growth of plants
-
పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!
మొక్కల పెరుగుదలకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. వీటిలో జింక్, ఇనుము ధాతువుల గురించి గతంలో తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైన ఇతర ధాతువులు మె గ్నీషియం, బోరాన్, గంధకం. పత్తి, వేరుశనగ పంటల్లో ఈ పోషకాలు లోపిస్తే ఏం జరుగుతుంది? ఆ లోపాలను ఎలా సవరించాలి? అనే దానిపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న సూచనలు... జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది మెగ్నీషియం ధాతువు జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది. పత్తి పైరులో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. పైరులో ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపించినట్లు గ్రహించాలి. అయితే భాస్వరం లోపించినప్పుడు, బెట్ట పరిస్థితుల్లో, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, ఎర్ర నేలల్లో పైరును సాగు చేసినప్పుడు కూడా పత్తి ఆకులు ఎర్రబడతాయి. ఆకులు ఎర్రబడడానికి ఇవేమీ కారణం కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఆహారాన్ని సరఫరా చేస్తుంది ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కలోని వివిధ భాగాలకు చేర్చడంలో బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. పత్తి పైరులో ఈ ధాతువు లోపిస్తే కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా పక్క నుంచి అనేక కొమ్మలు పుట్టుకొచ్చి, మొక్క గుబురుగా కన్పిస్తుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగును, రూపాన్ని కోల్పోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా, పెళుసుగా, అక్కడక్కడ తేమగా ఉంటాయి. అవన్నీ కుళ్లుతున్నట్లు కన్పిస్తే దానిని బోరాన్ లోపంగా గుర్తించాలి. ఈ ధాతువు లోపిస్తే పిందెలు, కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 కిలోల చొప్పున బోరాక్స్ వేసుకోవాలి. పైరులో లోప లక్షణాలు కన్పిస్తే లీటరు నీటికి 1-1.5 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. వేర్ల ఏర్పాటుకు సహకరిస్తుంది గంధకం ధాతువు వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. వేర్లు, విత్తనాలు ఏర్పడడానికి సహకరిస్తుంది. వేరుశనగ పైరులో గంధకం లోపిస్తే కింది ముదురాకులు మామూలుగా ఆకుపచ్చగానే కన్పించినప్పటికీ కొత్తగా వచ్చిన చిగురాకులు మాత్రం చిన్నవిగా, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు కాడలు నిటారుగా ఉంటాయి. ఆకులు ఇంగ్లీషు ‘యు’ ఆకారంలో కన్పిస్తాయి. మొక్క సరిగా పెరగక చిన్నదిగా ఉంటుంది. వేర్లపై బుడిపెలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల నత్రజని స్థిరీకరణ తగ్గి, పైరు సరిగా పెరగదు. పంటకు సూపర్ ఫాస్ఫేట్ను వేయడం ద్వారా గంధక లోపాన్ని నివారించవచ్చు. లేకుంటే ఎకరానికి 2 క్వింటాళ్ల జిప్సంను దుక్కి సమయంలో లేదా పూత దశలో వేసుకోవచ్చు. ఏ పైరులో అయినా రెండు మూడు ధాతు లోపాలు ఒకేసారి కన్పిస్తే మిశ్రమ ధాతువుల్ని కలిగిన ఫార్ములా-4, ఫార్ములా-6, మాక్స్ వంటి మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ శాస్త్రవేత్తలను (ల్యాండ్‌లైన్:1100, మొబైల్:1800-425-1110) కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు. ఎలుకలు దాడి చేస్తుంటే... పెనుగొండ ( పశ్చిమ గోదావరి): వరి పైరుకు ఎలుకలు చేసే నష్టం అపారం. ఇవి నారుమడిలో చల్లిన విత్తనాలను తినేస్తాయి. ఆ తర్వాత వివిధ దశల్లోనూ పైరుపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలుకల నివారణకు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి అందిస్తున్న సూచనలు... 100 గ్రాముల బ్రోమడయోలోన్ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 96 గ్రాముల నూకలు+2 గ్రాముల నూనె+ 2 గ్రాముల మందు కలపాలి. ఆ సమయంలో చేతులకు గ్లౌజులు/పాలిథిన్ సంచులు తొడగాలి. లేకపోతే చేతి వాసనను ఎలుకలు పసిగట్టి, ఎరను తినవు. మందును 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టుకోవాలి. ఒక్కో బొరియలో 10 గ్రాముల మందు పొ ట్లాన్ని అంగుళం లోపలికి వేసుకోవాలి. బొరియను మూసేయకూడదు. వర్షాలు పడుతున్నప్పుడు మందు కలపకూడదు. వర్షం లో తడిసిన మందు పనిచేయదు. మధ్యాహ్నం వేళ మందును కలిపి, సాయంత్రం బొరియలో వేయాలి. ఈ మందు తిన్న నాలుగైదు రోజులకు ఎలుకలు చనిపోతాయి. వాటిని ఏరి, భూమిలో పాతిపెట్టాలి. బొరియల్లోకి పొగను పంపడం (బర్రో ఫ్యూమిగేషన్) ద్వారా కూడా ఎలుకల్ని మట్టుపెట్టవచ్చు. తొలకరి చినుకు లు పడిన తర్వాత భూమిని దుక్కి చేస్తే ఎలుకల బెడద తగ్గుతుం ది. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. -
పంటకు ఈ పోషకాలూ అవసరమే!
పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత అవసరమో కాల్షియం, మెగ్నీషియం, గంధ కం, జింక్, బోరాన్, ఇనుము, రాగి వంటి సూక్ష్మ పోషకాలూ అం తే అవసరం. బెట్ట పరిస్థితుల్లోనూ, వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు పంటల్లో సూక్ష్మ ధాతు లోపాలు అధికంగా కన్పిస్తుంటా యి. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల గురించి ఆచార్య ఎన్.జి.రం గా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న వివరాలు... ఎందుకు లోపిస్తున్నాయి? పంటలకు వేస్తున్న కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువుల (యూరియా, పొటాష్) వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో రైతులు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని వాడేవారు. వీటి ద్వారా మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోతోంది. ఫలితంగా చాలా పంటల్లో సూక్ష్మ పోషకాలు లోపించి, దిగుబడులు తగ్గుతున్నాయి. ఏ పంటలో ఏ లోపం? వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, శనగ, పత్తి పంటల్లో ఎక్కువగా జింక్ ధాతువు లోపిస్తోంది. మొక్కజొన్నలో ఇనుప ధాతు లోపం కూడా అధికంగానే ఉంటోంది. ఈ ధాతువు వరి, వేరుశనగ, శనగ, చెరకు పంటల్లోనూ లోపిస్తోంది. ఇక బీటీ పత్తి పంటను మెగ్నీషియం, జింక్, బోరాన్ ధాతు లోపాలు అతలాకుతలం చేస్తున్నాయి. జింక్ దేనికి ఉపయోగం? మొక్కల ఎదుగుదలకు ఎంజైములు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. ఇవి తయారు కావడానికి జింక్ దోహదపడుతుంది. కణజాలాల్లో కొన్ని ప్రత్యేక ఎంజైములు లోపిస్తే మొక్కల్లో పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. మనం పంటకు అందిస్తున్న నత్రజని, భాస్వరం ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరగాలంటే జింక్ వాడకం తప్పనిసరి. వరిలో లోపిస్తే... నాట్లు వేసిన 2 నుంచి 6 వారాల్లో వరిలో జింక్ లోపం కన్పిస్తుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. పైరు పలచబడుతుంది. మిగిలిన పిలకలు కూడా దుబ్బు కట్టవు. ఆకుల్లో మధ్య ఈనె ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు రంగుకు మారుతుంది. ఆకు చివర్లు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ముదురు ఆకులపై మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్నవిగా నూలు కండె ఆకారంలో, పెళుసుగా ఉంటాయి. వాటిని విరిస్తే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పిలకలు తొడగదు. కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉంటాయి. పైరు గిడసబారుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. మొక్కజొన్నలో ఏమవుతుంది? మొక్కజొన్న పైరులో జింక్ లోపిస్తే ఆకు ఈనెల మధ్య భాగం తేలికపాటి చారలతో లేదా తెల్లని పట్టీల మాదిరిగా కన్పిస్తుంది. అయితే ఆకుల అంచులు, పెద్ద ఈనెలు, చివర్లు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. జింక్ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల మొగ్గ లక్షణాలు కన్పిస్తాయి. కొత్తగా వచ్చే ఆకులు దాదాపు తెల్లగా ఉంటాయి. ఆకులు చిన్నవి అవుతాయి తేలికపాటి నేలల్లో, సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపు నేలల్లో సాగు చేసిన వేరుశనగ పైరులో జింక్ లోపం కన్పిస్తుంది. సాగునీటిలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ధాతువు లోపిస్తుంది. జింక్ లోపించినప్పుడు ఆకులు మామూలు సైజులో ఉండక చిన్నవిగా ఉంటాయి. రెండు ఆకుల మధ్య పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా ఆకులు చిన్నవిగా, గుబురుగా కన్పిస్తాయి. ఈనెల మధ్య ఉండే ఆకు భాగం లేత పసుపు రంగులోకి మారవచ్చు. శనగలో జింక్ ధాతువు లోపిస్తే ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువైన కొద్దీ ఆకులు ఎర్రగా మారతాయి. వేరుశనగ పైరులో మాదిరిగా ఆకులు చిన్నవిగా మారి, మొక్కలు కుదించుకుపోతాయి. ఆకులు తుప్పు రంగుకు మారతాయి బంకమన్ను అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో, సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేస్తున్న పత్తి పైరులో జింక్ లోపించే అవకాశం ఉంది. విత్తనాలు వేసిన 3 వారాల తర్వాత లోప లక్షణాలు కన్పిస్తాయి. పాత, కొత్త ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగుకు మారతాయి. లేత పైరులో మధ్య ఆకులు తమ సహజ ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఈనెల మధ్య భాగం బంగారం లాంటి పసుపు రంగుకు మారుతుంది. ఆకుల చివర్ల నుంచి మొదలుకు గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆకుల చివర్లు ఎండిపోతాయి. ఆకులు పైకి లేదా కిందికి ముడుచుకుంటాయి. మొక్కల్లో పెరుగుదల సరిగా ఉండదు. ఆకులు, కాండం చిన్నవిగా మారి, గుబురుగా కన్పిస్తాయి. (మిగతా వివరాలు వచ్చే వారం)