ఆవుకు రక్షణ హారం
పంజాబ్, లూథియానా జిల్లాలోని, తల్వారా గ్రామం.. గ్రామానికంటే పెద్దది. అలాగని పట్టణం అనేందుకు లేదు. నివాస ప్రాంతాల్లో రోడ్డు మీద మనుషులు, వాహనాలతోపాటు పశువులు కూడా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద పశువులనగానే... కదలాడే స్పీడ్ బ్రేకర్‌లని సరదాగా నవ్వుకోవడానికి బాగానే ఉంటుందేమో కానీ అక్కడి వాళ్లకు అది ప్రాణాల మీదకు తెస్తోంది. పగలైతే ఫర్వాలేదు, రాత్రిళ్లు పరిస్థితి మరీ ఘోరం.
పశువులను తప్పించుకోబోయిన వాహనాలకు యాక్సిడెంట్‌లు అవుతున్నాయి. ఆ ప్రమాదాల్లో వాహనదారులకు, కొన్నిసార్లు పశువులకు కూడా తీవ్ర గాయాలవుతున్నాయి. రోడ్డు మీద నడిచే వాళ్లకూ ప్రమాదాలు తప్పడం లేదు. ఇది ఎంత తీవ్రంగా పరిణమించిందీ అంటే.. 2015 నుంచి 2017 జూన్ నాటికి ఇలాంటి ప్రమాదాల్లో మూడు వందల మంది చనిపోయారు. సగటున మూడు రోజులకో మరణం! వార్తాపత్రికల్లో కూడా కథనాలు ఎక్కువగానే వచ్చాయి. అయితే, ఈ వార్తలు అధికారులను కానీ పాలకులను కానీ ఏ మాత్రం కదిలించలేక పోయాయి.
ఓ రోజు.. ఘోర ప్రమాదం!
ఒకరోజు పశువులను తప్పించుకోబోయిన ఒక కారు ఘోరమైన ప్రమాదానికి లోనయింది, కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తల్వారా గ్రామం మొత్తాన్నీ కదిలించి వేసింది. అంతకంటే ఎక్కువగా స్థానిక ‘సత్య భారతి’ స్కూల్ పిల్లల్లో ఆలోచన రేకెత్తించింది. ‘ప్రమాదాలు జరగకుండా మనం ఏమైనా చేయవచ్చా?’ ఈ ప్రశ్న వాళ్ల చిన్న బుర్రల్లో కలగడం ఆలస్యం.. వాళ్లిక రకరకాల పరిష్కార మార్గాలను ఆలోచించడం మొదలుపెట్టారు.
మొదటి ఆలోచన
రోడ్డుపక్కన నాటిన చెట్ల కాండాలకు రంగులు వేయడం గుర్తు వచ్చింది ఆ స్కూలు పిల్లలకు. అవి రాత్రి పూట వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగు వాహనదారులకు డైరెక్షన్‌గా పనిచేస్తోంది. పశువుల కొమ్ములకు రాత్రి పూట వెలిగే రేడియం పెయింట్ వేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు. కానీ ఒక చోట కదలకుండా ఉండని పశువులను పట్టుకుని వాటి కొమ్ములకు రంగులు వేయడం కష్టమైంది. పిల్లలు దగ్గరకు వెళ్లగానే అవి పారిపోయేవి. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు.
రెండో ఆలోచన
రెండో ఆలోచనగా పశువుల మెడలో దండలు వేస్తే ఎలాగుంటుందీ అనుకున్నారు. పశువుల మెడలకు చుట్టేటంత పొడవున్న తాడుకి రేడియం టేపుని అతికించి, మువ్వల గంటలను కట్టారు. వాటిని వీధిలో తిరుగుతున్న పశువుల మెడలో వేశారు. పిల్లలు చేసిన ఈ పనితో పెద్దవాళ్లు ముందుకొచ్చి మిగిలిన పశువులకు రేడియం దండలు వేసుకున్నారు. ఇక రాత్రిళ్లు అవి రోడ్ల మీద తిరిగినా సరే, దూరం నుంచే వాహనదారులకు వాటి ఆనవాలు తెలుస్తుంది కాబట్టి ప్రమాదాలు వాటంతటవే నివారణ అయ్యాయి.
‘ఐ కెన్’ అవార్డు
పిల్లలు చేసిన ఈ మంచి పని గురించి స్కూలు టీచర్ ఒకరు ‘ఐ కెన్ అవార్డ్స్ 2017’ కు పంపించారు. పార్లే జీ కంపెనీ ‘డిజైన్ ఫర్ చేంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అవార్డుకి స్కూలు పిల్లలైన లక్ష్మి, కిరణ్‌దీప్ కౌర్, అమృత్‌పాల్ సింగ్, గగన్‌దీప్ సింగ్, జషన్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు. సామాజిక శ్రేయస్సు, సహేతుకమైన మార్పు కోసం ప్రయత్నించి, సఫలమైన వాళ్లకు ఈ అవార్డు ఇస్తారు. ఈ స్కూలు పిల్లలంతా పదేళ్ల పిల్లలే. వీళ్లు చేసిన పని చిన్నదిగానే కనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ల ఆలోచనను, ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే.
- మంజీర
Comments
Please login to add a commentAdd a comment