సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంపై రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ స్పందించారు. తాజా పరిణామాలపై డీఎస్‌ను ప్రశ్నించిన మీడియాతో ఆయన ‘నో కామెంట్’ అని బదులిచ్చారు. జిల్లానేతలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని, ఆ విషయాన్ని వారినే అడగాలని చెప్పుకొచ్చారు. సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండన్నారు. ‘నేతలు అన్నది ఫిర్యాదు మాత్రమే కదా.. నా గొంతు కోస్తామని చెప్పలేదు కదా’ అని డీఎస్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానిప్పుడే ఏం మాట్లాడలేనని తెలిపారు.
కాగా, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయంతో డీఎస్ తన కుమారుడు సంజయ్, ముఖ్య అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కారణమిదేనా?
టీఆర్‌ఎస్‌లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన డీఎస్ పార్టీ మారాలనుకున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఓ కుమారుడు అరవింద్ బీజేపీలో చేరగా, మరో కుమారుడు సంజయ్‌కి పార్టీలో ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వాలని పలుమార్లు పార్టీ అధిష్టానికి డీఎస్ సూచించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన కుమారుడికి ప్రాధాన్యం లభించకపోవడంతో డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేస్తుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
కొద్ది రోజుల క్రితం మున్నూరు కాపు సమావేశంలో పాల్గొన్న డి. శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయి ఉండి, టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరావని కుల సంఘం నేతలు నిలదీశారు. ‘డీఎస్‌ను మేం ఆహ్వానించలేదు.. గతిలేక మా పార్టీలో చేరారు’ అని కవిత వ్యాఖ్యానించారని కుల సంఘం నేతలు డీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక టీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యత లేదని నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతోనే డీఎస్ పార్టీ మారే ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో డీఎస్ రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం..
Comments
Please login to add a commentAdd a comment