నారుమళ్లు...పశువులపాలు | Nurseries ... cattle milk | Sakshi
Sakshi News home page

నారుమళ్లు...పశువులపాలు

Published Wed, Aug 20 2014 2:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

నారుమళ్లు...పశువులపాలు - Sakshi

నారుమళ్లు...పశువులపాలు

  •   నీరులేక ఎండిపోతున్న వైనం
  •   ఎకరాకు రూ.4వేలు నష్టం
  •   కౌలు రైతు  పరిస్థితి మరీ దయనీయం
  •   తూర్పుకృష్ణాలో  కరువు కష్టాలే!
  • చల్లపల్లి : వరుణుడు కరుణించకపోయినా ఆయిల్ ఇంజన్లు, గుల్లపంపుతో నీరు తోడి పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న నారుమళ్లను రైతులే పశువుల పరం చేస్తున్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి పోసుకున్న నారుమడిని తమ కళ్లముందే  పశువులు మేస్తుండటంతో తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు.

    ఒకప్పుడు సాగులో ముందుండే  తూర్పుకృష్ణాలోని మొవ్వ, పామర్రు, దివిసీమలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి  ప్రాంతాల్లో ఈ దుస్థితి ఎదురవ్వడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 6.34లక్షల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. సకాలంలో సాగునీరందక పోయినా విద్యుత్ బోర్లు, ఆయిల్ ఇంజన్లతో వర్షపునీరు, తాగునీటికి వదిలిన నీటిని తోడుకుని ఎన్నో ఇబ్బందులు పడి నారుమళ్లు పోశారు.

    అనంతర కాలంలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో నారుమళ్లు ఎండిపోయాయి. ఘంటసాల, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో నారుమళ్లను కాపాడుకునేందుకు కూలీలతో నీళ్లపోత పోయించారు. ఎకరం పొలానికి నారుమడి పోసేందుకు వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.3,000 నుంచి రూ.4,000 ఖర్చుపెట్టారు. అయితే ఆగస్టు నెల సగం రోజులు పూర్తవుతున్నా వర్షాల్లేక సాగునీరందకపోవడంతో ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నారుమళ్లు ఎండిపోయి భూములు నోళ్లు తెరిచాయి. చేసేదిలేక రైతులు నారుమళ్లలో పశువులను తోలుతున్నారు.

    ఇప్పటికే నెలరోజులు అదును తప్పడంతో మళ్లీ నారుమళ్లు పోసినా సమయం చాలదని, ఎక్కడైనా నారు దొరికితే నాట్లు వేస్తాం లేదంటే ఖాళీగా వదిలేస్తామని ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన కొంతమంది రైతులు చెబుతున్నారు.   మరోవైపు మొవ్వ, పామర్రు, ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో బోర్ల ఆధారంగా పోసిన నారుమళ్లకు 50 నుంచి 60రోజులు గడిచింది. సాగునీరు లేకపోవడం వల్ల పొలాలు తడవక ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నాట్లు వేయలేదు. ఎక్కువ కాలం ఉన్న ఈ నారుమళ్లు నాట్లు వేసేందుకు ఉపయోగపడకుండా పోతుండడంతో ఈ ప్రాంత రైతులకు దిక్కుతోచడం లేదు.
     
    కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం...

    దివిసీమతో పాటు తూర్పు కృష్ణాలో ఈ ఏడాది ఎకరం పొలానికి 12 బస్తాల నుంచి 20 బస్తాల కౌలు ఇచ్చేందుకు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు ఇవ్వరేమోనని భయపడిన కొంతమంది కౌలు రైతులు బయట అందినకాడికి అప్పులు తెచ్చి ముందుగానే  కౌలు చెల్లించారు. పోసిన నారుమళ్లకు నీరందక ఎండిపోతుండటంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాట్లు వేయలేమని రైతులు చేతులెత్తేస్తున్నారు.

    రెండోపంట మినుము, మొక్కజొన్నపై ఆశపెట్టుకుని పెద్ద మొత్తంలో కౌలుకు తీసుకుని సాగుచేసేందుకు ప్రయత్నించిన కౌలురైతులు నారుమళ్లు ఎండిపోయి చనిపోవడంతో రెండోపంటకు సమయం చాలక కౌలుకు తీసుకున్న పొలాలను వదిలేస్తున్నారు. ఇకముందు సాగునీరందినా నాట్లు వేసే పరిస్థితిలేక పోవడంతో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో నాట్లు పడే అవకాశం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా తూర్పుకృష్ణాలో కరువు తాండవించే పరిస్థితులు కనబడుతున్నాయి.  తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
     
    చేసేది లేక పశువులకు మేపుతున్నాం
    ఎకరం పొలంలో వరినాట్లు వేసేందుకు నారుమడి పోశాము. సాగునీరు అందకపోవడంతో ఆయిల్ ఇంజన్‌తో మడిపోశాం. ఎండలు మండిపోవడం, సాగునీరందకపోవడంతో నారుమడి ఎండిపోయి చనిపోయింది. చేసేదిలేక పశువులకు మేపుతున్నాం. కంటి పాపలా కాపాడుకున్న నారుమడిని పశువులకు మేపుతుంటే కడుపు తరుక్కుపోతుంది.
    - కోరుకొండ ధనలక్ష్మీ, రైతు, రామానగరం, చల్లపల్లి
     
    సాగు వదిలేయాల్సిందే...
    ఎకరానికి ఇరవై వేలు కాడికి నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆయిల్ ఇంజన్లతో నారుమళ్లు పోశాను. తరువాత రెండుసార్లు తడుపులు చేశాను. అయినా నారుమడి ఎండిపోయి చనిపోయింది. నాటేయడానికి పనికిరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నారు ఎక్కడా దొరకదు. ఈ ఏడాది వదిలేయడం తప్ప ఏమీ చేయలేం.
     - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement