ఆరోగ్యవంతమైన నారు కోసం... | Healthy seeds for Paddy crops | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన నారు కోసం...

Published Fri, Jun 20 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఆరోగ్యవంతమైన నారు కోసం...

ఆరోగ్యవంతమైన నారు కోసం...

పాడి-పంట: అమలాపురం (తూర్పు గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన మేలైన, తమ ప్రాంతానికి అనువైన వంగడాలను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే చేపట్టాల్సిన చర్యలపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు అందిస్తున్న సూచనలు...
 
విత్తన మోతాదు-శుద్ధి

 ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయడానికి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సెంటుకు ఐదు కిలోల చొప్పున ఐదు సెంట్ల నారుమడిలో విత్తనాలు చల్లుకోవాలి. వర్షాధార పంటగా వరి వేసే వారు గొర్రుతో విత్తడానికి 30-36 కిలోల విత్తనాలు వినియోగించాలి. వరిలో విత్తనశుద్ధి తప్పనిసరి. దీనివల్ల విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. పొడి విత్తనశుద్ధి చేసే వారు కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున కార్బండజిమ్ పట్టించి, రెండు రోజుల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. తడి విత్తనశుద్ధి కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాల్ని 24 గంటలు నానబెట్టి, ఆ తర్వాత 24-36 గంటల పాటు మండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లుకోవాలి.
 
 నారుమడి తయారీ ఇలా...
 దృఢమైన, ఆరోగ్యవంతమైన నారును పొందాలంటే విత్తనాలు చల్లడానికి ముందు నారుమడిని మూడుసార్లు బాగా దున్ని కలుపు మొక్కల్ని ఏరేయాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12-16 రోజులకు మరోసారి ప్రతి ఐదు సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వ రం, పొటాష్‌లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వేయాలి. సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది.
 
 నీరు ఎలా అందించాలి?
 నారుమడిలో సెంటీమీటరు లోతున నీరు ఉంచి, సాయంకాలం వేళ విత్తనాలు చల్లుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీటిని తీసేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చి, ఆ తర్వాత పలచగా నీరు పెట్టాలి. నారుమడిలో తగినంత నీరు లేకపోతే భూమిలో సన్నని పగుళ్లు ఏర్పడతాయి. మొక్కల వేర్లు భూమి లోపలికి పోయి, పీకేటప్పుడు తెగిపోతాయి. దీనివల్ల ప్రధాన పొలంలో నాటేందుకు నారు సరిపోకపోవచ్చు.
 
 కలుపు నివారణ ఎలా?
 నారుమడిలో కలుపు నివారణ కోసం విత్తనాలు చల్లిన మూడు రోజులకు లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల బ్యూటాక్లోర్ లేదా సోఫిట్ (ప్రెటిలాక్లోర్, సేఫ్‌నర్ కలిసిన మందు) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమడుల్లో ప్రధానంగా వచ్చే కలుపు ఊద. ఈ కలుపు మొక్కలు, వరి మొక్కలు తొలి దశలో ఒకే విధంగా ఉంటా యి. వీటిని గుర్తించి తొలగించడం చాలా కష్టం. విత్తనాలు చల్లిన 15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊద, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు సమానంగా ఉన్నట్లయితే విత్తనాలు చల్లిన 15 రోజులకు 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున బిస్ పైరిబాక్ సోడియం 10% కలిపి పిచికారీ చేయాలి.
 
 చీడపీడల నివారణ కోసం...
 నారుమడిలో చీడపీడల నివారణ కోసం... విత్తనాలు చల్లిన 10 రోజులకు ఐదు సెంట్ల నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి విత్తనాలు చల్లిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి. లేకుంటే నారు పీకడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికల్ని పైన సూచించిన మోతాదులో వేయాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు తక్కువగా ఉండాలి.
 
 ఈ జాగ్రత్తలు తీసుకోండి
 నారు పీకేటప్పుడు వేర్లు ఎక్కువగా తెగిపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం నారుమడికి ముందుగా నీరు పెట్టి, నేలను బురద పదును మీద ఉంచాలి. పీకిన నారు మొక్కలు వడలకుండా ఉండాలంటే వాటిని నీటిలో ఉంచాలి. నారు లేతాకుపచ్చ రంగులో ఉన్నట్లయితే నాటిన తర్వాత మొక్కలు త్వరగా కోలుకొని పిలకలు తొడుగుతాయి. ముదురాకుపచ్చగా ఉంటే మొక్కలు ఎండిపోయి త్వరగా మూన తిరగవు. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
 
 ఈ పంటలు వేసుకోండి
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ప్రస్తుతం టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement