బేల(ఆదిలాబాద్): ఈ–మార్కెట్‌లో పండించిన పంటలు ఆన్‌లైన్ ద్వారా క్రయవిక్రయాలు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఏడాదిన్నర క్రితం ప్రతిష్ఠాత్మకంగా పశుబజార్ కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు అమలు అవుతుందో ప్రశార్థకంగా మారింది. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు తదితర వాటి విక్రయాలు, కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా పశుబజార్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఏడాదిన్నరక్రితం ప్రారంభించారు. పశువులు అమ్మేందుకు, కొనేందుకు వేదికగా ఈ పశుబజార్ ఉపయోగపడుతుంది. ఈ పశుబజార్ వెబ్‌సైట్‌లో విక్రేతలు వారి పశువుల వివరాలు నమోదు చేసుకుంటే..అవసరమైన రైతులు తెలుసుకొని ఆయా ప్రాం తాలకు వెళ్లి స్వయంగా పరిశీలించి కొనుక్కోవాలనేది లక్ష్యం.
తద్వారా శ్రమ, సమయం వృథా కావు. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో రైతులు, పశు పోషణదారుల వరకు చేరలేదు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు లేకపోలేదు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ఆశించిన ప్రచారం, రైతులతోపాటు పశు పోషణదారులతో ప్రత్యేక సమావేశాలు, సభలు ఇంతవరకు నిర్వహించలేదు. కేవలం పశువైద్యశాలలో వాల్ పోస్టర్ అతికించి వదిలేశారు. పశుబజార్ వెబ్‌సైట్‌పై అవగాహన, సాంకేతికంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలు ఎంత మాత్రమూ వివరించలేదని తెలిసింది. దీంతో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర అమ్మకాలు పాత పద్ధతిలోనే కొనసాగతున్నాయి. దీంతో అందుబాటులోని సంతకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
పశు బజార్‌తో కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభం.. ఈ పశుబజార్‌తో పశువుల కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభతరం కానుంది. పశువులు, ఇతరాత్ర వాటిని అమ్మదలచిన రైతులు వివరాలను పశు బజార్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలు 30రోజుల వరకు వెబ్‌సైట్‌లో ఉంటాయి. పశువులను కొనదలిచిన వారు ఈ వెబ్‌సైట్ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఇరువర్గాలు సంప్రదింపులు జరుపుకునే అవకాశం కూడా చేర్చారు.
స్థానిక వాతావరణానికి తట్టుకునే పశువులు ఎంపిక చేసుకోవచ్చు. ఆశించిన పాడి పశువులు, దుక్కిటెద్దులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక గొర్రెలు, మేకలు, పందులు తదితరవి విక్రయించే వారికి కొనుగోలు చేసే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మాంసంకోసం వ్యాపారులు, వినియోగదారులకు కూడా ఈ పశుబజార్ మరింత ప్రయోజనకరంగా మారనుంది. ధరలు, నాణ్యత, అవసరమైన మేరకు సరుకు లభిస్తుంది. ఈ పశుబజార్ ఆన్‌లైన్ అనుసంధానంతోపాటు భౌతికంగా చూసి కొనుగోలు చేస్తే, మరింత మేలు జరగనుంది.
దళారులకు చెక్..
సంతల్లో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర కొనుగోలు, అమ్మకాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దళారులుగా వ్యవహరించే వారు ఇరువర్గాల నుంచి కమీషన్లను వసూలు చేస్తుంటారు. ఇంతేకాకుండా పలు సందర్భాల్లో విక్రయించే వారి నుంచి ధర కుదుర్చుకుని కొనుగోలుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక రేట్లకు అమ్ముతున్న పరిస్థితి సంతల్లో జరుగుతోంది. పశు బజార్లపై అవగాహన కల్పిస్తే రైతులు, పశు పోషణదారులు నేరుగా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. తద్వారా ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు.
పశు బజార్ గురించి ఎవరు చెప్పలేదు
సంతలు, అంగళ్లు తెలుసు. కానీ గవర్నమెంటు కొత్తగా పెట్టిన పశుబజార్ గురించి ఎవరూ చెప్పలేదు. తెలియదు. దుక్కిటెద్దులు, పాడి పశువులు అవసరం ఉంటే అందుబాటులోని సంతలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నాం. పశుబజార్‌పై అవగాహన లేదు. వివరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. – గౌరి పురుషోత్తం,రైతు బేల
పశువులు అమ్మే, కొనేఆన్‌లైన్ మంచిదే
పంటలను ఆన్‌లైన్ ఆమ్ముతున్నట్లు పశువులు అమ్మే, కొనే పశుబజార్ ఆన్‌లైన్ మంచిదే. దీనిపై గ్రామాల్లో ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నిర్ణీత ధరలతోపాటు భౌతికంగా పశువు నచ్చితే అమ్మే, కొనే రైతులు నేరుగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. నష్టపోకుండా ఉంటాం.– గేడాం మనోహర్, పశు పోషణదారుడు సిర్సన్న
అవగాహన కల్పిస్తాం
రైతులు, పశు పోషణదారుల్లో ఈ పశుబజార్‌పై అవగాహన కల్పిస్తాం. ఏడాదిన్నర క్రితం ఇది ప్రారంభమైంది. పెద్దగా వినియోగంలో లేదు. అంతగా ప్రచారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పశు బజార్‌తో ప్రత్యేకంగా పశువుల సంతకు వెళ్లే అవసరం లేదు. ధర, నాణ్యత పశుబజార్ ఆన్‌లైన్‌లో ఉండడంతో కూర్చున్న చోటనే మనకు నచ్చిన సరుకు మన దగ్గరకు తెప్పించుకోవచ్చు. సమయం, శ్రమ వృథాకావు. ఈ పశు బజార్‌పై సాంకేతికపరమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పశు బజార్‌ను వినియోగించుకుని, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. – సురేశ్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment