రైతులు అధైర్యపడొద్దు: ఎంపీ కవిత
నిజామాబాద్ : అకాల వర్షాలకు పంట నష‍్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను టీఆర్‌ఎస్ ఎంపీ కవిత శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర‍్షానికి అత్యధికంగా కౌలు రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడొద్దన్నారు.
సీఎం కేసీఆర్‌కు పరిస్థితిని వివరించి నష్ట పరిహారం అందేలా చూస్తామన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో 25 వేల హెక్టార్లతో పంట నష్టం జరిగిందని తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఫసల్ బీమా పథకం పరిహారం సరిపోవడం లేదన్నారు. ఇచ్చిన పరిహారం కూడా సమయానికి అందడం లేదని చెప్పారు. కంపెనీలు క్లెయిమ్ ఇవ్వకపోవడంతో రైతులు బీమా చేయించుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు.