షేడ్ నెట్స్‌లో తిరుగుతున్న డ్రోన్లు
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేట్ డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాటి బరువును 25 కేజీలకు కుదించిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా తాజాగా ఆ బరువును 250 గ్రాములకు తగ్గించగలిగింది. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయేలా కేవలం 10 గ్రాముల బరువుతో డ్రోన్లను తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ తరహా డ్రోన్ అందుబాటులోకి వస్తే షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ తరహా సాగు విధానంలో సమస్యగా మారిన పరపరాగ సంపర్యాన్ని విజయవంతంగా జరిపించవచ్చు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రోన్ అంటే ఒకప్పుడు పెళ్లిళ్లు, బహిరంగ సభలు, పాదయాత్రల వీడియో, ఫొటోలు తీయడానికి మాత్రమే పరిమితం. అదే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాల్లో అడుగుపెట్టింది. సైనిక అవసరాలతో పాటు ఫుడ్ డెలివరీకి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేకి కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయే బుల్లి డ్రోన్లు రంగ ప్రవేశం చేయనున్నాయి.
ఈ తరహా డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో వినియోగించేలా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వినియోగించడంతోపాటు రైతులనే డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దే బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భుజాన వేసుకుంది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని ఎరువులు, విత్తనాలను వెదజల్లేందుకు మాత్రమే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. రానున్న కాలంలో రోజుల్లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అన్ని దశల్లోనూ వ్యవసాయ పనులు చేసి పెట్టేలా డ్రోన్లను రూపొందించేందుకు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఎరువులు, పురుగు మందులు చల్లేందుకే..
వ్యవసాయంలో డ్రోన్లను ప్రస్తుతం పురుగు మందులు పిచికారీ చేసేందుకు వాడుతున్నారు. దీనివల్ల 25 శాతం వరకూ పురుగు మందులు ఆదా కావడంతోపాటు పొలం మొత్తం సమానంగా పిచికారీ చేసే అవకాశం కలిగింది. మరోవైపు ఎరువుల్ని చల్లడం, వెద పద్ధతిలో విత్తనాలు వేయడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది.
మరోవైపు డ్రోన్లను వినియోగించి నేల స్వభావం తెలుసుకోవడం ద్వారా నేలలో ఏయే పోషకాలు అవసరం, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఉప్పు నేలలు, చౌడు, ఉరకెత్తు ప్రాంతాలను గుర్తించి వాటికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదే సందర్భంలో డ్రోన్లను ఉపయోగించి అడవుల్లో మొక్కల సాంద్రత తెలుసుకుని అవసరమైన ప్రాంతాల్లో విత్తనాలు చల్లుకునే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, నదులు, జలపాతాల్లో నీటి పరిమాణం అంచనా వేయడానికి, నీటిని నిల్వచేయడానికి వాటర్‌షెడ్స్, చెక్‌డ్యామ్‌లు ఎక్కడ ఎలా కట్టుకోవాలనే అంశాన్ని డ్రోన్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చు.
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా ఉంటుంది. అంగ్రూ తరపున డ్రోన్ వినియోగంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది.
– ఎ.సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, అంగ్రూ
ఫోన్ కంటే స్మార్ట్‌గా..
కూలీల కొరత తీవ్రమవటం, ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి డ్రోన్ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్జీ రంగా యూనివర్సిటీ డ్రోన్ బరువును 45 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించింది. తాజాగా కేవలం 250 గ్రాముల బరువైన డ్రోన్లను సైతం రూపొందించింది. కాగా, కొన్ని ప్రైవేటు కంపెనీలు 45 కిలోల బరువున్న డ్రోన్లను ఆయిల్ ఇంజన్ సహాయంతో నడుపుతున్నాయి.
వీటి నుంచి ఎక్కువ శబ్దం చేయడంతోపాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షేడ్‌నెట్స్, గ్రీన్‌మ్యాట్ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కువగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పంపైకి చేరటం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోయేంత డ్రోన్లను ఆ మొక్కలపై తిప్పితే పరపరాగ సంపర్కం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అతి చిన్న డ్రోన్లను తయారు చేయడానికి ఎన్జీ రంగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా డ్రోన్లు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా షేడ్ నెట్స్, గ్రీన్ మ్యాట్ సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment