పాలిహౌస్‌లో పచ్చిమేత! | green fodder in pali house | Sakshi
Sakshi News home page

పాలిహౌస్‌లో పచ్చిమేత!

Published Sun, May 11 2014 11:45 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

పాలిహౌస్‌లో  పచ్చిమేత! - Sakshi

పాలిహౌస్‌లో పచ్చిమేత!

150 చదరపు అడుగుల్లోనే 10 పశువులకు గడ్డి సాగు
పాలకు పచ్చిమేతకు అవినాభావ సంబంధం ఉంది. పాల దిగుబడి బాగుండాలంటే పాడి పశువులకు రోజూ పచ్చిమేత మేపాల్సిందే. ముఖ్యంగా వేసవిలో పచ్చిమేత అవసరం మరీ ఎక్కువ. పచ్చిమేతను ఏడాది పొడవునా సమకూర్చుకునే క్రమంలో పాడి రైతులు ఎన్నో వ్యయ ప్రయాసల పాలవుతుంటారు. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించే మార్గం వెదికే కృషిలో ఓ యువ పాడి రైతు సఫలీకృతుడయ్యాడు.
 అతి తక్కువ స్థలంలో, తక్కువ నీటితో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని.. ఏడాది పొడవునా, సులభంగా పెంచవచ్చని నిరూపిస్తున్నారు నలమాటి రామారావు.

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద వాస్తవ్యులైన రామారావు ఆధునిక హైడ్రోపోనిక్ పద్ధతికి తన వినూత్న ఆలోచనను జోడించి.. చిన్న రైతులకు అనుసరణీయమైన రీతిలో సులభంగా పశుగ్రాసం సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెస్సీ ఎనలిటిక్ కెమిస్ట్రీ చదివి డెయిరీ ఫారం నిర్వహిస్తున్న క్రమంలో ఎదురైన ఇబ్బందులే ఆయనను పశుగ్రాసం సాగులో ప్రయోగాల దిశగా అడుగులు వేయించాయి.

పాడి పశువులతోపాటు మేకలు, గొర్రెలకూ వేయొచ్చు..
స్వగ్రామంలోనే రామారావు 30 పశువులతో డెయిరీ ఫారాన్ని నిర్వహిస్తున్నారు. పచ్చిమేత కోసం గతంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేవారు. కూలీల కొరత, నీటి కొరత.. ఒకటేమిటి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రారంభించిన అన్వేషణలో ఇంటర్‌నెట్ ద్వారా ‘హైడ్రోపోనిక్’ విధానం గురించి తెలుసుకున్నారు. దీనికి స్వదేశీ సాంకేతికతను జోడించి ప్రయోగాలు చేశారు.

ఆయన కృషి చక్కని ఫలితాలనిచ్చింది. పిడికెడు కూడా మట్టి అవసరం లేకుండా, ఎరువుల ఖర్చు లేకుండా, తక్కువ నీటితో ట్రేలలో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు రామారావు. వరి, మొక్కజొన్న, గోధుమ, సజ్జ, రాగులు, పిల్లి పెసర, అలసంద, శనగ తదితర పది రకాల ధాన్యపు జాతి, గడ్డి జాతి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి పశువులకూ ఇలా పెంచిన పచ్చిమేతను మేపుకోవచ్చనేది ఆయన భావన.

ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలలోనే పెంచాలి!
రామారావు సొంత మేడపైన 275 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలిహౌస్‌ను ఏర్పాటు చేసుకొని పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ఇనుప ర్యాక్‌లలో యూవీ స్టెరిలైజ్డ్ మెటీరియల్‌తో తయారు చేసిన ప్రత్యేక బ్యాక్టీరియా రహిత ట్రేలను ఏర్పాటు చేశారు.  విత్తనాలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత ట్రేలలో నింపుతున్నారు. తగిన ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడల్లా సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని కలిపిన నీటిని పిచికారీ చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. రామారావే స్వయంగా ఈ ద్రావణాన్ని తయారు చేశారు. దీంతో, వారం రోజుల్లో నవనవలాడే పచ్చని పశుగ్రాసం పెరుగుతోంది.

ఈ పద్ధతిలో పచ్చిగడ్డిని పాలిహౌస్‌లోనే పెంచాలనేమీ లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేకుల షెడ్లలోనూ పెంచుకోవచ్చని రామారావు చెబుతున్నారు.  ఒకటి నుంచి ఎన్ని ఎక్కువ పాడి పశువులున్న రైతులకైనా ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. సాధారణ పచ్చిమేతలో ఉండే పోషకాల కన్నా ఈ విధానంలో పెంచిన పచ్చిగడ్డిలో అధిక పోషక విలువలున్నట్టు తమ లేబరేటరీ పరీక్షల్లో తేలిందన్నారు. పశుగ్రాసం పెంచుతున్న పాలిహౌస్‌ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డా. డి.వెంకటేశ్వర్లు, పాడి పరిశ్రమ ప్రముఖులు ఇటీవల పరిశీలించి రామారావును అభినందించడం విశేషం.
 - పెనుబోతుల విజయకుమార్, న్యూస్‌లైన్, మండపేట, తూ.గో. జిల్లా
 
20% వరకు పెరిగిన పాల దిగుబడి
- మేడపైన లోకాస్ట్ పాలిహౌస్‌లో హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి సాగుకు శ్రీకారం
- తేమ, ఉష్ణోగ్రతను బట్టి నీటిని పిచికారీ చేసే
- ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు
- పొలం, ఎరువులు అక్కర్లేదు.. 50 పశువులకు ఒక కూలీ చాలు!
 
