సాక్షి, రాజేంద్రనగర్ : ట్రాఫిక్ చిక్కులు సామాన్యులకే కాదు. దొంగలకు కష్టాలు తెచ్చిపెట్టిన సంఘటన ఇది. భారీ సొమ్ముతో ఉడాయించాలని చూసిన ఆ దొంగలకు ట్రాఫిక్ జామ్ కాస్తా పట్టించడంతో కటకటాల పాలయ్యారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని ఆ డబ్బు బ్యాగుతో ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తుండగా వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు రెప్పపాటులో బ్యాగును తస్కరించారు. బాధితుడు దొంగా దొంగా అంటూ వెంబడించగా కిలోమీటర్ అనంతరం రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నిందితులు ఇద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్ పారిశ్రామికవాడలో ఎన్‌బి పాల్తీన్ పరిశ్రమ యజమాని పరిశ్రమలో పని చేసే సిద్దూ సింగ్ (30)ను హైకోర్టు ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి 7 లక్షల రూపాయలను డ్రా చేసుకోని రావాలని పురమాయించారు. ద్విచక్ర వాహనంపై సిద్దూసింగ్ నగదు డ్రా చేసుకోని బ్యాగుతో పరిశ్రమకు పయణమైయ్యాడు.
అప్పటికే గమనిస్తున్నట్టున్నారు... ఆరాంఘర్ చౌరస్తా దాటిన అనంతరం కాటేదాన్ స్టేడియం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఇద్దరు యువకులు నడుస్తున్న ద్విచక్ర వాహనంపై నుంచే సిద్దూసింగ్ మెడలో వేసుకున్న బ్యాగ్‌ను లాక్కున్నారు. ఈ సంఘటనలో సిద్దూసింగ్ వాహనంతో సహా కిందపడిపోయాడు. వెంటనే తెరుకోని చోర్ చోర్ అంటూ వాహనంతో వారిని వెంబడించారు. దుర్గానగర్ చౌరస్తా నుంచి చంద్రయాన్‌గూట్ట వైపు నిందితులు ఇద్దరు పారిపోతున్నారు. కిలోమీటర్ పాటు చోర్ చోర్ అంటూ వారి వెనకాలే సిద్దుసింగ్ అనుసంరించాడు.
దుర్గానగర్ చౌరస్తా దాటిన అనంతరం శివాజీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడే ఉన్న వాహనాదారులు, స్థానికులు గమనించడంతో నిందితులిద్దరు వాహనాన్ని పక్కనే ఉన్న సందులోకి మళ్ళించే క్రమంలో కిందపడిపోయారు. స్థానికులు వారిని పట్టుకోని చితకబాదారు. అనంతరం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అప్పగించారు. పోలీసులు సిద్దుసింగ్‌తో ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. హైకోర్టు నుంచి దుర్గానగర్ వరకు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులు ఇద్దరే ఉన్నారా లేక వారికి మరెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment