సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పసుపు పంట తవ్వకాలు మొదలైన నేపథ్యంలో దిగుబడులు, నాణ్యతలపై పరిశోధన జరిపితే రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందనే శాస్త్రవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పసుపు పరిశోధన కేంద్రాల ఆధ్వర్యంలో ఇప్పుడు తవ్వుతున్న పసుపు పంట దిగుబడులు, నాణ్యత ఆంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని రైతులు కూడా చెబుతున్నారు. గతంలో రైతులు సాంప్రదాయ పద్దతిలోనే పసుపు పంటను సాగు చేసేవారు. అంతేకాక ఎర్రగుంటూర్, ఆర్మూర్ రకం పసుపు విత్తనాలను ఎక్కువగా వినియోగించేవారు.
ఇప్పుడు మాత్రం ఏసీసీ 79, ప్రతిభ రకం తదితర కొత్త పసుపు వంగడాలను వినియోగించి పంటను సాగు చేశారు. విరివిగా వినియోగించే పసుపు పసుపు వంగడాల కంటే కొత్త రకం వంగడాలను వినియోగించడం వల్ల దిగుబడుల్లో తేడా కనిపిస్తుంది. రెండేళ్ల కింద ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే ఈ సారి వినియోగించిన కొత్త రకాల వల్ల 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. అంటే వంగడాలను మార్చడం వల్ల రైతులకు ప్రయోజనం ఏర్పడింది. పసుపు పరిశోధన కేంద్రాల్లో ప్రధానమైనది కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశోధన కేంద్రం ఒకటి కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు పరిశోధన కేంద్రాలు ధర్పల్లి, వేల్పూర్‌లలో ఉన్నాయి.
ఈ పసుపు పరిశోధన కేంద్రాల పరిధిలో పసుపు పంట విస్తారంగా సాగు అవుతుంది. ఏ రకం పసుపు విత్తనం వినియోగిస్తే ఎంత దిగుబడి లభించింది, ఎంత నాణ్యత ఉంది అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు పంటను కొనుగోలు చేసే వ్యాపారులు పసుపులోని కర్కుమిన్ శాతంను పరిగణలోకి తీసుకుంటున్నారు. కర్కుమిన్ శాతం 4.5 కంటే ఎక్కువ ఉన్న పసుపును కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. కర్కుమిన్ శాతం కూడా కొత్త రకం వంగడాలను వినియోగించి సాగు చేసిన పసుపులోనే ఎక్కువగా ఉంది.
అంటే సాంప్రదాయ పద్దతిలోను, పాత రకం వంగడాలను వినియోగించి సాగు చేసిన పసుపు వల్ల రైతులకు ప్ర యోజనాలు అంతగా లేవని స్పష్టం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు దిగుబడులు, నాణ్యతలపై పరిశోధన జరిపి వచ్చే సీజనులో రైతులు ఎలాంటి విధానంలో ఎలాంటి రకం వంగడాలను విని యోగించాలో సూచిస్తే రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని పలువురు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment