వీటిని మీరూ తయారు చేయొచ్చు! | They can be made ahead! | Sakshi
Sakshi News home page

వీటిని మీరూ తయారు చేయొచ్చు!

Published Mon, Jun 16 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

వీటిని మీరూ తయారు చేయొచ్చు!

వీటిని మీరూ తయారు చేయొచ్చు!

పంటల్ని ఆశించి నష్టపరిచే పురుగుల నివారణకు రైతులు రసాయన క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తుంటారు. అయితే వీటిని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి రైతులు ప్రత్యామ్నా య పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది జీవ నియంత్రణ. ఈ పద్ధతిలో భాగంగా న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ (ఎన్‌పీవీ) ద్రావణాన్ని, వేప గింజల కషాయాన్ని వినియోగించి హానికారక పురుగుల్ని నివారించవచ్చు. ఎన్‌పీవీ ద్రావణం శనగపచ్చ, నామాల (దాసరి), పొగాకు లద్దె పురుగుల్ని అదుపులో ఉంచుతుంది. ఇక వేప గింజల కషా యం సుమారు 300 రకాల క్రిములపై ప్రభావం చూపుతుంది. ఈ రెండింటినీ రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు.

ఎలా తయారు చేయాలి?

 ఎన్‌పీవీ ద్రావణాన్ని తయారు చేయాలంటే... రైతులు తమ పైర్లలో వైరస్ వ్యాధి సోకి, తలకిందులుగా వేలాడుతున్న 200 లార్వాల్ని సేకరించాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకొని తగినంత మంచినీటిని కలపాలి. దానిని మెత్తగా నూరి, పలచని గుడ్డలో వడకట్టాలి. దీనిని 200 లీటర్ల నీరు, కిలో బెల్లం, 100 మిల్లీలీటర్ల జిగురు మందులో కలిపితే... ఎన్‌పీవీ ద్రావణం రెడీ. ఎకరం పొలంలో పిచికారీ చేసుకునేందుకు ఈ ద్రావణం సరిపోతుంది.

ఎప్పుడు పిచికారీ చేయాలి?

పంటచేలో ఏర్పాటు చేసుకున్న లింగాకర్షక బుట్టల్లో 8-10 పురుగులు పడిన రెండు వారాల తర్వాత ఎన్‌పీవీ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. లేకుంటే పైరుపై పురుగు గుడ్లను గమనించిన తర్వాత వారం రోజుల్లో పిచికారీ చేసుకోవచ్చు.

లార్వాలను ఇలా గుర్తించవచ్చు

వైరస్ వ్యాధి సోకిన లార్వాలు మెత్తబడి నల్లగా మారతాయి. పురుగు అడుగు భాగం గులాబీ రంగులో ఉంటుంది. ఈ పురుగులు ముందుగా మొక్కల పైభాగానికి పాకి, ఆ తర్వాత పై నుంచి కిందికి వేలాడుతూ చనిపోతాయి. లేకుంటే ఆకులకు అంటుకుపోయినట్లు నల్లగా కన్పిస్తాయి. వైరస్ సోకిన పురుగు చర్మాన్ని ముట్టుకుంటే వదులుగా ఉంటుంది. చర్మం పగిలి, పురుగు శరీరం నుంచి తెల్లని ద్రవం బయటికి వస్తుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

ఎన్‌పీవీ ద్రావణాన్ని మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు మందును మధ్యమధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి. సాయంత్రం వేళ... అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని పిచికారీ చేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మందును వినియోగిస్తే సూర్యరశ్మిలో ఉన్న అల్ట్రావయోలెట్ కిరణాలు ద్రావణం సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. పిచికారీ చేయడానికి ముందు మాత్రమే ఎన్‌పీవీ ద్రావణాన్ని నీటిలో కలపాలి. నిల్వ ఉన్న ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని సామర్ధ్యం తగ్గుతుంది. ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

ఎక్కడ లభిస్తాయి?

ఎన్‌పీవీ వైరస్ ద్రావణాన్ని తయారు చేసుకోలేని రైతులు దానిని జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల నుంచి పొందవచ్చు. ఈ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం (విజయవాడ), కాకినాడ, నిడదవోలు, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, అనంతపూర్, విశాఖపట్నంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాజేంద్రనగర్ (హైదరాబాద్), నల్గొండ, వరంగల్‌లో ఉన్న జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ ద్రావణం లభిస్తుంది.

వేప గింజల కషాయం కూడా...

పంటల్ని ఆశించే క్రిముల నివారణకు వేప గింజల కషాయాన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. ముందుగా ఐదు కిలోల వేప గింజల్ని తీసుకొని, వాటిని పొడి చేయాలి. దానికి ఆరేడు లీటర్ల నీటిని కలిపి, ఒకటి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ద్రావణాన్ని గుడ్డలో పోసి, వీలైనన్నిసార్లు గట్టిగా పిండాలి. దీనివల్ల పొడిలో ఉన్న అజాడిరాక్టిన్ అనే మూలపదార్థం కషాయంలోకి చేరుతుంది. ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలపాలి. ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారీ చేయాలంటే 10 కిలోల వేపగింజలు అవసరమవుతాయి. కషాయాన్ని తయారు చేసుకోలేని వారు మార్కెట్‌లో దొరికే వేప మందుల్ని వాడవచ్చు.

 వేప మందులు సుమారు 300 రకాల క్రిములపై ప్రభావం చూపుతాయి. ప్రధానంగా తెల్ల-పచ్చదోమ, పేనుబంక, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కాయ తొలుచు పురుగు, ఎర్ర గొంగళి పురుగు, ఆకుతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, మరుకా మచ్చల పురుగు, తల పురుగుల భరతం పడతాయి. వేప మందుల్ని మామిడి, నిమ్మ వంటి పండ్ల తోటల్లో, బెండ, వంగ, టమాటా, మిరప వంటి కూరగాయ పంటల్లో కూడా పిచికారీ చేసుకోవచ్చు.

 వేప మందుల్ని విత్తనాలు విత్తిన/మొక్కలు నాటిన 15, 30, 45 రోజులప్పుడు పిచికారీ చేయాలి. ఆకులపై పురుగులు లేదా వాటి గుడ్లు కన్పించినప్పుడు, పురుగులు లార్వా దశలో ఉన్నప్పుడు వేప మందుల్ని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అవసరాన్ని బట్టి 7-15 రోజల వ్యవధితో మరోసారి పిచికారీ చేసుకోవచ్చు.

 ఈ విధంగా జీవ నియంత్రణ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా రైతులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా పెట్టుబడి వ్యయమూ తగ్గుతుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు, పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు కూడా ఇవి ఉపకరిస్తాయి. ప్రధానంగా పంట ఉత్పత్తుల నాణ్యత బాగుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటికి మంచి ధర లభిస్తుంది.
 
డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త (హార్టీకల్చర్)
ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి, పశ్చిమ గోదావరి జిల్లా
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement