ఆకుల రంగు మారిపోతుంది! | Platns leafs color to be changed lacking of proteins | Sakshi
Sakshi News home page

ఆకుల రంగు మారిపోతుంది!

Published Wed, Jun 25 2014 10:26 PM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

ఆకుల రంగు మారిపోతుంది! - Sakshi

ఆకుల రంగు మారిపోతుంది!

పాడి-పంట: మొక్కల పెరుగుదలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలూ అవసరమేనని గత వారం తెలుసుకున్నాం. వాటిలో ఒకటైన జింక్ లోపిస్తే వివిధ పంటల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం. సూక్ష్మ పోషకాల్లో మరో ముఖ్యమైన ధాతువు ఇనుము. ఇది చాలా రకాల ఎంజైములకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, జీవక్రియ చురుకుగా జరిగేలా చూస్తుందని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఆ వివరాలు...
 
 వరి-మొక్కజొన్నలో...
 వరి పైరులో ఇనుప ధాతు లోపం లేత చిగురాకుల మీద కన్పిస్తుంది. ఇనుము లోపించిన లేత చిగురాకుల్లో ఈనెల మధ్య ఉన్న ఆకు పసుపు రంగుకు మారుతుంది. ఈనెలు మాత్రం లేత ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగులో ఉంటాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. పసుపు రంగుకు మారిన ఆకు భాగాలు ఇటుక రంగుకు మారి ఎండిపోతాయి. ముందుగా ఆకుల కొనలు, పక్కలు ఎండుతాయి. అక్కడి నుంచి మొదలై లోపలి భాగాలూ ఎండిపోతాయి. క్రమేపీ ఆకుల్లోని ఆకుపచ్చ రంగు పూర్తిగా పోతుంది. ఒక్కోసారి ఆకులు రాలిపోతాయి. ఇక మొక్కజొన్న పైరులో ఇనుప ధాతువు లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ రంగు నుంచి తెలుపు రంగుకు మారుతుంది.
 
 వేరుశనగలో...
 సున్నం అధికంగా ఉండే నేలల్లో, ముంపుకు గురయ్యే నల్లరేగడి నేలల్లో, బైకార్బొనేట్ ఎక్కువగా ఉండే సాగు నీటితో పండిస్తున్న వేరుశనగ పంటలో ఇనుప ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది. ఈ ధాతువు లోపించడం వల్ల ఆకులు లేత ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. అవి క్రమేపీ ఈనెలతో సహా పసుపు రంగుకు మారతాయి. ఇనుప ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు మొత్తం లేత పసుపు లేదా తెలుపు రంగుకు మారిపోతుంది. కొత్త చిగుర్లు పూర్తిగా తెల్లగా ఉంటాయి.
 
 చెరకులో...
 ఇనుప ధాతువు లోపించిన చెరకు తోటలో ఆకులు పాలిపోయి, లేత పసుపు లేదా తెలుపు రంగుకు మారతాయి. ముందుగా ఈనెల మధ్య భాగం పాలిపోతుంది. ఆ తర్వాత ఈనెలకు సమాంతరంగా ఆకుల పొడవునా ఉన్న భాగం రంగు మారుతుంది. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. చెరకు మొక్కలు బాగా ఎదిగిన తర్వాత ఇనుము లోపిస్తే ముదురు ఆకులు పచ్చగానే ఉన్నప్పటికీ లేత ఆకులు పాలిపోతాయి. కార్శి తోటల్లో ఈ ధాతు లోపం ఎక్కువగా కన్పిస్తుంది.
 
 శనగలో...
 శనగ పైరులో ఇనుప ధాతువు లోపిస్తే ఆకులు పసుపు రంగుకు మారతాయి. మొక్కలు కుంచించుకుపోతాయి. ధాతు లోప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు గోధుమ రంగుకు మారతాయి. చివర్లు ఎండిపోతాయి.
 
 బత్తాయి-నిమ్మలో...
 ఇనుప ధాతు లోపం నిమ్మ తోటల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ఈ ధాతువు లోపించిన తోటల్లో లేత ఆకుల ఈనెలు ఆకుపచ్చగానే ఉన్నప్పటికీ మిగిలిన భాగం మొత్తం పసుపు రంగుకు మారుతుంది. చివరికి ఆకు మొత్తం పాలిపోయి తెల్లగా మారుతుంది. కాయలు కూడా రాలిపోతాయి. కొన్ని కూరగాయ పంటల్లో ఇనుప ధాతువు లోపించినప్పుడు కూడా ఇవే లక్షణాలు కన్పిస్తాయి.
 
 ఎలా నివారించాలి?
 ఆకులపై ఇనుప ధాతు లోపాన్ని గమనించినట్లయితే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అన్నభేది (ఫై సల్ఫేట్) కలిపి పిచికారీ చేసుకోవాలి. కిలో అన్నభేదికి 100 గ్రాముల చొప్పున నిమ్మ ఉప్పు కలిపితే మంచి ఫలితం వస్తుంది. ఈ మందు ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే ఇనుప ధాతు లోపాన్ని పూర్తిగా నివారించవచ్చు.
 
 జింక్ లోపిస్తే...?
 పైరు వేసే ముందు ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను వేసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని నివారించవచ్చు. చౌడు భూముల్లో మాత్రం ఎకరానికి 40 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరులో జింక్ లోప లక్షణాలు కన్పిస్తే 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని (లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలపాలి) వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement