సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడి రైతన్నకు దిగులు మిగిల్చింది. ఈసారి వరి ధాన్యం ఉత్ప త్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగినా, ఉత్పత్తి తగ్గడం గమనార్హం. 2017–18లో 94.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అర్థగణాంక శాఖ వర్గాలు తయారు చేసిన 2017–18 ఖరీఫ్, రబీ మూడో ముందస్తు అంచనా నివేదికను వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. 2016–17లో ఖరీఫ్, రబీల్లో 45.72 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 97.04 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం పండింది.
2017–18 వ్యవసాయ సీజన్‌లో 48.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 94.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గతం కంటే ఈసారి 2.43 లక్షల ఎకరాల్లో అదనంగా వరి సాగైనా, ఉత్పత్తి మాత్రం 2.73 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గడం విస్మయం కలిగిస్తోంది. ఖరీఫ్‌లో ఆకుచుట్టు పురుగు, కాండం తొలిచే పురుగు తదితర చీడపీడల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయశాఖ నిర్దారణకు వచ్చింది. రబీలోనూ కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నల్ల గొండ, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్‌కర్నూలు జిల్లా ల్లో చీడపీడలతో పెద్దఎత్తున వరికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. కాగా, వరి ఉత్పత్తి పడిపోయినా పత్తి, కంది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment