పరిహారం.. వట్టిదేనా?
వడగండ్ల నష్టం ప్రతిపాదనలకే పరిమితం
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వడగండ్లు
జిల్లాలో భారీగా దెబ్బతిన్న పంటలు
2,035.6 ఎకరాల్లో పాడైన వరి, పొద్దుతిరుగుడు
నష్టం ఊసే ఎత్తని అధికారగణం
ఎదుదు చూస్తున్న 2,391 మంది రైతులు
జిల్లాలో వడగండ్ల వర్షాలతో జరిగిన నష్టం ప్రతిపాదనలకే పరిమితమైంది. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారంపై సర్కారు ఊసెత్తడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం, తాండూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షాలు పడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వరిపంట భారీగా దెబ్బతింది. దీంతోపాటు పొద్దుతిరుగుడు పంట కూడా పాడైంది. ఈ క్రమంలో అంచనాలకు ఉపక్రమించిన వ్యవసాయ శాఖ అధికారులు.. 50శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న రైతుల పంటనే పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,035.6 ఎకరాల్లో వరి, పొద్దుతిరుగుడు పంటలు పాడైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు పంటనష్టం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇంత వరకు పరిహారం అందలేదు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : వేసవిలో కురిసిన వడగండ్ల వానలతో జిల్లాలో పంటనష్టం భారీగా జరిగింది. దెబ్బతిన్న దాంట్లో ప్రధానంగా వరి పంట ఉంది. రెండు వేల ఎకరాల్లో పంట పూర్తిగా పాడవడంతో అందుకు సంబంధించి పెట్టుబడి పూర్తిగా నష్టపోగా.. శ్రమ వృధా కావడంతో 2,391 మంది రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో సగటున 13 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈక్రమంలో రెండువేల ఎకరాల్లో పంట నష్టం జరగడంతో మొత్తంగా రూ.7.5 కోట్ల ఆర్థికనష్టం కలిగిందని రైతులు పేర్కొంటున్నారు.
అయితే అధికారులు మాత్రం ఎకరాలకు విధించిన పరిమిత పరిహారం ప్రకారం ప్రతిపాదనలు పంపింది. ఈ లెక్కన వ్యవసాయ శాఖ రూ.81.42లక్షలకే ప్రతిపాదనలు పంపుతూ.. ఈమేరకు పరిహారం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు రెండు నెలలు గడిచినా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.