సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు.
38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు...
రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు.
రైతులు ఏం చేయాలంటే?
- ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి.
- వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి.
- సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి.
- పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి.
- ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి.
- మే జూన్‌లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.
- వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి.
- ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్‌ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
- వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.
- ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది.
- వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment