అన్నదాతకు భరోసా! | Ensuring annadataku! | Sakshi
Sakshi News home page

అన్నదాతకు భరోసా!

Published Sun, Nov 16 2014 3:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అన్నదాతకు భరోసా! - Sakshi

అన్నదాతకు భరోసా!

అధికారిగా ఆదేశాలు ఇస్తూ.. శాస్త్రవేత్తగా సలహాలు చెబుతూ.. సమస్యలపై వెంటనే స్పందిస్తూ.. గిట్టుబాటు ధరను కచ్చితంగా కల్పిస్తామని రైతులకు భరోసా కల్పించారు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) కన్నబాబు. జిల్లాలో భారీగా పత్తి పంట సాగైన నేపథ్యంలో లక్షలాది టన్నుల పత్తి కొనుగోలు చేసే ఆదోని మార్కెట్ యార్డును ‘సాక్షి’ తరపున ఆయన వీఐపీ విలేకరిగా మారి సందర్శించారు. పత్తి అమ్ముకునేందుకు యార్డుకు వచ్చిన రైతులందరినీ ఒక్కొక్కరిగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రైతులు చెప్పిన సమస్యలపై వెంటనే అధికారులను నిలదీశారు. సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. పైకం వెంటనే ఇచ్చేందుకు రెండు కమీషన్లు వసూలు చేస్తూ రైతులను జలగల్లా పట్టి పీడిస్తున్న కమీషన్ ఏజెంట్లను హెచ్చరించారు. చట్టానికి భిన్నంగా అధిక వడ్డీలను వసూలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతీ పత్తి గింజకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.

ధర ఎక్కువగా ఉందని ఒకే పంటను అందరూ సాగుచేయవద్దని, పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని రైతులకు సలహా ఇచ్చారు. భోజనం బాగోలేదని రైతులు ఫిర్యాదు చేస్తే... సదరు నిర్వాహక సంస్థపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధర తగ్గితే సీసీఐని రంగంలోకి దించుతామన్నారు. జీరో వ్యాపారం, దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం మీద రైతులకు భరోసానిస్తూ.. ధైర్యం చెబుతూ ఆయన మాటామంతీ సాగింది.

 రైతులతో జేసీ మాటా మంతీ..!
 జేసీ : మీ పేరేమి, ఏ ఊరు నుంచి వచ్చావు. యార్డుకు ఏమి తెచ్చావు?
 రైతు : నా పేరు కృష్ణ సార్, మాది గోనెగండ్ల మండలం బైలుప్పల. ఒక ఎకరాలో పత్తి పంట సాగు చేశాను. ఇంతకు ముందు రెండు చెక్కులు అమ్మాను సార్. ఇప్పుడు ఒక చెక్కు తెచ్చా.
 జేసీ : పోయినసారి ఎన్ని క్వింటాళ్లు అమ్మావు? ఇపుడెంత తెచ్చావు?
 రైతు : మొన్న మూడు క్వింటాళ్లు.. ఇప్పుడు క్వింటంన్నర అవుతుందేమో..
 జేసీ : గిట్టుబాటు ధర లభిస్త్తోందా?
 రైతు: ఈ సంవత్సరం రేటు బాగా తగ్గింది. ఇంకా టెండర్లు పూర్తి కాలేదు సార్. నిరుడు కన్నా ఈ ఏడు ధర బాగా తగ్గింది సార్. నిన్న మంచి రేటు ఉంది. పత్తి క్వింటాలు రూ.4150 పలికింది. ఈ రోజు కూడా అంతే పలుకొచ్చు.
 జేసీ : గత సంవత్సరం ధర బాగుందని ఈ ఏడు 2.68 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఇలా అందరు ఒకే పంట సాగు చేస్తే ధర రాదు. అయితే మద్దతు ధర కన్నా ఎక్కువగానే ఉంది.
 జేసీ : పైకం ఎప్పుడు చెల్లిస్తారు?
 రైతు : వెంటనే చెల్లిస్తారు సార్.
 జేసీ : ఇంకో రైతుతో మాట్లాడుతూ.. మీది ఏ ఊరు ఏమి తెచ్చారు?
 రైతు : నా పేరు రంగన్న. ములుగుందం నుంచి వచ్చాను సార్, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. క్వింటాలు రూ.ఐదు వేలు పెట్టి బుడ్డలు(వేరుశనగ) కొని విత్తాను. ఇప్పుడు మార్కెట్‌లో క్వింటాలు రూ.మూడు, మూడున్నర వేలు మాత్రం పలుకుతోంది. పత్తి పంట గిట్టుబాటు కూడా అంతంత మాత్రమే. వర్షాలు లేక పోయినసారి బుడ్డల దిగుబడి బాగా తగ్గింది సార్, ఈ ఏడు బుడ్డలు లాభం లేదనందుకు అందరూ పత్తిపై పడ్డారు.
 జేసీ : చైనా, ఇతర దేశాలలో కూడా పత్తి పంట బాగుంది. దీంతో ఎగుమతి చేయడం లేదు. దీని వల్ల ధర పెరిగే అవకాశాలు చాలా తక్కువ. వేలం వెర్రిగా వేసుకోకుండా మీకు ఏదీ గిట్టుబాటు అవుతుందో చూసుకోవాలి. పంటను కూడా రోటేట్(పంట మార్పిడి) చేయాలి. మార్కెట్‌పై కూడా మీకు అవగాహన ఉండాలి.  ప్రణాళిక ఉండాలి.
 రైతు : ప్రణాళిక ప్రభుత్వమే రూపొందించాలి. మా స్థాయిలో సాధ్యం కాదు.
 జేసీ : నిజమే.. పంటలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. పంట ఒలిపించేందుకు ఎంత మంది అవసరం అవుతారు?
 రైతు: ఎకరాాకు పత్తి ఒలిపించేందుకు ఎనిమిది మంది కూలీలు అవసరం అవుతారు. కూలీ రోజుకు రూ. 200. ఎకరాకు రూ.1600 అవుతోంది. ఎరువులు, పురుగు మందులు ఇతర ఖర్చులు అన్ని కలుపుకుంటే పత్తి ధర క్వింటాలు కనీసం రూ.5000 ఉండాలి. ఈ ఏడు వానలు సరిగా లేవు. ఎకరాకు వేరుశనగ, పత్తి దిగుబడులు ఐదు క్వింటాలు వస్తే అదృష్టమే.
 మరో రైతు జేసీతో మాట్లాడుతూ : మాది కుప్పగల్లు. ఏజెంట్లు రెండు రకాల కమీషన్లు తీసుకుంటున్నారు. మా దిగుబడులకు నెట్ అమౌంట్ ఇస్తే రెట్టింపు కమీషన్ తీసుకుంటున్నారు. వచ్చినకాటికి పోయిందన్నట్లు రైతుల అతృత, అవసరం కోసం అమ్మేసుకుంటున్నాం సార్, వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పు తీసుకున్న రైతులకు రెట్టింపు కమీషన్‌తో పాటు రెండు శాతం వడ్డీ కూడా పట్టుకుంటున్నారు. మా డబ్బు మాకు ఇచ్చేందుకు ఇలా దోపిడీ చేయడం న్యాయమా సార్? సీసీఐకు అమ్ముకుందామంటే పైకం రెండు నెలల తరువాత ఇస్తున్నారు. దీంతో కమీషన్ ఏజెంటు ద్వారే అమ్ముకోవాల్సి వస్తోంది. వర్షంలో తడిస్తే బాదు రూపంలో 10 నుంచి 15 కిలోలు తూకం తగ్గిస్తున్నారు.
 జేసీ : యార్డు నిబంధనల మేరకు రెట్టింపు కమీషన్, వడ్డీ వసూలు చేయరాదు. అక్రమంగా వసూలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వర్షంలో తడిస్తే వ్యాపారులకైనా నష్టమే. అందుకే వర్షంలో తడవకుండా కవర్డ్ ప్లాట్ ఫారంలు నిర్మిస్తున్నాము. పక్షం రోజుల్లో పనులు పూర్తి అవుతాయి.
 మరో రైతు : సర్ నా పేరు శేఖర్‌రెడ్డి మాది గొల్లవానిపల్లె. పత్తి బాగుంటేనే సీసీఐ వాళ్లు కొంటున్నారు. దీనివల్ల చాలా మందికి మద్దతు ధర లబించడం లేదు. క్వింటాలు రూ. నాలుగు వేల లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. తక్కువ ధరకు అమ్ముకుని, కూలీలు, కమీషన్ భరించడం కన్నా బయట అమ్ముకోవడమే మంచిదని చాలా మంది రైతులు భావిస్తున్నారు. కొందరు రైతులు నేరుగా పత్తి ఫ్యాక్టరీలకే అమ్ముకుంటున్నారు. మరి కొందరు తమ ఊరికి వచ్చే వ్యాపారులకు ఇంటి వద్దే అమ్ముకుంటున్నారు. దీని వల్ల యార్డు, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం తగ్గుతోంది. సీసీఐ నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
 జేసీ : రైతులు కూడా పత్తిపై నీరు చల్లుతున్నారు. ఇది మంచిది కాదు. తూకం కొంత పెరిగినా..ధర తగ్గి నష్టపోతారు. ఇలా చేయవద్దు. తేమ 8 శాతం లోపు ఉండేలా చూసుకోవాలి. సెక్రెటరీ గారు. ఎవరైనా ఒక కమీషన్ ఏజెంటును పిలువండి. రైతుల నుంచి రెట్టింపు కమీషన్, వడ్డీ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం కాదా? ఇలా చేస్తే లెసైన్స్ రద్దు అవుతోంది ఈ విషయం తెలుసా?
 కమీషన్ ఏజెంట్ (బసవరాజు) : వ్యాపారులు తాము కొనుగోలు చేసిన దిగుబడులకు వారంలోగా పైకం చెల్లించాలి. అయితే 20 రోజుల నుంచి నెల చేస్తున్నారు. దీని వల్ల ఏజెంట్లు నష్టపోతున్నారు. వ్యాపారులు వారంలోగా పైకం చెల్లిస్తే ఏ సమస్య ఉండదు
 జేసీ : ఉండొచ్చు. ఇందుకు రైతులను బాధ్యులుగా చేయడం న్యాయం కాదు కదా? ఇకపై అలా జరగకూడదు.
 జేసీ : యార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా?
 రైతు : సర్ నా పేరు తిరుమలేష్, గోనెగండ్ల నుంచి వచ్చాను. యార్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. సీజన్‌లో కాలు పెట్టేందుకు కూడా చోటు ఉండదు. దీంతో దిగుబడులు అమ్ముకోడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది.
 జేసీ : సెక్రెటరీ గారు నిజమేనా?
 సెక్రెటరీ(రామారావు) : టీఎంసీలో కవర్డ్ ప్లాట్ ఫారం నిర్మాణం జరుగుతోంది. దీంతో పత్తి, ఇతర దిగుబడులు కూడా ఒకే యార్డులో క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. టీఎంసీలో పనులు పూర్తి అయితే పత్తిని ఆ యార్డుకు తరలిస్తాము.
 జేసీ : పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి?
 సెక్రెటరీ : 15 రోజుల్లో పూర్తి అవుతాయి.
 రైతు : సర్ నా పేరు రామన్న, హాల్వి నుంచి వచ్చాను. యార్డులో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కొందరు హమాలీలు డబ్బా వేరుశనగను ఖుషీ పేరుతో బలవంతంగా తీసుకుంటున్నారు.
 జేసీ : ఇకపై అలా జరుగదు. ఇలాంటివి గుర్తించేందుకు యార్డులో సీసీ కెమెరాలు పెడుతున్నాము. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తి అవుతాయి. ఎవరైనా రైతుకు అన్యాయం చేస్తే సీసీ పుటేజీలలో గుర్తించి చర్యలు తీసుకుంటాము.


 మరో రైతు నర్సయ్య : సర్  రైతులు ఎప్పుడు నష్టపోవాల్సిందేనా? విత్తనాలు కొనేటప్పుడు ధర పెరుగుతోంది. పండించిన పంట దిగుబడులు అమ్ముకునే సమయానికి ధర తగ్గుతోంది. ఇలా అయితే మేము ఎప్పుడు బాగు పడుతాము. ఈ ఏడు వేరుశనగ క్వింటాలు రూ. ఐదు వేలకు కొన్నాము. ఇప్పుడు రూ.మూడు, మూడున్నర వేలకు అమ్ముకుంటున్నాము. కూలీల రేట్లు పెరుగుతున్నాయి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇలా అన్ని ధరలు పెరుగుతున్నాయి మేము పండించినప్పుడుమాత్రం ధరలు  తగ్గుతున్నాయి. నాణ్యతతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర నిర్ణయించాలి.


 జేసీ : ధర తగ్గితే ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేస్తోంది. రైతులు చేయాల్సిందల్లా పత్తిని నాణ్యతగా మార్కెట్‌కు తీసుకురావడమే. అయితే అడంగల్ తీసుకురావాలి. లేదంటే వ్యాపారులే అమ్ముకుని లబ్ధి పొందే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement