♦ రెండేళ్ల క్రితం వరకు 700 క్వింటాళ్ల వరి దిగుబడి
♦ ఇప్పుడు పది గుంటల్లో మాత్రమే వరి సాగు
♦ కరువే కారణమంటున్న ముకుందరెడ్డి
రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెంది న గొట్టం ముకుందరెడ్డి అంటే మండలంలో తెలియనివారులేరు. రెండేళ్ల క్రితం వ్యవసాయ బావి, ఐదు బోర్లలో పుష్కలంగా నీరు.. 14 ఎకరాల్లో వరి సాగుతో ఆయన భూములన్నీ పచ్చని రంగేసినట్లుండేవి. ఏటా రెండు పంటలు పండించే ముకుందరెడ్డి పంటపై 650 నుంచి 700 క్వింటాళ్ల దిగుబడి తీసేవాడు. వరి పండించడంలో మండలంలోనే మేటి రైతుగా గుర్తింపు పొం దాడు. ఇదంతా గతం.. ప్రస్తుతం ఆయన పది గుంటల్లోనే పంట పండిస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులేర్పడడంతో బావి ఎండిపోయింది. నాలుగు బోర్లు వట్టిపోయాయి.
గతేడాది రెండు ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశాడు. ఈ రబీలో కేవలం ఎకరమే సాగు చేశాడు. అందులో కూడా నీరు లేక 30 గుంటలు ఎండిపోయింది. ఉన్న ఒక్క బోరులో నీరు తగ్గి 15 రోజులుగా కేవలం పది గుంటల పొలమే పారుతోంది. మిగిలిన పంట ఎండిపోగా, పశువులకు మేతయ్యింది. చిన్ననాటి నుంచి ఏనాడు ఇంతటి దుర్భర పరిస్థితులు చూడలేదని అంటున్నాడు. పంట పండించడం లో అగ్రభాగాన నిలిచిన తాను కరువు పరి స్థితుల వల్ల అప్పు ఊబిలో చిక్కుకున్నానని ఆవేదన చెందుతున్నాడు. రైతులు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం గోదావరి జలాలతో చెరువులు నింపాలని, ఉపాధి హామీ పథకంలో చిన్ననీటి కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు.
14 ఎకరాల నుంచి.. ఎకరానికి!
Published Tue, Mar 29 2016 4:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement