విద్యానగర్ (గుంటూరు) : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ కళాశాల్లో 2015-16 సంవత్సరానికిగానూ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల వ్యవసాయపరిశోధన క్షేత్రంలో కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ టి.వి.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 55 వ్యవసాయ కళాశాలల్లో బీటెక్ విభాగంలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ పుడ్ టెక్నాలజీలకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. బీ.ఎస్సీలో అగ్రికల్చరల్ విభాగానికి చెందిన కమర్షియల్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్ మెంట్, హోమ్‌సైన్స్, పుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫ్యాషన్ టెక్నాజజీ విభాగాల్లో సీట్ల భర్తీకి మెరిట్ ప్రాతిపదికన మార్కుల జాబితా ప్రకారం కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీసీ విభాగంలోని రైతుల పిల్లలకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహించి ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులను అగ్రికల్చర్ బీ.ఎస్సీకి ఎంపిక చేస్తున్నామని వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రైతుల పిల్లల సౌకర్యార్థం ప్రత్యేకంగా 40 శాతం రిజర్వేషన్‌తో ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. నాన్‌లోకల్ కేటగిరిలో ఒకొక్క కళాశాలలో 15 మంది విద్యార్థులకు మెరిట్ ఆధారంగా అగ్రికల్చరల్ విభాగంలో అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 28 వరకూ పాలిటెక్నిక్ కళాశాలల్లోని అగ్రికల్చరల్ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ విభాగం డీన్ టి.రమేష్‌బాబు, హోమ్‌సైన్స్ విభాగం డీన్ డాక్టర్ ఆర్ వీరరాఘవయ్య, పరీక్షల కంట్రోలర్ డాక్టర్ శివశంకర్, పాలిటెక్నిక్ విభాగం కోఆర్డినేటర్ ఎస్.సునీల్ కుమార్ పరిశోధన క్షేత్రం ఏడీఆర్ ఈదర ఆదినారాయణ, శాస్త్రవేత్త ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభం
Published Tue, Jul 21 2015 7:00 PM | Last Updated on Fri, Aug 17 2018 5:52 PM
Advertisement
Advertisement