చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి చౌరస్తా నుంచి మీర్‌పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు.
ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్‌లతో వీరంగం సృష్టించారు.
విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment