సాక్షి, అమరావతి: నైరుతిలో కురిసే తొలకరి వర్షాలకే విత్తనాలు వేయకుండా, భూమి పదునయ్యే దాకా కొద్దిగా ఆగాలని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రిడా) శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట తొలకరిలో వచ్చిన తొలి వానలకే విత్తనాలు వేశారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు నష్టపోయారు. ఒకటికి రెండు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ప్రత్యేకించి పత్తి, వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముందస్తుగా పత్తి వేసే రైతులు బిందు సేద్యం పద్ధతి పాటించడం ఉత్తమం. తుపాన్లు, అల్పపీడనాల ప్రభావంతో ఇటీవల అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తినప్పటికీ ఆ తర్వాత వర్షాలు రాకుంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. నాలుగు నుంచి ఆరంగుళాల లోతు వరకు నేల తడవడం ముఖ్యమని, అలాంటి వర్షాలు కురిశాకే విత్తనాలు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విత్తనాలు వేయడం వారం ఆలస్యమైనా ఇబ్బంది లేదని డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.
తక్కువ నీటితో సాగయ్యే పంటలు మేలు..
తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గోదావరి జిల్లాల్లో వరి తప్ప ప్రత్యామ్నాయం లేకున్నా సాగు విస్తీర్ణాన్ని కుదించుకుని వేరే పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు విస్తరిస్తోంది. మాగాణి భూముల్లోనూ కంది, పెసర, మినుము వంటి తక్కువ నీటితో సాగయ్యే వంగడాలు వేసుకోవచ్చు. ప్రతి పంటలోనూ తక్కువ వ్యవధిలో పండే వంగడాలొచ్చాయి. దగ్గర్లోని ఏ వ్యవసాయాధికారిని సంప్రదించినా మరిన్ని వివరాలు చెబుతారు. అలాగే ఎరువుల వాడకంలోనూ జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలంటున్నారు. విత్తనాలు వేసే సమయంలో ఒకేసారి ఎక్కువ ఎరువుల్ని కుమ్మరించినంత మాత్రాన ఫలితం ఉండదంటున్నారు. రెండు మూడు దఫాలుగా వేయాలని చెబుతున్నారు. పత్తి, వేరుశనగ రైతులు ఈ విషయాన్ని విధిగా గుర్తుపెట్టుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.
భూమి పదునయ్యాకే విత్తడం మేలు
Published Tue, Jun 8 2021 6:03 AM | Last Updated on Tue, Jun 8 2021 6:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment