ముడతలు ముంచేస్తాయ్.. | Eczema worms effect on the yield of chilli | Sakshi
Sakshi News home page

ముడతలు ముంచేస్తాయ్..

Published Mon, Nov 3 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

Eczema worms effect on the yield of chilli

తామర పురుగులు ఆకుల అడుగ భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. మొక్కలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. నివారణకు కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోశాడ్ 75 మిల్లీలీటర్లు లేదా పెసగాన్ 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.

మిరప నారు నాటిన 15, 45వ రోజు పిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా పై ముడత ను నివారించవచ్చు. పై ముడతతో పాటు కింది ముడత కూడా ఉంటే  కార్బరిల్, ఎసిఫేట్ మందులు వాడకూడదు.

 తెల్లనల్లి (కింది ముడత)
 తెల్లనల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దగా మారతాయి. కింది ముడత నివారణకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీటిలో కరిగే గంధ కం 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పంటకు ఆకులు తడి చేలా పిచికారీ చేయాలి. పై ముడత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎకరాకు జోలోన్  400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చే సుకోవాలి.

 పేనుబంక
 లేత కొమ్మల ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గుతుంది. ఇది తియ్యటి పదార్థాలను విసర్జించడం వల్ల చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు మసిపూసినట్లుగా నల్లగా మారిపోతాయి. పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

 పూత పురుగులు
 పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. తొలిచి చూస్తే ఈగ  పిల్ల పురుగులు, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 40 శాతం వరకు పూత రాలిపోతుంది. కాయలు ఏర్పడవు. ముందే ఏర్పడిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకర్లు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో ధరపలకదు.

నివారణకు ట్రైజోపాస్ ఎకరానికి 250 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత మరలా క్లోరోపైరిఫాస్ 500 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

 కాయతొలుచు పురుగు
 పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులు మొదటి దశలో మిరప ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లోకి చేరి గింజలను తినేస్తాయి. నివారణకు  థయోడికార్బ్ 200 గ్రాములు లే దా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా టోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఫినాల్‌ఫాస్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. గుడ్ల నుంచి అప్పుడే బయటికి వచ్చే పిల్లపురుగులను అరికట్టేందుకు నోవాల్యురాన్ 150 మిల్లీలీటర్లు లేదా డైప్లూబెంజురన్ 200 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి ఎకరాకు పిచికారీ చేయాలి.

విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దెపురుగులను నివారించవచ్చు. విషపు ఎర తయారీకి.. 5 కిలోల తవుడుకు 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 500 గ్రాముల బెల్లం, తగినంత నీటిని కలిపి చిన్నచిన్న గుళికలుగా తయారు చేసి సాయంత్రం వేళ చేలో సమానంగా చల్లితే నెర్రెల్లో దాగి ఉన్న పురుగులు రాత్రి వేళ బయటికి వచ్చి తిని చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతిని గుర్తించడానికి  ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చాలి.

ఎరలను మాత్రం 25 రోజులకు ఒకసారి మార్చాలి. ఆకర్షణ పైరుగా చేనులో ఆముదం, బంతి మొక్కలు వేసుకోవాలి. మిరప పంటకు పురుగుల మాదిరిగా పలురకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement