- వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసులు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : రానున్న ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు ఎన్.శ్రీనివాసులు తెలిపారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శనివారం ఏడీఆర్ వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన శిక్షణ, సందర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులకు అవసరమైన అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏడీఆర్ వీరభద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. చింతపల్లి ఏడీఆర్ ఎన్. వేణుగోపాలరావు మాట్లాడుతూ తమ పరిశోధనా స్థానంలో రైతులకు అందజేసేందుకు సాంబ మసూరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను విస్తరణ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
శాస్త్రవేత్తల సూచనలు
శిక్షణ, సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కె.మోసా మాట్లాడుతూ చెరకులో పోటాష్ లోపం ఎక్కువుగా కనిపిస్తున్నందున రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందుగానే ఈ లోపాన్ని తెలుసుకోవడం వల్ల నష్టాన్ని అరికట్టవచ్చని తెలిపారు.
గిరిజన ప్రాంత రైతులు వేరుశెనగ పంట సాగు చేసేటప్పుడు నాటిన 30 రోజుల్లో ఎకరానికి 20 కిలోల చొప్పున జిప్సమ్ వేసుకోవాలన్నారు. వరి సాగులో స్వర్ణ, శ్రీకాకుళం సన్నాల వంటి రకాల విత్తనాల కొరత ఏర్పడినట్లయితే ప్రత్యామ్నాయాలు ఏంటని వ్యవసాయాధికారులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి సమాధానమిస్తూ అమర, ఇంద్ర రకాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని సూచించారు.
నాట్లు ఆలస్యమైన పరిస్థితులలో ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం మేలన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఆర్థిక శాస్త్రవేత్త హెచ్.శ్రీనివాసరావు వ్యవహరించారు.