- పన్నెండు గంటలు ట్రాఫిక్ జామ్
- చేతులెత్తేసిన పోలీసులు
- పదేళ్ల తర్వాత తిరిగి ట్రాఫిక్ కష్టాలు
- పోలీసుల అతివిశ్వాసమే కారణం
సాక్షి, హన్మకొండ : ‘ఎడ్లబండ్లపై వచ్చే ప్రయాణికులు తమ బండ్లకు, ఎడ్ల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అంటించుకోవాలి.. లేకపోతే వాటిని మేడారం జాతరకు అనుమతించం. ఆటోలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి గట్టమ్మ వరకే ఆటోలకు ప్రవేశం.’ అని జాతర మరో వారం రోజులు ఉందగనా జిల్లా యంత్రాంగం చేసిన హడావుడి ఇది. తీరా జాతర ప్రారంభానికి మరో రెండు గంటల ముందే వారి మాటలకు, చేతలకు సంబంధం లేదని తేలిపోయింది.
జాతరకు వచ్చే వాహనాలను అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం చేసిన కసరత్తు విఫలమైంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ జామ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కానీ క్లియర్ కాలేదు. పిల్లాపాపాలతో జాతరకు బయల్దేరిన భక్తులు బస్సుల్లోనే జాగారం చేశారు. ఏం చేయాలో పాలుపోక ఇటు మేడారం అటు హన్మకొండల నుంచి ఆర్టీసీ బస్సులకు టిక్కట్ల జారీని నిలిపేశారు.
కొంప ముంచిన స్పీడ్‌బ్రేకర్లు : మేడారం వెళ్లే వాహనాలకు పస్రా దగ్గర నుంచి వన్‌వే అమల్లో ఉంది. ప్రైవేటు వాహనాలు ఎడమ వైపునకు మలుపు తీసుకుని మేడారం చేరుకోవాల్సి ఉండగా ఆర్టీసీ బస్సులు నేరుగా తాడ్వాయి వెళ్లాలి. ఇక్కడ వన్‌వే అమలు చేయడంలో భాగంగా ములుగు మీదుగా వచ్చే వాహనాల స్పీడు తగ్గించేందుకు పస్రా దగ్గర తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రయోగం వికటించింది. ఫలితంగా వాహనాల వేగం బాగా నెమ్మదించింది. మంగ ళవారం మధ్యాహ్నం నుంచి మేడారానికి వాహనాల రాక పెరిగింది.
సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ తాకిడి ఎక్కువైంది. ముందు వెళ్లే వాహనాల వేగం తగ్గడంతో క్రమంగా బండెనక బండి కలిసి సాయంత్రం ఆరు గంటలకు పస్రా నుంచి వరంగల్ వైపు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమనించిన పోలీసులు రాత్రి ఏడు గంటలకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ల ను తొలగించారు. అప్పటికే వాహనాల రాక అనూహ్యంగా పెరిగింది. స్పీడ్ బ్రేకర్లు తీసినా వెల్లువలా వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో పస్రా నుంచి వరంగల్ వైపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
మరో ప్రయోగం : ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి మేడారం వైపు వచ్చే ట్రాఫిక్‌ను జంగాలపల్లి వద్ద నిలిపివేశారు. దీంతో అక్కడి నుంచి మల్లంపల్లి, వెంకటాపురం రోడ్డులో రామప్ప వరకు వాహనాలు నిలిచిపోయాయి. పస్రా వద్ద తెల్లవారుజామున 4 గంటలకు ట్రాఫిక్ క్లియరైంది.
కుదరని సమన్వయం : అర్బన్, రూరల్ పోలీస్ విభాగాల మ ద్య లోపించిన సమన్వ యంతో ట్రాఫిక్ జామైనట్లు తెలు స్తోంది. జాతర బాధ్యతల విషయంలో రూరల్ ఎస్పీ అన్నీ తాైనె వ్యవహరించారు. పాస్‌ల కోసం అర్బన్ విభాగం అధి కారులు, సిబ్బంది రూరల్ ఎస్పీ కార్యాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృి ప్త వ్యక్తం చేశారు. కాగా, జాతర ట్రాఫిక్ ఇన్‌చార్జ్‌లుగా రూర ల్ అదనపు ఎస్పీ శ్రీకాంత్, అర్బన్ ట్రాఫిక్ డీఎస్పీ రవికుమా ర్‌ను నియమించారు. ఏమైందోగాని చివరి నిమిషంలో మంగళవారం సాయంత్రం రవికుమార్‌ను బదిలీ చేశారు.
విధుల్లో ఇన్‌చార్జ్‌లే : కాజీపేట నుంచి మేడారం వరకు ట్రాఫిక్ విభాగంను 16 సెక్టార్లుగా విభజించారు. సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొందరు డీఎస్పీలతోపాటు సీఐలను నియమించారు. సెక్టార్ల విభ జన, అధికారుల కేటాయింపు పూర్తయిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా బదిలీల పర్వం మొదలైంది. సెక్టార్ల ఇన్ చార్జ్‌లు దాదాపుగా బదిలీ అయ్యారు. బదిలీ ప్రదేశంలో జాయిన్ అయి వచ్చి సెక్టార్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న కొందరు సీఐలు జాతర పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ తలెత్తిన ప్రాంతాల్లో ఇన్‌చార్జ్ లు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావి స్తోంది. పోలీసు శాఖ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.