Rice yield
-
దిగులే దిగుబడి
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడి రైతన్నకు దిగులు మిగిల్చింది. ఈసారి వరి ధాన్యం ఉత్ప త్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగినా, ఉత్పత్తి తగ్గడం గమనార్హం. 2017–18లో 94.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అర్థగణాంక శాఖ వర్గాలు తయారు చేసిన 2017–18 ఖరీఫ్, రబీ మూడో ముందస్తు అంచనా నివేదికను వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. 2016–17లో ఖరీఫ్, రబీల్లో 45.72 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 97.04 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం పండింది. 2017–18 వ్యవసాయ సీజన్లో 48.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 94.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గతం కంటే ఈసారి 2.43 లక్షల ఎకరాల్లో అదనంగా వరి సాగైనా, ఉత్పత్తి మాత్రం 2.73 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గడం విస్మయం కలిగిస్తోంది. ఖరీఫ్‌లో ఆకుచుట్టు పురుగు, కాండం తొలిచే పురుగు తదితర చీడపీడల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయశాఖ నిర్దారణకు వచ్చింది. రబీలోనూ కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నల్ల గొండ, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్‌కర్నూలు జిల్లా ల్లో చీడపీడలతో పెద్దఎత్తున వరికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. కాగా, వరి ఉత్పత్తి పడిపోయినా పత్తి, కంది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. -
14 ఎకరాల నుంచి.. ఎకరానికి!
♦ రెండేళ్ల క్రితం వరకు 700 క్వింటాళ్ల వరి దిగుబడి ♦ ఇప్పుడు పది గుంటల్లో మాత్రమే వరి సాగు ♦ కరువే కారణమంటున్న ముకుందరెడ్డి రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెంది న గొట్టం ముకుందరెడ్డి అంటే మండలంలో తెలియనివారులేరు. రెండేళ్ల క్రితం వ్యవసాయ బావి, ఐదు బోర్లలో పుష్కలంగా నీరు.. 14 ఎకరాల్లో వరి సాగుతో ఆయన భూములన్నీ పచ్చని రంగేసినట్లుండేవి. ఏటా రెండు పంటలు పండించే ముకుందరెడ్డి పంటపై 650 నుంచి 700 క్వింటాళ్ల దిగుబడి తీసేవాడు. వరి పండించడంలో మండలంలోనే మేటి రైతుగా గుర్తింపు పొం దాడు. ఇదంతా గతం.. ప్రస్తుతం ఆయన పది గుంటల్లోనే పంట పండిస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులేర్పడడంతో బావి ఎండిపోయింది. నాలుగు బోర్లు వట్టిపోయాయి. గతేడాది రెండు ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశాడు. ఈ రబీలో కేవలం ఎకరమే సాగు చేశాడు. అందులో కూడా నీరు లేక 30 గుంటలు ఎండిపోయింది. ఉన్న ఒక్క బోరులో నీరు తగ్గి 15 రోజులుగా కేవలం పది గుంటల పొలమే పారుతోంది. మిగిలిన పంట ఎండిపోగా, పశువులకు మేతయ్యింది. చిన్ననాటి నుంచి ఏనాడు ఇంతటి దుర్భర పరిస్థితులు చూడలేదని అంటున్నాడు. పంట పండించడం లో అగ్రభాగాన నిలిచిన తాను కరువు పరి స్థితుల వల్ల అప్పు ఊబిలో చిక్కుకున్నానని ఆవేదన చెందుతున్నాడు. రైతులు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం గోదావరి జలాలతో చెరువులు నింపాలని, ఉపాధి హామీ పథకంలో చిన్ననీటి కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు. -
పరిహారం.. వట్టిదేనా?
వడగండ్ల నష్టం ప్రతిపాదనలకే పరిమితం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వడగండ్లు జిల్లాలో భారీగా దెబ్బతిన్న పంటలు 2,035.6 ఎకరాల్లో పాడైన వరి, పొద్దుతిరుగుడు నష్టం ఊసే ఎత్తని అధికారగణం ఎదుదు చూస్తున్న 2,391 మంది రైతులు జిల్లాలో వడగండ్ల వర్షాలతో జరిగిన నష్టం ప్రతిపాదనలకే పరిమితమైంది. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారంపై సర్కారు ఊసెత్తడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం, తాండూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షాలు పడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వరిపంట భారీగా దెబ్బతింది. దీంతోపాటు పొద్దుతిరుగుడు పంట కూడా పాడైంది. ఈ క్రమంలో అంచనాలకు ఉపక్రమించిన వ్యవసాయ శాఖ అధికారులు.. 50శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న రైతుల పంటనే పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,035.6 ఎకరాల్లో వరి, పొద్దుతిరుగుడు పంటలు పాడైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు పంటనష్టం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇంత వరకు పరిహారం అందలేదు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : వేసవిలో కురిసిన వడగండ్ల వానలతో జిల్లాలో పంటనష్టం భారీగా జరిగింది. దెబ్బతిన్న దాంట్లో ప్రధానంగా వరి పంట ఉంది. రెండు వేల ఎకరాల్లో పంట పూర్తిగా పాడవడంతో అందుకు సంబంధించి పెట్టుబడి పూర్తిగా నష్టపోగా.. శ్రమ వృధా కావడంతో 2,391 మంది రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో సగటున 13 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈక్రమంలో రెండువేల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో మొత్తంగా రూ.7.5 కోట్ల ఆర్థికనష్టం కలిగిందని రైతులు పేర్కొంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఎకరాలకు విధించిన పరిమిత పరిహారం ప్రకారం ప్రతిపాదనలు పంపింది. ఈ లెక్కన వ్యవసాయ శాఖ రూ.81.42లక్షలకే ప్రతిపాదనలు పంపుతూ.. ఈమేరకు పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు రెండు నెలలు గడిచినా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
కలుపుతో కష్టమే
నిజామాబాద్ వ్యవసాయం : వరి దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది కలుపు. దీనిని నివారించకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే పంట దిగుబడులు పెరుగుతాయంటున్నారు. కలుపు మొక్కలతో సమస్యలు కలుపు మొక్కలు పంటతో పాటే మొలుస్తాయి. వాటితోపాటే పెరుగుతూ సూర్యరశ్మి, పోషకాలు, నీటి కోసం పోటీ పడతాయి. పైరు ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి. కలుపు మొక్క చీడపీడలకు ఆశ్రయం కల్పిస్తూ వాటి వ్యాప్తికి దోహదపడుతుంది. ఫలితంగా పంటకు అపార నష్టం వాటిల్లుతుంది. కలుపును సకాలంలో నిర్మూలించకపోతే సరైన దిగుబడులు రావు. ముఖ్యంగా వరి నాటిన ఆరు వారాల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఉధృతికి కారణాలు పొలంలో దమ్ము సరిగా చేయకపోవడం, ఎరువుల ను ఎక్కువ మోతాదులో వేయడం, నీటి యాజమా న్య పద్ధతులను పాటించకపోవడం, పొట్టి వంగడాల్లో తొలి దశలో పెరుగుదల నిదానంగా ఉండడం, నారు మడిదశలో కలుపును నిర్మూలించకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది. సాధారణ కలుపు రకాలు గడ్డి జాతి, తుంగ, వెడల్పు ఆకుల మొక్కలు. కలుపు నివారణ పద్ధతులు యాజమాన్య పద్ధతులలో.. గట్టు మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేయాలి. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయాలి. వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు ఉధృతి తగ్గుతుంది. నాట్లు వేసిన 15-20, 35-40 రోజుల మధ్య కూలీలతో కలుపు తీయించాలి. కూలీలు దొరకని పక్షంలో కలుపు నివారణకు రసాయనిక మందులను వినియోగించాలి. రసాయనాలతో.. నాటక ముందు మాగాణి భూముల్లో తుంగ, గరిక వంటి మొక్కలు బాగా పెరిగినట్లైతే నాట్లు వేయడానికి నెల రోజుల ముందు లీటరు నీటికి 10 మి. లీటర్ల గ్లైఫోసేట్ 41శాతం, 10 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్/యూరియా కలిపి పిచికారి చేయాలి. తర్వాత పొలాన్ని దున్ని నాట్లు వేయాలి. నాటిన 3-5 రోజుల మధ్య నాట్లేసిన 3-5 రోజులలోపు పొలంలో పలుచగా నీరు పారించి ఎకరానికి 4 కిలోల 2, 4-డి ఇథైల్ ఎస్టర్ 4 శాతం, 4 కిలోల బ్యూటాక్లోర్ 5 శాతం గుళికల్ని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి. గుళికల్ని చల్లిన మూడు రోజుల వరకు పొలంలో నీరు బయటకు పోకుండా, బయటి నీరు లోపలికి రాకుండా చూసుకోవాలి. గడ్గి జాతి మొక్కలు ప్రత్యేకించి ఊద ఎక్కువగా ఉంటే ఎకరానికి 500 మి.లీటర్ల అనిలోఫాస్ 30 శాతం లేదా 500 మి.లీ.ప్రెటిలాక్లోర్ 50 శాతం లేదా 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50 శాతం, లేదా 1.5-2 లీటర్ల బెంథియోకార్బ్ 50 శాతంలలో ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలం అంతటా సమానంగా పడేలా చల్లాలి. నాటిన 15-20 రోజుల మధ్య ఏ కారణం చేతనైనా నాట్లు వేసిన 3-5 రోజులలోపు కలుపు మందులు పిచికారి చేయలేకపోతే, నాట్లు వేసిన 15-20 రోజుల మధ్య పొలం నుంచి నీటిని తీసి వేసి, గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 400 మి.లీటర్ల సైహాలోఫాప్ బ్యూటైల్ 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. గడ్డిజాతి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరానికి 100 మి.లీటర్ల బిస్పైరిబాక్ సోడియం 10 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసిన 2-3 రోజుల తర్వాత నీరు పెట్టాలి. నాటిన 35 రోజుల తర్వాత వరి నాటిన 35 రోజుల తర్వాత పిచ్చికాడ, బూరుగుకాడ, బొక్కినాకు, అగ్నివేండ్రపాకు వంటి ద్విదళబీజ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లైతే ఎకరానికి 400 గ్రాముల 2, 4-డి సోడియం సాల్ట్ 80 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చేతి పంపుతో సాధ్యమైనంత వరకు కలుపు మొక్కలపైనే పడేలా స్ప్రే చేయాలి. మందు పిచికారి చేసిన తర్వాత పైరు ఎర్రబడే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎరువును తగు మోతాదులో పై పాటుగా వేసుకోవాలి. లేదా ఎకరానికి 50గ్రాముల ఇథాక్సిసల్ఫ్యూ రాన్ 20 శాతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.