
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ సుమారుగా జూన్ 22న ప్రారంభమై ఆగస్ట్ చివరికల్లా తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వేవ్ నాలుగు నెలలపాటు ఉండేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు తీరు, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకనుబట్టి నాలుగో వేవ్ తీవ్రత ఉంటుందని కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన శబరప్రసాద్ రాజేశ్ భాయ్, సుభ్ర శంకర్ ధార్, శలభ్ తమ పరిశోధన పత్రంలో తెలిపారు. నాలుగో వేవ్ జూన్ 22న మొదలై ఆగస్ట్ 23 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుని, అక్టోబర్ 24వ తేదీ నాటికి ఆగిపోతుందని వెల్లడించారు. అయితే, కొత్త వేరియంట్‌ను బట్టే తమ విశ్లేషణ పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
కొత్త కేసులు 8,013
దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10వేల లోపునకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4,29,24,130కి చేరినట్లు వెల్లడించింది. అదేసమయంలో, మరో 119 మంది కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,13,843కు పెరిగాయని తెలిపింది.