పశువులకు వీటి అవసరమూ ఉంటుంది!
పాడి-పంట: ఖనిజ లవణాల లోపం కారణంగా పశువులు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో ఆలస్యంగా ఎదకు రావడం, తిరిగి పొర్లడం, గొడ్డుమోతుతనం ప్రధానమైనవి. పునరుత్పత్తి సమస్యలు కూడా ఎదురైతే ఈతల మధ్య అంతరం పెరుగుతుంది. అలాంటప్పుడు పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండదు. ఆవు జాతి పశువు సంవత్సరానికి ఒక దూడను, గేదె 15 నెలలకు ఒక దూడను అందించగలిగినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అలా ఉండాలంటే పశువులకు అవసరమైన ఖనిజాలను విధిగా అందించాలి. పశువులు ఖనిజాలను తమ శరీరంలో ఉత్పత్తి చేసుకోలేవు కాబట్టి వాటిని మేత ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే మేత వనరుల్లో ఉండే ఖనిజాలు సైతం పూర్తి స్థాయిలో పశువులకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రికెట్స్, ఆక్టియోమలేసియా, పైకా (విపరీతమైన ఆకలి), గిట్టల పెరుగుదలలో లోపం, చర్మం రంగును కోల్పోవడం, రక్తహీనత, మృత దూడలు పుట్టడం, గొంతువాపు, ఎదుగుదల లోపించడం, పాల దిగుబడి పడిపోవడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం.... ఇలా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాడి పశువుకు జన్యుపరంగా అధిక పాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ సమతుల్యమైన పోషణ లేకపోవడం వల్ల వాటి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పాదకతను పొందలేకపోతున్నాము.
వీటి అవసరం ఎక్కువ
పాలలో 0.12% కాల్షియం, 0.10% భాస్వరం ఉంటాయి. పాడి పశువు శరీరానికి ఇవి తగినంత లభిస్తే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆవులతో పోలిస్తే గేదెలకు కాల్షియం అవసరం ఎక్కువ. ఎందుకంటే గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మేతలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా అందించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉత్పత్తి కావడానికి గంధకం చాలా అవసరం. విటమిన్ల తయారీకి కూడా గంధకం అవసరమవుతుంది. పశువు రక్తంలో కాల్షియం, భాస్వరం సరైన నిష్పత్తిలో ఉండాలి. లేకపోతే ఎముకల్లో నిల్వ ఉండే కాల్షియం రక్తంలోకి చేరుతుంది. అనంతరం ఆ పశువు అందించే పాలను తాగడం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది.
సాధారణ పశువు ఈనిన తర్వాత పాలజ్వరం, హైపోకాల్షియం (రక్తంలో కాల్షియం తగ్గడం) వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీటిని నివారించాలంటే చూడి సమయంలో పశువుకు అదనంగా కాల్షియం ఇవ్వాలి. ఎందుకంటే పాలజ్వరం వచ్చిన పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.
పాలజ్వరం నుంచి తేరుకున్న తర్వాత పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ కారణం ఉంది. పాలజ్వరం బారిన పడిన పశువుకు చనుల కండరాలు వదులవుతాయి. సూక్ష్మక్రిములు చనుల రంధ్రాల ద్వారా పొదుగులోకి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి పశువుకు కాల్షియం, భాస్వరం, సోడియం, పొటాషియం, గంధకం వంటి ఖనిల లవణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది.
అవసరం తక్కువే అయినా...
పశువుకు రాగి (కాపర్), జింక్, మాంగనీస్, అయొడిన్, కోబాల్ట్, క్రోమియం వంటి ఖనిజాల అవసరం కూడా ఉంటుంది. కాకపోతే కాస్త తక్కువ పరిమాణంలో అందిస్తే చాలు. ఇవి కూడా పాల దిగుబడికి దోహదపడతాయి. ఇవి లోపిస్తే పశువులు తక్కువ మేత తింటాయి. బరువు కోల్పోతాయి. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈనిన తర్వాత మాయ పడదు. పశువు ఈసుకుపోతుంది. దూడలు తక్కువ బరువుతో పుడతాయి.
విటమిన్ ‘ఎ’తో జింక్ కలిసినప్పుడు పశువు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. జననేంద్రియాల కణాల క్రమం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రాగి ధాతువు జననేంద్రియ సంబంధమైన ఓవరీస్ పనితనాన్ని పెంచుతుంది. మాంగనీస్ ఖనిజం చాలా వరకు ఎంజైమ్ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఈ ఖనిజం లోపిస్తే పశువు శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. పశువు గర్భంలోని దూడ పెరగడానికి అయొడిన్ దోహపడుతుంది. ఇది లోపిస్తే పశువు గర్భంలోనే దూడలు చనిపోతాయి. చూడి పశువు ఈసుకుపోతుంది. పుట్టిన దూడలు కూడా బలహీనంగా ఉంటాయి. మగ పశువుల్లో సంపర్క సామర్థ్యం తగ్గిపోతుంది.
ఖనిజాలను పశువు శరీరం ఉత్పత్తి చేయదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో... అంటే అధిక పాల దిగుబడికి, పునరుత్పత్తి సామర్థ్యం పెరగడానికి, ఎదుగుదలకు, జీర్ణ ప్రక్రియ సజావుగా సాగడానికి, వేసవిలో ఒత్తిడి లేకుండా ఉండడానికి విధిగా మేతలో ఖనిజ లవణాలను అందించాల్సి ఉంటుంది.
డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ
సీనియర్ శాస్త్రవేత్త-అధిపతి
పశు పరిశోధనా స్థానం, గరివిడి
విజయనగరం జిల్లా
ఒత్తిడిలో ఎంతో అవసరం
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒత్తిడికి గురవుతాయి. మేత తినడం తగ్గిపోతుంది. ఫలితంగా పశువులకు ఖనిజాల లభ్యత కూడా తగ్గుతుంది. పశువు తన శరీరంలోని వేడిని చెమట ద్వారా బయటికి పంపుతుంది. అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఖనిజాలను ఎక్కువగా కోల్పోతుందన్న మాట. కాబట్టి వీటిని... ముఖ్యంగా పొటాషియంను మేత ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఖనిజం పాలలో 0.15% వరకు ఉంటుంది. అధిక పాల దిగుబడిని అందించే పశువులకు, వేసవిలో ఒత్తిడికి లోనయ్యే పశువులకు ఈ ఖనిజాన్ని తప్పనిసరిగా అందించాలి. ఎండలో పశువు రొప్పుతున్నప్పుడు లాలాజలం ఎక్కువగా బయటికి పోతుంది. దీనితోపాటు శరీరంలోని సోడియం బైకార్బొనేట్ కూడా పోతుంది. దీనిని మేత ద్వారా అందిస్తే పశువు ఆహార అవసరాలు తీరతాయి.