పంటకు ఈ పోషకాలూ అవసరమే!
Published Wed, Jun 18 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత అవసరమో కాల్షియం, మెగ్నీషియం, గంధ కం, జింక్, బోరాన్, ఇనుము, రాగి వంటి సూక్ష్మ పోషకాలూ అం తే అవసరం. బెట్ట పరిస్థితుల్లోనూ, వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు పంటల్లో సూక్ష్మ ధాతు లోపాలు అధికంగా కన్పిస్తుంటా యి. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల గురించి ఆచార్య ఎన్.జి.రం గా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న వివరాలు...
ఎందుకు లోపిస్తున్నాయి?
పంటలకు వేస్తున్న కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువుల (యూరియా, పొటాష్) వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో రైతులు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని వాడేవారు. వీటి ద్వారా మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా పంటల్లో సూక్ష్మ పోషకాలు లోపించి, దిగుబడులు తగ్గుతున్నాయి.
ఏ పంటలో ఏ లోపం?
వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, శనగ, పత్తి పంటల్లో ఎక్కువగా జింక్ ధాతువు లోపిస్తోంది. మొక్కజొన్నలో ఇనుప ధాతు లోపం కూడా అధికంగానే ఉంటోంది. ఈ ధాతువు వరి, వేరుశనగ, శనగ, చెరకు పంటల్లోనూ లోపిస్తోంది. ఇక బీటీ పత్తి పంటను మెగ్నీషియం, జింక్, బోరాన్ ధాతు లోపాలు అతలాకుతలం చేస్తున్నాయి.
జింక్ దేనికి ఉపయోగం?
మొక్కల ఎదుగుదలకు ఎంజైములు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. ఇవి తయారు కావడానికి జింక్ దోహదపడుతుంది. కణజాలాల్లో కొన్ని ప్రత్యేక ఎంజైములు లోపిస్తే మొక్కల్లో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. మనం పంటకు అందిస్తున్న నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరగాలంటే జింక్ వాడకం తప్పనిసరి.
వరిలో లోపిస్తే...
నాట్లు వేసిన 2 నుంచి 6 వారాల్లో వరిలో జింక్ లోపం కన్పిస్తుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. పైరు పలచబడుతుంది. మిగిలిన పిలకలు కూడా దుబ్బు కట్టవు. ఆకుల్లో మధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు రంగుకు మారుతుంది. ఆకు చివర్లు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ముదురు ఆకులపై మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్నవిగా నూలు కండె ఆకారంలో, పెళుసుగా ఉంటాయి. వాటిని విరిస్తే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పిలకలు తొడగదు. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉంటాయి. పైరు గిడసబారుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది.
మొక్కజొన్నలో ఏమవుతుంది?
మొక్కజొన్న పైరులో జింక్ లోపిస్తే ఆకు ఈనెల మధ్య భాగం తేలికపాటి చారలతో లేదా తెల్లని పట్టీల మాదిరిగా కన్పిస్తుంది. అయితే ఆకుల అంచులు, పెద్ద ఈనెలు, చివర్లు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల మొగ్గ లక్షణాలు కన్పిస్తాయి. కొత్తగా వచ్చే ఆకులు దాదాపు తెల్లగా ఉంటాయి.
ఆకులు చిన్నవి అవుతాయి
తేలికపాటి నేలల్లో, సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపు నేలల్లో సాగు చేసిన వేరుశనగ పైరులో జింక్ లోపం కన్పిస్తుంది. సాగునీటిలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ధాతువు లోపిస్తుంది. జింక్ లోపించినప్పుడు ఆకులు మామూలు సైజులో ఉండక చిన్నవిగా ఉంటాయి. రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా ఆకులు చిన్నవిగా, గుబురుగా కన్పిస్తాయి. ఈనెల మధ్య ఉండే ఆకు భాగం లేత పసుపు రంగులోకి మారవచ్చు.
శనగలో జింక్ ధాతువు లోపిస్తే ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువైన కొద్దీ ఆకులు ఎర్రగా మారతాయి. వేరుశనగ పైరులో మాదిరిగా ఆకులు చిన్నవిగా మారి, మొక్కలు కుదించుకుపోతాయి.
ఆకులు తుప్పు రంగుకు మారతాయి
బంకమన్ను అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో, సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేస్తున్న పత్తి పైరులో జింక్ లోపించే అవకాశం ఉంది. విత్తనాలు వేసిన 3 వారాల తర్వాత లోప లక్షణాలు కన్పిస్తాయి. పాత, కొత్త ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగుకు మారతాయి. లేత పైరులో మధ్య ఆకులు తమ సహజ ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఈనెల మధ్య భాగం బంగారం లాంటి పసుపు రంగుకు మారుతుంది. ఆకుల చివర్ల నుంచి మొదలుకు గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆకుల చివర్లు ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందికి ముడుచుకుంటాయి. మొక్కల్లో పెరుగుదల సరిగా ఉండదు. ఆకులు, కాండం చిన్నవిగా మారి, గుబురుగా కన్పిస్తాయి.
(మిగతా వివరాలు వచ్చే వారం)
Advertisement
Advertisement