radium stickers
-
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
మంచి ఆలోచన
పంజాబ్, లూథియానా జిల్లాలోని, తల్వారా గ్రామం.. గ్రామానికంటే పెద్దది. అలాగని పట్టణం అనేందుకు లేదు. నివాస ప్రాంతాల్లో రోడ్డు మీద మనుషులు, వాహనాలతోపాటు పశువులు కూడా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద పశువులనగానే... కదలాడే స్పీడ్ బ్రేకర్లని సరదాగా నవ్వుకోవడానికి బాగానే ఉంటుందేమో కానీ అక్కడి వాళ్లకు అది ప్రాణాల మీదకు తెస్తోంది. పగలైతే ఫర్వాలేదు, రాత్రిళ్లు పరిస్థితి మరీ ఘోరం. పశువులను తప్పించుకోబోయిన వాహనాలకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ ప్రమాదాల్లో వాహనదారులకు, కొన్నిసార్లు పశువులకు కూడా తీవ్ర గాయాలవుతున్నాయి. రోడ్డు మీద నడిచే వాళ్లకూ ప్రమాదాలు తప్పడం లేదు. ఇది ఎంత తీవ్రంగా పరిణమించిందీ అంటే.. 2015 నుంచి 2017 జూన్ నాటికి ఇలాంటి ప్రమాదాల్లో మూడు వందల మంది చనిపోయారు. సగటున మూడు రోజులకో మరణం! వార్తాపత్రికల్లో కూడా కథనాలు ఎక్కువగానే వచ్చాయి. అయితే, ఈ వార్తలు అధికారులను కానీ పాలకులను కానీ ఏ మాత్రం కదిలించలేక పోయాయి. ఓ రోజు.. ఘోర ప్రమాదం! ఒకరోజు పశువులను తప్పించుకోబోయిన ఒక కారు ఘోరమైన ప్రమాదానికి లోనయింది, కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తల్వారా గ్రామం మొత్తాన్నీ కదిలించి వేసింది. అంతకంటే ఎక్కువగా స్థానిక ‘సత్య భారతి’ స్కూల్ పిల్లల్లో ఆలోచన రేకెత్తించింది. ‘ప్రమాదాలు జరగకుండా మనం ఏమైనా చేయవచ్చా?’ ఈ ప్రశ్న వాళ్ల చిన్న బుర్రల్లో కలగడం ఆలస్యం.. వాళ్లిక రకరకాల పరిష్కార మార్గాలను ఆలోచించడం మొదలుపెట్టారు. మొదటి ఆలోచన రోడ్డుపక్కన నాటిన చెట్ల కాండాలకు రంగులు వేయడం గుర్తు వచ్చింది ఆ స్కూలు పిల్లలకు. అవి రాత్రి పూట వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగు వాహనదారులకు డైరెక్షన్‌గా పనిచేస్తోంది. పశువుల కొమ్ములకు రాత్రి పూట వెలిగే రేడియం పెయింట్ వేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు. కానీ ఒక చోట కదలకుండా ఉండని పశువులను పట్టుకుని వాటి కొమ్ములకు రంగులు వేయడం కష్టమైంది. పిల్లలు దగ్గరకు వెళ్లగానే అవి పారిపోయేవి. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. రెండో ఆలోచన రెండో ఆలోచనగా పశువుల మెడలో దండలు వేస్తే ఎలాగుంటుందీ అనుకున్నారు. పశువుల మెడలకు చుట్టేటంత పొడవున్న తాడుకి రేడియం టేపుని అతికించి, మువ్వల గంటలను కట్టారు. వాటిని వీధిలో తిరుగుతున్న పశువుల మెడలో వేశారు. పిల్లలు చేసిన ఈ పనితో పెద్దవాళ్లు ముందుకొచ్చి మిగిలిన పశువులకు రేడియం దండలు వేసుకున్నారు. ఇక రాత్రిళ్లు అవి రోడ్ల మీద తిరిగినా సరే, దూరం నుంచే వాహనదారులకు వాటి ఆనవాలు తెలుస్తుంది కాబట్టి ప్రమాదాలు వాటంతటవే నివారణ అయ్యాయి. ‘ఐ కెన్’ అవార్డు పిల్లలు చేసిన ఈ మంచి పని గురించి స్కూలు టీచర్ ఒకరు ‘ఐ కెన్ అవార్డ్స్ 2017’ కు పంపించారు. పార్లే జీ కంపెనీ ‘డిజైన్ ఫర్ చేంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అవార్డుకి స్కూలు పిల్లలైన లక్ష్మి, కిరణ్‌దీప్ కౌర్, అమృత్‌పాల్ సింగ్, గగన్‌దీప్ సింగ్, జషన్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు. సామాజిక శ్రేయస్సు, సహేతుకమైన మార్పు కోసం ప్రయత్నించి, సఫలమైన వాళ్లకు ఈ అవార్డు ఇస్తారు. ఈ స్కూలు పిల్లలంతా పదేళ్ల పిల్లలే. వీళ్లు చేసిన పని చిన్నదిగానే కనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ల ఆలోచనను, ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. - మంజీర -
కాళిదాసు.. కదలదా బస్సు?
పన్నెండు గంటలు ట్రాఫిక్ జామ్ చేతులెత్తేసిన పోలీసులు పదేళ్ల తర్వాత తిరిగి ట్రాఫిక్ కష్టాలు పోలీసుల అతివిశ్వాసమే కారణం సాక్షి, హన్మకొండ : ‘ఎడ్లబండ్లపై వచ్చే ప్రయాణికులు తమ బండ్లకు, ఎడ్ల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అంటించుకోవాలి.. లేకపోతే వాటిని మేడారం జాతరకు అనుమతించం. ఆటోలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి గట్టమ్మ వరకే ఆటోలకు ప్రవేశం.’ అని జాతర మరో వారం రోజులు ఉందగనా జిల్లా యంత్రాంగం చేసిన హడావుడి ఇది. తీరా జాతర ప్రారంభానికి మరో రెండు గంటల ముందే వారి మాటలకు, చేతలకు సంబంధం లేదని తేలిపోయింది. జాతరకు వచ్చే వాహనాలను అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం చేసిన కసరత్తు విఫలమైంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ జామ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కానీ క్లియర్ కాలేదు. పిల్లాపాపాలతో జాతరకు బయల్దేరిన భక్తులు బస్సుల్లోనే జాగారం చేశారు. ఏం చేయాలో పాలుపోక ఇటు మేడారం అటు హన్మకొండల నుంచి ఆర్టీసీ బస్సులకు టిక్కట్ల జారీని నిలిపేశారు. కొంప ముంచిన స్పీడ్‌బ్రేకర్లు : మేడారం వెళ్లే వాహనాలకు పస్రా దగ్గర నుంచి వన్‌వే అమల్లో ఉంది. ప్రైవేటు వాహనాలు ఎడమ వైపునకు మలుపు తీసుకుని మేడారం చేరుకోవాల్సి ఉండగా ఆర్టీసీ బస్సులు నేరుగా తాడ్వాయి వెళ్లాలి. ఇక్కడ వన్‌వే అమలు చేయడంలో భాగంగా ములుగు మీదుగా వచ్చే వాహనాల స్పీడు తగ్గించేందుకు పస్రా దగ్గర తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రయోగం వికటించింది. ఫలితంగా వాహనాల వేగం బాగా నెమ్మదించింది. మంగ ళవారం మధ్యాహ్నం నుంచి మేడారానికి వాహనాల రాక పెరిగింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ తాకిడి ఎక్కువైంది. ముందు వెళ్లే వాహనాల వేగం తగ్గడంతో క్రమంగా బండెనక బండి కలిసి సాయంత్రం ఆరు గంటలకు పస్రా నుంచి వరంగల్ వైపు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమనించిన పోలీసులు రాత్రి ఏడు గంటలకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ల ను తొలగించారు. అప్పటికే వాహనాల రాక అనూహ్యంగా పెరిగింది. స్పీడ్ బ్రేకర్లు తీసినా వెల్లువలా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో పస్రా నుంచి వరంగల్ వైపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మరో ప్రయోగం : ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి మేడారం వైపు వచ్చే ట్రాఫిక్‌ను జంగాలపల్లి వద్ద నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి మల్లంపల్లి, వెంకటాపురం రోడ్డులో రామప్ప వరకు వాహనాలు నిలిచిపోయాయి. పస్రా వద్ద తెల్లవారుజామున 4 గంటలకు ట్రాఫిక్ క్లియరైంది. కుదరని సమన్వయం : అర్బన్, రూరల్ పోలీస్ విభాగాల మ ద్య లోపించిన సమన్వ యంతో ట్రాఫిక్ జామైనట్లు తెలు స్తోంది. జాతర బాధ్యతల విషయంలో రూరల్ ఎస్పీ అన్నీ తాైనె వ్యవహరించారు. పాస్‌ల కోసం అర్బన్ విభాగం అధి కారులు, సిబ్బంది రూరల్ ఎస్పీ కార్యాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృి ప్త వ్యక్తం చేశారు. కాగా, జాతర ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌లుగా రూర ల్ అదనపు ఎస్పీ శ్రీకాంత్, అర్బన్ ట్రాఫిక్ డీఎస్పీ రవికుమా ర్ను నియమించారు. ఏమైందోగాని చివరి నిమిషంలో మంగళవారం సాయంత్రం రవికుమార్‌ను బదిలీ చేశారు. విధుల్లో ఇన్‌చార్జ్‌లే : కాజీపేట నుంచి మేడారం వరకు ట్రాఫిక్ విభాగంను 16 సెక్టార్లుగా విభజించారు. సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొందరు డీఎస్పీలతోపాటు సీఐలను నియమించారు. సెక్టార్ల విభ జన, అధికారుల కేటాయింపు పూర్తయిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా బదిలీల పర్వం మొదలైంది. సెక్టార్ల ఇన్ చార్జ్‌లు దాదాపుగా బదిలీ అయ్యారు. బదిలీ ప్రదేశంలో జాయిన్ అయి వచ్చి సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న కొందరు సీఐలు జాతర పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ తలెత్తిన ప్రాంతాల్లో ఇన్చార్జ్ లు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావి స్తోంది. పోలీసు శాఖ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.