నిరంతరాయంగా పచ్చిగడ్డి సాగుకు అనువైన పద్ధతి
పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రయోగం చేపట్టి, రెండున్నరేళ్ల తర్వాత విజయం సాధించా. పోషకాలతో కూడిన పచ్చిగడ్డిని ట్రేలలో  పెంచేందుకు సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని రూపొందించా. పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నా. 4 నెలలుగా ఈ పచ్చిగడ్డినే మా పశువులకు మేపుతున్నాం. పాల దిగుబడి గేదెల్లో 12%, ఆవుల్లో 20% పెరిగింది. గేదె పాలలో వెన్న 15% పెరిగింది. ఎటువంటి రసాయనాలూ వాడకుండా పూర్తిగా సేంద్రియంగా, ఏడాది పొడవునా నిరంతరాయంగా పశుగ్రాసం సాగుకు ఇది అనువైన పద్ధతి.
     - నలమాటి రామారావు(85199 90000), ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా  
 
ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం..
పశుగ్రాసాల పెంపకానికి స్థలం, తగిన వసతి లేని చోట ప్రత్యామ్నాయంగా ఈ విధానం ఎంతో ఉత్తమం. ఉత్పత్తి వ్యయాన్ని ఇంకా తగ్గించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
 - కె.గాబ్రియేల్, ప్రిన్సిపాల్,
 పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం, మండపేట

 
 
ఇవీ ప్రత్యేకతలు...!
 
పాలిచ్చే పశువుకు రోజుకు 30 కేజీల సాధారణ పచ్చిగడ్డి అవసరం. హైడ్రోపోనిక్ పద్ధతిలో పెంచిన పచ్చిమేత 10 కిలోలు చాలు. దీన్ని 20 కేజీలు వేస్తే ఇక దాణా అక్కర్లేదు. అయితే, ఎలా పెంచిన పచ్చిగడ్డి వేసినా.. ప్రతి పశువుకు రోజుకు 6 కిలోల ఎండుగడ్డి కూడా వేయడం అవసరం.
- 10 పాడి పశువులకు సరిపోయే పచ్చిగడ్డి పెంచడానికి సాధారణంగా ఎకరం పొలం అవసరం. ఈ పద్ధతిలో 150 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది.
- ఒక్కో పాడి పశువుకు పొలంలో పచ్చిగడ్డి సాగుకు రూ. 110-150 ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రూ. 70-90 ఖర్చవుతుంది.
- పొలంలో కిలో పచ్చిగడ్డి సాగుకు 80 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రెండు లీటర్లు చాలు.
- 10 పశువులకు పొలంలో గడ్డి కోసి వేయడానికి ఒక కూలీ అవసరం. ఈ పద్ధతిలో 50 పశువులకు ఒక కూలీ చాలు.
- హైడ్రోపోనిక్ పద్ధతిలో గడ్డి సాగుకు పొలం అవసరం లేదు. కాబట్టి రైతుకు కౌలు మిగులుతుంది.
- ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. కానీ, ట్రేలలో కిలో పచ్చిమేత ఉత్పత్తికి రూపాయి ఖరీదైన సూక్ష్మపోషకాల ద్రావణం వాడాల్సి ఉంటుంది. కేజీ పశుగ్రాసం ఉత్పత్తికి రూ. 5 నుంచి 7లు ఖర్చవుతాయి.
- పొలంలో గడ్డి కోసిన తర్వాత మళ్లీ పెరగడానికి 45 రోజులు పడుతుంది. ఈ పద్ధతిలో గింజలు వేసిన వారం రోజుల్లో పశుగ్రాసం అందుతుంది.
- 1, 2 పాడి పశువుల కోసమైతే రేకుల షెడ్డు లేదా ఒక గదిలో ఇనుప ర్యాక్‌లు ఏర్పాటు చేసి హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి పెంచుకోవచ్చు.
- పాలీహౌస్‌లో 10 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 2.2 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. 50 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 9 లక్షలు ఖర్చవుతాయి. తదనంతరం గింజలు, విద్యుత్తు, సూక్ష్మపోషకాల ద్రావణం ఖర్చు మాత్రమే.
- ఈ పద్ధతిలో మొక్కజొన్నలతో పచ్చిగడ్డి సాగు రైతుకు అన్ని విధాలా అనుకూలం. ఒక పాడి పశువుకు (దాణా లేకుండా) రోజూ 20 కిలోల పచ్చిగడ్డి వేయాలనుకుంటే.. 5 కిలోల మొక్కజొన్నలు అవసరమవుతాయి.  
 
 ట్రేలలో పచ్చిగడ్డిని పరిశీలిస్తున్న డా. డి.వెంకటేశ్వర్లు, తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement