ప్రైవేటు జోరు | private vehicles playing games with passengers life | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జోరు

Published Wed, Jan 10 2018 7:51 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

private vehicles playing games with passengers life - Sakshi

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి  ప్రైవేట్‌ వాహనాల జోరు తోడై ప్రయాణికుల జీవితాలకు చెలగాటంగా మారింది.  అధికారులు స్పందించకపోవడంతో జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేట్‌ వాహనాలైన ఆటోలు, జీపులు, టాటాఎస్‌ లలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆయా ప్రదేశాలకు చేరవేస్తున్నారు. ఒకవేళ ఊహించని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పరిమితికి మించి  ప్రయాణికులను తీసుకుపోతున్న  అటోలు, జీపులు తదితర ప్రైవేట్‌ వాహనాల కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా  అధికారు ల్లోమార్పురాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సిద్దిపేటలో ‘ప్రైవేటు’ జోరు..
జిల్లా కేంద్రం అయిన  సిద్దిపేటలో ప్రైవేట్‌ వాహనాల జోరు మరింత తీవ్రంగా ఉంది. సిద్దిపేట  జిల్లా కేంద్రం కావటం వలన ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారికి అటోలే పెద్ద దిక్కుగా మారాయి. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోకి విద్యార్థులు చదువులకోసం, వ్యాపారులు, ఇతరులు  నిత్యం అనేక మంది పట్టణాలకు తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల కూడా ఎంతోమంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది.  ప్రతీ గ్రామానికి మినీ బస్సులను ప్రభుత్వం నడిపితే ఆర్టీసీకి ఆదాయంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి వెళ్లాలంటే ప్రజలు ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి.

నిబంధనలు బేఖాతర్‌..
ముఖ్యంగా పల్లెలకు బస్సులు ప్రతి దినం రెండు లేక మూడు ట్రిప్పులు మాత్రమే తిరుగుతాయి . దీంతో ప్రయాణికులు ప్రమాదమని తెలిసినా అటోలను అశ్రయించాల్సివస్తోంది.  ఆటో డ్రైవర్లు మాత్రం ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేస్తే అధికంగా డబ్బులు వస్తాయన్న ఆశతో ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులను తీసుకుపోతున్నారు. దీంతో ఆటోప్రయాణం ప్రజల పాలిట కత్తిపై సాములా మారింది.

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటోలో కేవలం డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. దీంతో పాటుగా ఇతర వాహనాల్లో కెపాసిటీకి లోబడి ప్రయాణికులను తీసుకెళ్లాలి. కాని వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రతీ ఆటోలో కనీసం 10మందికి తక్కువ కాకుండా ప్రయాణికులు లేనిదే వాటిని ముందుకు కదిలించరు.

నియంత్రణ చర్యలు శూన్యం
ప్రైవేట్‌ వాహనాలకు ప్రమాదం సంభవిస్తే.. ఆ సందర్భంలో నిబంధనలు పాటించని వాహనాలకు, అందులో ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాద బీమా వర్తించదు.  అయినప్పటికీ జిల్లాలో ప్రైవేట్‌ వాహనాల జోరుపై సంబంధిత అధికారుల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు.  పట్టణాల్లో ప్రతినిత్యం ప్రైవేటు వాహనాలవారు నిబంధనలను పాటించేలా  సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాని ఇలాంటి చర్యలు కనిపించడం లేదు. ఎప్పుడో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించినపుడో,  ఇతర ముఖ్య అధికారులతో ఒత్తిడి వచ్చినపుడు మాత్రమే తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారు.  

ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి
 సిద్దిపేట జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్టు సౌకర్యాలు కల్పించడం అధికారుల బాధ్యత. జిల్లాలో మూడు రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి.  జిల్లా ముఖ్య పట్టణంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఉంటారు, ఇతర ముఖ్య ట్రాపిక్‌ అధికారులు , ఆర్టీసీ అధికారులు ఉంటారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు రవాణాలో ఇబ్బందులను తొలగించడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రమాదాలు జరిగినపుడే చూసుకుందాం అన్న ధోరణితో కాకుండా ముందే జాగ్రత్త పడాలని జిల్లా కేంద్రంలోని ప్రజలు అధికారులను కోరుతున్నారు.


అధికారులు స్పందించాలి
 ప్రతి అటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళుతున్నారు. చార్జీలనూ బాదుతున్నారు. సంబంధిత అధికారులు మారుమూల గ్రామాలకు మినీ బస్సులను నడిపి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పెంపొందించాలి. ప్రైవేట్‌ వాహనాలవారు ఓవర్‌లోడ్‌తో నడిపించకుండా తగిన చర్యలు చేపట్టాలి.  –దుర్గయ్య, ప్రశాంత్‌నగర్‌

సమయానికి బస్సులు లేక..
నేను సిద్దిపేటలో పని చేస్తాను.  ప్రతి రోజూ ఇంటికి వెళ్లాలంటే రాత్రి అవుతుంది. దీంతో ప్రైవేట్‌ వాహనాలను అశ్రయించక తప్పడం లేదు. వాటిలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. రాత్రి వేళలో బస్సులు వెళ్లిపోతే ప్రైవేటు వాహనాలే మాకు దిక్కుగా మారాయి. –పర్శరాములు, ప్రయాణికుడు

పరిమితికి మించితే కఠిన చర్యలు
ప్రతీ వాహనం పరిమితికి లోబడే ప్రయాణికులను తీసుకెళ్లాలి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే తీవ్ర చర్యలుంటాయి. వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటుగా, వాహనాలను సీజ్‌ చేస్తాం. ప్రమాదం సంభవిస్తే వాహనానికి, ప్రయాణికులకు ఎలాంటి బీమా వర్తించదు. –  రామేశ్వర్‌రెడ్డి, జిల్లా రవాణశాఖఅధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement