదోమలు రేకు/అట్టకు అతుక్కొని చనిపోతాయి.
 
ఇవి కూడా...
 సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులపై ముందుగా గోధుమ రంగులో చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి పెద్దవవుతాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. కాయల్లో గింజలు సరిగా ఏర్పడవు. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఆకుముడత తెగులు సోకుతుంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటి నివారణకు మందులు పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement