
సాక్షి, హైదరాబాద్: ఆకలి కేకలు, అన్నదాతలకు నష్టాలు తగ్గేదిశగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా నిల్వ చేసేందుకు సరికొత్త పదార్థం కనుగొన్నారు. ప్లాస్టిక్‌కు వేపనూనె జతచేసి నానో స్థాయి ప్లాస్టిక్ పదార్థం రూపొం దించారు. ఈ నానో ప్టాస్టిక్ పోగులతో తయారైన సంచుల్లో ఉంచిన విత్తనాలు 75 రోజుల తరువాత కూడా తాజాగానే ఉంటాయని ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంచుల్లో విత్తనాలు ఇదే కాలవ్యవధికి 70 శాతం మాత్రమే తాజాగా మిగులుతుండగా, కొత్త రకం సంచుల్లో ఇది 90 శాతం వరకూ ఉండటం విశేషం.
అధిక ఉష్ణోగ్రతలను అడ్డుకొనేలా..
నానో ప్లాస్టిక్ పదార్థం శక్తిమంతమైందే కాకుం డా.. అధిక ఉష్ణోగ్రతలు లోనికి చేరుకోకుండా అడ్డుకోగలదు. ఇక పురుగు, పుట్ర నివారణకు వేపనూనె ఎంత ఉపయోగకరం. వేపనూనెలోని నింబిన్, అజాడిరక్టిన్ వంటి ట్రిటెర్పినాయిడ్లు బూజును దరిచేరనివ్వవు. క్రిమికీటకాల ఎదుగుదలనూ అడ్డుకుంటాయి. వేపనూనె ద్వారా 200 రకాల కీటకాలను అడ్డుకోవచ్చు. ఈ లక్షణాలన్నింటినీ ఒకదగ్గరకు చేర్చడం ద్వారా విత్తన నిల్వల నష్టాన్ని తగ్గించేందుకు పరిశోధనలు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. నానోప్లాస్టిక్ పదార్థంతో తయారుచేసిన సంచుల్లో విత్తనాలను సాధారణ ఉష్ణోగ్రతల వద్దనే నిల్వ చేయొచ్చని వివరించారు.
ధాన్యం వృథాను అరికట్టేలా
సంప్రదాయ పద్ధతులు వాడినా, ఆధునిక విధానంలో భాగంగా రకరకాల రసాయనాలు ఉపయోగించినా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 130 కోట్ల టన్నుల ధాన్యం పనికిరాకుండా పోతోందని అంచనా. ఇంత మొత్తం ధాన్యంలో కొంతైనా రక్షించుకోగలిగితే రైతులకు నష్టాలు తగ్గడమే కాకుండా చాలామంది ఆకలి కూడా తీరుతుంది.