కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..? | IIT Scientists Revise Prediction On When Covid Cases Could Peak In India | Sakshi
Sakshi News home page

కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?

Published Tue, Apr 27 2021 2:41 AM | Last Updated on Tue, Apr 27 2021 9:38 AM

IIT Scientists Revise Prediction On When Covid Cases Could Peak In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసులు, మరణాలు, ఆక్సిజన్‌ కొరత, ఆరోగ్య సమస్యల గురించి వార్తలు వినీవినీ విసిగిపోయాం. ఈ కోవిడ్‌ మహమ్మారి పీడ విరగడయ్యేది ఎప్పుడన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు వేర్వేరుగానైనా ఏకాభిప్రాయంతో మే చివరికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఆ వివరాలేంటో చూసేద్దాం. దేశంలో రెండో దశ కరోనా కేసుల సంఖ్య మే నెల 14 నుంచి 18వ తేదీ మధ్య కాలంలో శిఖర స్థాయికి చేరుకుంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్‌ అధ్యాపకులు రూపొందించిన మోడల్‌లో తెలిపారు. ‘ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్‌ (పాజిటివ్‌) అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌ (సూత్ర)’మోడల్‌ను వీరు తయారు చేశారు. ఇప్పటికే భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల కన్నా ఎక్కువై 4 రోజులు అవుతోంది.

దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల వరకు ఉండగా, మే నెల మధ్య కాలానికి 38 నుంచి 48 లక్షలకు చేరుకోవచ్చని, అదే నెలాఖరుకు కేసుల సంఖ్య రోజుకు 4.4 లక్షలకు చేరుతాయని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్‌లతో పాటు తెలంగాణలో ఏప్రిల్‌ 25 నుంచి 30 మధ్యకాలంలో కేసుల సంఖ్య పెరిగి శిఖర స్థాయికి చేరుకుంటాయని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని వివరిస్తున్నారు. కాగా, అంచనా వేసేందుకు వినియోగించిన సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో తుది ఫలితాలపై కొంత అసందిగ్ధత ఉందని ఈ మోడలింగ్‌కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మణినీంద్ర అగ్రవాల్‌ ట్విట్టర్‌‡ ద్వారా తెలిపారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య కూడా మే నెల 4–8వ తేదీ మధ్య కాలంలో శిఖరస్థాయికి చేరుతాయని సూత్రా మోడల్‌ అంచనా వేసింది. కాగా, కొద్ది రోజుల కింద కరోనా ఏప్రిల్‌ 15 –20 మధ్యకాలంలో శిఖర స్థాయికి చేరుతుందని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్‌ శాస్త్రవేత్తలు అంచనా విడుదల చేసినా.. కానీ ఇది వాస్తవం కాలేదు. 

ఇతరులదీ అదేమాట.. 
ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్‌ శాస్త్రవేత్తల ‘సూత్రా’మోడల్‌ దేశీయంగా, విదేశాల్లో సిద్ధం చేసిన ఇతర మోడళ్ల ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం కరోనా పీడ విరగడయ్యేందుకు ఎక్కువ సమయం లేదన్న భరోసా కల్పిస్తోంది. హరియాణాలో అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్‌ మీనన్‌ వేసిన అంచనా ప్రకారం కరోనా వైరస్‌ కేసులు ఏప్రిల్‌ 15–మే 15 మధ్యకాలంలో అత్యధిక స్థాయికి చేరనున్నాయి. మరోవైపు అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ అంచనా కూడా మే 15కు కేసులు శిఖరస్థాయికి ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని చెప్పడం విశేషం.

భ్రమర్‌ ముఖర్జీ అంచనాల ప్రకారం మే నెల మధ్యకు దేశంలో కేసుల సంఖ్య రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సియాటెల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’(ఐహెచ్‌ఎంఈ) కూడా దాదాపు ఇదే అంచనా వేసింది. నమోదైన కేసుల ఆధారంగా భ్రమర్‌ ముఖర్జీ, ఐహెచ్‌ఎంఈలు అంచనాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే మే నెల మొదటి వారంలో కేసుల సంఖ్య రోజుకు 5 లక్షలకు చేరుకుంటుందని, రోజువారీ మరణాలు 3 వేల కంటే ఎక్కువ నమోదు కావొచ్చని భ్రమర్‌ ముఖర్జీ తెలిపారు.

మరణాలు పెరుగుతాయా?
ఐహెచ్‌ఎంఈ లెక్కల ప్రకారం.. ఆగస్టు ఒకటి నాటికి భారత్‌లో కోవిడ్‌ కారణంగా సంభవించే మరణాల సంఖ్య కనిష్టంగా 9.59 లక్షలు గరిష్టంగా 10.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరిస్తే మరణాల సంఖ్య 8.8 లక్షలకు పరిమితం చేయొచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన సీరో సర్వే ప్రకారం అసలు కేసుల కంటే నమోదైన కేసుల దాదాపు 27 రెట్లు తక్కువ. ఈ తేడాల మేరకు లెక్కలు 10 నుంచి 20 రెట్లు తక్కువ చూపుతారని పరిగణించి అంచనా వేశామని భ్రమర్‌ ముఖర్జీ తెలిపారు. 

చదవండి: (దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement