కలుపుతో కష్టమే | difficult with weed | Sakshi
Sakshi News home page

కలుపుతో కష్టమే

Published Tue, Aug 26 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

difficult with weed

నిజామాబాద్ వ్యవసాయం :  వరి దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది కలుపు. దీనిని నివారించకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే పంట దిగుబడులు పెరుగుతాయంటున్నారు.

 కలుపు మొక్కలతో సమస్యలు
 కలుపు మొక్కలు పంటతో పాటే మొలుస్తాయి. వాటితోపాటే పెరుగుతూ సూర్యరశ్మి, పోషకాలు, నీటి కోసం పోటీ పడతాయి. పైరు ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి. కలుపు మొక్క చీడపీడలకు ఆశ్రయం కల్పిస్తూ వాటి వ్యాప్తికి దోహదపడుతుంది. ఫలితంగా పంటకు అపార నష్టం వాటిల్లుతుంది. కలుపును సకాలంలో నిర్మూలించకపోతే సరైన దిగుబడులు రావు. ముఖ్యంగా వరి నాటిన ఆరు వారాల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

 ఉధృతికి కారణాలు
 పొలంలో దమ్ము సరిగా చేయకపోవడం, ఎరువుల ను ఎక్కువ మోతాదులో వేయడం, నీటి యాజమా న్య పద్ధతులను పాటించకపోవడం, పొట్టి వంగడాల్లో తొలి దశలో పెరుగుదల నిదానంగా ఉండడం, నారు మడిదశలో కలుపును నిర్మూలించకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది.

 సాధారణ కలుపు రకాలు
 గడ్డి జాతి, తుంగ, వెడల్పు ఆకుల మొక్కలు.

 కలుపు నివారణ పద్ధతులు యాజమాన్య పద్ధతులలో..
     
గట్టు మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి.
     
పొలాన్ని బాగా దమ్ము చేయాలి. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
     
పంట మార్పిడి చేయాలి. వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు ఉధృతి తగ్గుతుంది.
     
నాట్లు వేసిన 15-20, 35-40 రోజుల మధ్య కూలీలతో కలుపు తీయించాలి. కూలీలు దొరకని పక్షంలో కలుపు నివారణకు రసాయనిక మందులను వినియోగించాలి.

 రసాయనాలతో..
 నాటక ముందు
మాగాణి భూముల్లో తుంగ, గరిక వంటి మొక్కలు బాగా పెరిగినట్లైతే నాట్లు వేయడానికి నెల రోజుల ముందు లీటరు నీటికి 10 మి. లీటర్ల గ్లైఫోసేట్ 41శాతం, 10 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్/యూరియా కలిపి పిచికారి చేయాలి. తర్వాత పొలాన్ని దున్ని నాట్లు వేయాలి.
 
నాటిన 3-5 రోజుల మధ్య     
నాట్లేసిన 3-5 రోజులలోపు పొలంలో పలుచగా నీరు పారించి ఎకరానికి 4 కిలోల 2, 4-డి ఇథైల్ ఎస్టర్ 4 శాతం, 4 కిలోల బ్యూటాక్లోర్ 5 శాతం గుళికల్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి. గుళికల్ని చల్లిన మూడు రోజుల వరకు పొలంలో నీరు బయటకు పోకుండా, బయటి నీరు లోపలికి రాకుండా చూసుకోవాలి.
 
గడ్గి జాతి మొక్కలు ప్రత్యేకించి ఊద ఎక్కువగా ఉంటే ఎకరానికి 500 మి.లీటర్ల అనిలోఫాస్ 30 శాతం లేదా 500 మి.లీ.ప్రెటిలాక్లోర్ 50 శాతం లేదా 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50 శాతం, లేదా 1.5-2 లీటర్ల బెంథియోకార్బ్ 50 శాతంలలో ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి.
 
నాటిన 15-20 రోజుల మధ్య
ఏ కారణం చేతనైనా నాట్లు వేసిన 3-5 రోజులలోపు కలుపు మందులు పిచికారి చేయలేకపోతే, నాట్లు వేసిన 15-20 రోజుల మధ్య పొలం నుంచి నీటిని తీసి వేసి, గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 400 మి.లీటర్ల సైహాలోఫాప్ బ్యూటైల్ 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
     
గడ్డిజాతి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 100 మి.లీటర్ల బిస్‌పైరిబాక్ సోడియం 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసిన 2-3 రోజుల తర్వాత నీరు పెట్టాలి.

 నాటిన 35 రోజుల తర్వాత     
వరి నాటిన 35 రోజుల తర్వాత పిచ్చికాడ, బూరుగుకాడ, బొక్కినాకు, అగ్నివేండ్రపాకు వంటి ద్విదళబీజ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లైతే ఎకరానికి 400 గ్రాముల 2, 4-డి సోడియం సాల్ట్ 80 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చేతి పంపుతో సాధ్యమైనంత వరకు కలుపు మొక్కలపైనే పడేలా స్ప్రే చేయాలి. మందు పిచికారి చేసిన తర్వాత పైరు ఎర్రబడే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువును తగు మోతాదులో పై పాటుగా వేసుకోవాలి. లేదా ఎకరానికి 50గ్రాముల ఇథాక్సిసల్ఫ్యూ రాన్ 20 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement