2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’ | Central Government Can help the Farmers Invest in theCcountry | Sakshi
Sakshi News home page

2.18 కోట్ల మందికి ‘పెట్టుబడి’

Published Mon, Apr 8 2019 4:31 AM | Last Updated on Mon, Apr 8 2019 4:31 AM

Central Government  Can help the Farmers Invest in theCcountry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసింది. తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మంది రైతులకు రూ. 4,366 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఐదెకరాలలోపున్న నిర్దేశిత సన్న చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చుల నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్‌ వచ్చే నాటికి నిధులను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలు అయ్యాక మిగిలిన రైతులకు కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  

తెలంగాణలో 14.41 లక్షల మందికి 
ఐదెకరాలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఉన్నతాదాయ వర్గాలంతా అనర్హులని పీఎం–కిసాన్‌ పథకం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు. తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ తాజా, మాజీ చైర్మన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైర్‌ అయిన ఉద్యోగులు, అధికారులు అనర్హులు. స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు కూడా అనర్హులే. 10 వేల రూపాయలకు మించి పింఛన్‌ తీసుకునే ఉద్యోగులంతా అనర్హుల జాబితా కిందకే వచ్చారు.

డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులకు ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. దీంతో తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు దాదాపు 47 లక్షల మంది ఉంటే, వారిలో కేవలం 26 లక్షల మంది మాత్రమే పీఎం–కిసాన్‌ పథకానికి అర్హులయ్యారు.  తెలంగాణ లో 14.41 లక్షల మంది రైతులకు రూ.288 కోట్లు విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా ఏపీలో 32.15 లక్షల మంది రైతులకు రూ.643 కోట్లు అందజేసింది. ఆ తర్వాత గుజరాత్‌ రాష్ట్రంలో 25.58 లక్షల మంది రైతులకు రూ. 511.62 కోట్లు అందజేసింది. అత్యంత తక్కువగా ఛత్తీస్‌గఢ్‌లో 36 మంది రైతులకు రూ.72 వేలు అందజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement