పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే! | Micro-nutrients need to growth of plants | Sakshi
Sakshi News home page

పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!

Published Wed, Jul 2 2014 10:23 PM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే! - Sakshi

పాడి-పంట: ఈ ధాతువులూ అవసరమే!

మొక్కల పెరుగుదలకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. వీటిలో జింక్, ఇనుము ధాతువుల గురించి గతంలో తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాలలో ముఖ్యమైన ఇతర ధాతువులు మె గ్నీషియం, బోరాన్, గంధకం. పత్తి, వేరుశనగ పంటల్లో ఈ పోషకాలు లోపిస్తే ఏం జరుగుతుంది? ఆ లోపాలను ఎలా సవరించాలి? అనే దానిపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి అందిస్తున్న సూచనలు...
 
 జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది
 మెగ్నీషియం ధాతువు జీవ ప్రక్రియలకు తోడ్పడుతుంది. పత్తి పైరులో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. పైరులో ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపించినట్లు గ్రహించాలి. అయితే భాస్వరం లోపించినప్పుడు, బెట్ట పరిస్థితుల్లో, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, ఎర్ర నేలల్లో పైరును సాగు చేసినప్పుడు కూడా పత్తి ఆకులు ఎర్రబడతాయి. ఆకులు ఎర్రబడడానికి ఇవేమీ కారణం కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి.
 
 ఆహారాన్ని సరఫరా చేస్తుంది
 ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కలోని వివిధ భాగాలకు చేర్చడంలో బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. పత్తి పైరులో ఈ ధాతువు లోపిస్తే కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా పక్క నుంచి అనేక కొమ్మలు పుట్టుకొచ్చి, మొక్క గుబురుగా కన్పిస్తుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగును, రూపాన్ని కోల్పోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా, పెళుసుగా, అక్కడక్కడ తేమగా ఉంటాయి. అవన్నీ కుళ్లుతున్నట్లు కన్పిస్తే దానిని బోరాన్ లోపంగా గుర్తించాలి. ఈ ధాతువు లోపిస్తే పిందెలు, కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 కిలోల చొప్పున బోరాక్స్ వేసుకోవాలి. పైరులో లోప లక్షణాలు కన్పిస్తే లీటరు నీటికి 1-1.5 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.
 
వేర్ల ఏర్పాటుకు సహకరిస్తుంది
 గంధకం ధాతువు వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. వేర్లు, విత్తనాలు ఏర్పడడానికి సహకరిస్తుంది. వేరుశనగ పైరులో గంధకం లోపిస్తే కింది ముదురాకులు మామూలుగా ఆకుపచ్చగానే కన్పించినప్పటికీ కొత్తగా వచ్చిన చిగురాకులు మాత్రం చిన్నవిగా, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు కాడలు నిటారుగా ఉంటాయి. ఆకులు ఇంగ్లీషు ‘యు’ ఆకారంలో కన్పిస్తాయి. మొక్క సరిగా పెరగక చిన్నదిగా ఉంటుంది. వేర్లపై బుడిపెలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల నత్రజని స్థిరీకరణ తగ్గి, పైరు సరిగా పెరగదు. పంటకు సూపర్ ఫాస్ఫేట్‌ను వేయడం ద్వారా గంధక లోపాన్ని నివారించవచ్చు. లేకుంటే ఎకరానికి 2 క్వింటాళ్ల జిప్సంను దుక్కి సమయంలో లేదా పూత దశలో వేసుకోవచ్చు.
 
 ఏ పైరులో అయినా రెండు మూడు ధాతు లోపాలు ఒకేసారి కన్పిస్తే మిశ్రమ ధాతువుల్ని కలిగిన ఫార్ములా-4, ఫార్ములా-6, మాక్స్ వంటి మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషకాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కాల్ సెంటర్ శాస్త్రవేత్తలను (ల్యాండ్‌లైన్:1100, మొబైల్:1800-425-1110) కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.
 
 ఎలుకలు దాడి చేస్తుంటే...
 పెనుగొండ ( పశ్చిమ గోదావరి): వరి పైరుకు ఎలుకలు చేసే నష్టం అపారం. ఇవి నారుమడిలో చల్లిన విత్తనాలను తినేస్తాయి. ఆ తర్వాత వివిధ దశల్లోనూ పైరుపై దాడి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలుకల నివారణకు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి అందిస్తున్న సూచనలు...
 
100 గ్రాముల బ్రోమడయోలోన్ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 96 గ్రాముల నూకలు+2 గ్రాముల నూనె+ 2 గ్రాముల మందు కలపాలి. ఆ సమయంలో చేతులకు గ్లౌజులు/పాలిథిన్ సంచులు తొడగాలి. లేకపోతే చేతి వాసనను ఎలుకలు పసిగట్టి, ఎరను తినవు. మందును 10 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టుకోవాలి. ఒక్కో బొరియలో 10 గ్రాముల మందు పొ ట్లాన్ని అంగుళం లోపలికి వేసుకోవాలి. బొరియను మూసేయకూడదు. వర్షాలు పడుతున్నప్పుడు మందు కలపకూడదు. వర్షం లో తడిసిన మందు పనిచేయదు. మధ్యాహ్నం వేళ మందును కలిపి, సాయంత్రం బొరియలో వేయాలి. ఈ మందు తిన్న నాలుగైదు రోజులకు ఎలుకలు చనిపోతాయి. వాటిని ఏరి, భూమిలో పాతిపెట్టాలి. బొరియల్లోకి పొగను పంపడం (బర్రో ఫ్యూమిగేషన్) ద్వారా కూడా ఎలుకల్ని మట్టుపెట్టవచ్చు. తొలకరి చినుకు లు పడిన తర్వాత భూమిని దుక్కి చేస్తే ఎలుకల బెడద తగ్గుతుం ది. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement