అవును.. ఇంగ్లండ్‌లో శాస్త్రవేత్తలు అటూఇటుగా చెబుతున్నది ఇదే. అక్కడి గోధుమ తదితర ఆహార పంటల్లో బ్లాక్ గ్రాస్ రకం కలుపు పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో ఎన్ని కలుపుమందులు చల్లినా ఈ గడ్డి మాత్రం చావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్ శాస్త్రవేత్తల సారథ్యంలో రొథమ్‌స్టెడ్ రీసెర్చ్, జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ నిపుణులు బ్లాక్ గ్రాస్‌పై కలుపు మందుల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అధ్యయనం చేశారు. ఇంగ్లండ్ నలుచెరగుల నుంచి 70 వ్యవసాయ క్షేత్రాల్లో ఈ గడ్డి అడ్డూఅదుపూ లేకుండా బలిసిపోయిందట. 132 గోధుమ పొలాల నుంచి కలుపు విత్తనాలను సేకరించి పరీక్షించారు. ఫలితాలను చూసి అవాక్కయ్యారు. నమూనాల్లో 80% ఏ రకమైన కలుపు మందులకూ లొంగలేదని రొథమ్‌స్టెడ్ స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ కార్యక్రమ సారథి, కలుపు నిపుణుడు డా. పాల్ నెవె తెలిపారు. ఈ వివరాలను నేచర్ ఎకాలజీ, ఎవల్యూషన్ పత్రిక ఇటీవల ప్రచురించింది.
పూర్వం నుంచే విరివిగా కలుపు రసాయనిక మందులు వాడటం వల్ల బ్లాక్ గ్రాస్ ఇప్పుడు ఏ కలుపు మందు చల్లినా చావని గడ్డు స్థితి వచ్చిందని, ఈ సమస్యను అధిగమించడానికి చేపట్టిన యాజమాన్య చర్యలేవీ ఫలించలేదని డా. పాల్ వివరించారు. కలుపు మందులకు ఎంత ఖర్చు పెట్టినా కలుపు చావలేదని, పంట దిగుబడులు తగ్గి ఆదాయం తగ్గిపోయిందని రైతులు గొల్లుమన్నారు.
చాలా ఎక్కువ సార్లు కలుపు మందు చల్లడం.. అనేక రకాల కలుపు మందులు కలిపి చల్లడం లేదా వేర్వేరుగా ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయటం.. ఇవేవీ కలుపును అరికట్టలేకపోగా సమస్యను మరింత జటిలం చేశాయని శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. ఇంకేవో కొత్త రకం మందులు తెచ్చి చల్లినా ఉపయోగం ఉండబోదని, రసాయనిక కలుపు మందుల మీద ఆధారపడటం తగ్గించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఇంగ్లండ్ రైతుల చేదు అనుభవం గ్రహించైనా మన రైతులు ముందు జాగ్రత్త పడాల్సి ఉంది..! కాదంటారా?
దుంపతెంచిన కలుపు మందులు
Published Tue, Feb 20 2018 12:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment