ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పశువుల వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను భారత్‌లోనే ఖరీదు చేసి, తమకు ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఎన్నారై వైద్యుడికి టోకరా వేశారు. వివిధ దఫాల్లో మొత్తం రూ.11.94 కోట్లు (16,11,025 డాలర్లు) కాజేశారు. గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది.
రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎ.చంద్రశేఖర్ రావు (82) అమెరికా పౌరసత్వం ఉండగా... అక్కడ సుదీర్ఘకాలం వైద్యుడిగా పని చేసి వచ్చారు. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో ఉంటున్న డాక్టర్ బెంజిమన్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చింది.
తాను పని చేస్తున్న సంస్థ పశువులకు వేసే వ్యాక్సిన్లు తయారు చేస్తుందని నమ్మబలికాడు. దీనికోసం తాము నిత్యం భారత్ నుంచి ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను ఖరీదు చేస్తామని చెప్పాడు. ఈ ఆయిల్‌పై చంద్రశేఖర్‌కు పరిజ్ఞానం ఉండటంతో నమ్మారు. ఇప్పటి వరకు తమకు ఆయిల్ సరఫరా చేసిన వారితో అనివార్య కారణాల నేపథ్యంలో ఒప్పందం రద్దయిందని పేర్కొన్నాడు. ఆయిల్‌ను మీరే లీటర్ 14,625 డాలర్లకు (రూ.10.84 లక్షలు) ఖరీదు చేసి తమకు సరఫరా చేస్తే 22 వేల డాలర్లకు (రూ.16.31 లక్షలు) కొంటామంటూ ఎర వేశాడు.
మహిళ నుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్
ఓపక్క ఈ సంప్రదింపులు జరుగుండగానే డాక్టర్ గీత నారాయణగా చెప్పుకున్న మహిళ నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అలా పరిచయమైన ఈమె వైద్యుడిని తెలివిగా ముగ్గులోకి దింపి సదరు ఆయిల్‌ను రాయ్‌గఢ్‌కు చెందిన మిల్లులో తయారు చేస్తారంటూ నమ్మించింది. అక్కడ పని చేసే లక్ష్మీ అనే మహిళతో తనకు పరిచయం ఉందంటూ చెప్పి ఆ పేరుతో సంప్రదింపులు జరిపింది. ఈ కథ ఇలా నడుస్తుండగా... మరోసారి టచ్‌లోకి వచ్చిన బెంజిమన్ శాంపిల్‌గా ఒక లీటర్ ఖరీదు చేసి పంపాలని, ఆ కంపెనీ ఖాతాలో డబ్బు జమ చేస్తే వాళ్లే తమకు ఆయిల్ పంపేస్తారంటూ చెప్పాడు. నగదు మాత్రం మీరే పేర్కొన్న ఖాతాలో వేస్తామంటూ పూర్తిగా నమ్మించాడు.
చంద్రశేఖర్ ఒక లీటర్ ఆయిల్ కోసం లక్ష్మీని సంప్రదించారు. దాని నిమిత్తం 14,625 డాలర్లు పంపించారు. ఈలోపు మళ్లీ సీన్‌లోకి వచ్చిన బెంజిమన్... లీటర్‌తో తమకు ఉపయోగం లేదని, కనీసం 350 పంపిస్తే ఒక బ్యాచ్ వ్యాక్సీన్లు తయారవుతాయని చెప్పాడు. చంద్రశేఖర్ దానికి సంబంధించిన మొత్తం లక్ష్మీ పేర్కొన్న ఖాతాలకు పంపిన తర్వాత మరో కథ మొదలైంది.
విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ..
ఆ ఆయిల్‌ను లండన్ విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ బెంజిమన్ చెప్పాడు. రిలీజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కట్టాలని చెప్పి మరికొంత మొత్తం కాజేశాడు. ఇలా ఈ ఏడాది మార్చ్ నుంచి మే వరకు వివిధ విడతల్లో మొత్తం 16,11,025 డాలర్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. మరో 2 వేల డాలర్లు పంపాలంటూ నేరగాళ్ల కోరడంతో చంద్రశేఖర్ అనుమానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి చంద్రశేఖర్‌కు మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో ఆయిల్ పేరుతో జరుగుతోంది పెద్ద మోసమంటూ అతడు పేర్కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన లండన్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులను సంప్రదించగా మొత్తం ఓ స్కామ్‌గా తేలింది.
కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయటకు రాలేదు. చివరకు గురువారం తన సమీప బంధువు మురళీమోహన్ ద్వారా సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.
అమెరికా, దుబయ్ బ్యాంకులకు నగదు బదిలీ
ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో చంద్రశేఖర్‌కు అమెరికాలోని వెల్స్ మార్గో బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అమెరికా, దుబయ్‌ల్లో ఉన్న మొరిల్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్‌లకు చెందిన తొమ్మిది ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఇలానే ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.5 కోట్లు కాజేశారు. ఇప్పటి వరకు ఇదే పెద్ద కేసుగా రికార్డుల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment