న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు అంకురించడంతో పశువులు, ముఖ్యంగా ఎద్దుల అవసరం తగ్గుతూ వస్తోన్న విషయం తెల్సిందే. నేడు సన్న, చిన్నకారు రైతులు మినహా ఎవరూ ఎద్దులపై ఆధారపడి వ్యవసాయం చేయడం లేదు. నాగళ్ల చోట ట్రాక్టర్లు రావడం, మోట బావుల చోట బోరింగ్‌లు రావడంతో ఎద్దులతో మోట కొట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. దేశంలోని మారుమూల పల్లెల్లో కొన్ని మోట బావులు ఉన్నప్పటికీ కరెంటు మోటార్లు రావడంతో వాటికీ ఎద్దుల శ్రమ లేకుండా పోయింది. పాల కోసం ఆవులను మాత్రం సాధుతున్న రైతులు వాటిని పాలిచ్చేంత వరకు ప్రాణంగానే చూసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరి పశువులు, ముఖ్యంగా ఎద్దులు ఏమవుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం అందరికి తెల్సిందే. పనికిరాని పశువులను కబేళాలను తరలిపోతున్నాయన్నది. ఇప్పుడు కబీళాలకు ఎద్దులను, ఆవులను తరలించకుండా కేంద్ర ప్రభుత్వం క్రయ,విక్రయాలను నియంత్రిస్తూ జాతయ జంతు క్రూరత్వ నిరోధక చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. పశువులను కబేళాలకు తరలించకుండా కొన్ని రాష్ట్రాలు కఠిన చట్టాలు కూడా తీసుకవచ్చాయి. గుజరాత్ రాష్ట్రమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చింది. 2012 నుంచి దేశంలో ట్రాక్టర్ల పెరుగుదల తొమ్మిది శాతంగా ఉంది.
అప్పటి పశు సంపద గణాంకాల ప్రకారం సమీప భవిష్యత్తులో 4.40 లక్షల ఎద్దులు నిరుపయోగం కానున్నాయి. తన జీవనోపాధికే అష్టకష్టాలు పడుతున్న రైతులు ఈ నిరుపయోగమయ్యే ఎద్దులను ఆదరించే అవకాశం ఏ మాత్రం లేదు. డబ్బుల కోసం గతంలో కబేళాలలకు విక్రయించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది ట్రాక్టర్ల వద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఆరు శాతమే వద్ధి ఉంటుందనుకున్నా మరో పదేళ్ల కాలంలో దాదాపు 14 కోట్ల ఎద్దులు రోడ్డున పడనున్నాయి. మరి వాటిని ఎవరు పోషించాలి?
పశువధను నిషేధించిన కర్మానికి వాటిని పోషించేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చిన పక్షంలో ప్రస్తుతమున్న దాణా రేట్ల ప్రకారం వాటిని పోషించేందుకు ఒక్కదానికి 60 రూపాయల చొప్పున రోజుకు 840 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పంట చేతికిరాక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇంత సొమ్ము పశుదాణాపై ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఏ మేరకు సబబు?
రోజుకు రూ. 840 కోట్లు ఖర్చుపెట్టేదెవరు?
Published Mon, Jul 3 2017 2:18 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement