సాక్షి, హైదరాబాద్: నోరు, ముక్కు ద్వారా బయటపడే తుంపర్లలో ఉండే కరోనా వైరస్ ఎంత కాలం మనగలదు? కొంచెం కష్టమైన ప్రశ్నే.. ఎందుకంటే ఉష్ణోగ్రత, వెలువడే వైరస్ సంఖ్య, గాల్లో తేమ శాతం వంటి అనేకానేక అంశాలపై వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. కానీ.. మిగిలిన అన్ని ఉపరితలాలతో పోలిస్తే తుంపర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై చేరిన వైరస్ మాత్రం ఎక్కువ కాలం మనగలుగుతుందని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. అలాగే ఒకసారి తుంపర్లలోని తడి ఆరిపోయిన తర్వాత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వీరు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణ గాజు ఉపరితలాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై తుంపర్లు ఆరిపోయేందుకు మూడింతల ఎక్కువ సమయం పడుతోందని ఈ అధ్యయనం తెలిపింది.
విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్ కారక కరోనా వైరస్ మనుగడను అర్థం చేసుకునేందుకు తాము అధ్యయనం నిర్వహించామని, తుమ్ము, దగ్గు ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుం డగా లాలాజలంలో నీటితో పాటు లవణాలు, ముసిన్ అనే ప్రొటీన్ తదితరాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. నీటి తుంపర్లు వేగంగానే ఆరినప్పటికీ ఇతర పదార్థాల కారణంగా లాలాజలం ఆరిపోయేందుకు ఎక్కువ సమయం పడుతుందన్నారు.
సాధారణంగా తుంపర్లు కొన్ని నిమిషాల్లోనే ఆరిపోతాయి కానీ.. గాల్లో తేమ శాతం ఎక్కువైతే గంట కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు శరవణన్ బాలుస్వామి, సాయక్ బెనర్జీ, కీర్తి చంద్ర సాహూలు వెల్లడించారు. ‘తుంపర బిందువులు ఏ ఉపరితలంపై పడ్డాయన్న అంశంపై కూడా ఆరిపోయే సమయం ఆధారపడి ఉంటుంది. ఒక నానో లీటర్ లాలాజల బిం దువు నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది. గాల్లో తేమ శాతం, ఉష్ణోగ్రతలు తక్కువ గా ఉన్నప్పుడు తడిఆరేందుకు అత్యధిక సమయం పడుతున్నట్లు గుర్తించాం.. గాల్లో తేమశాతం తగ్గి పోతూ, ఉష్ణోగ్రతలు పెరిగితే తుంపర్ల తడి వేగంగా ఆరిపోతున్నట్లు తెలిసింది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment