gau rakshak dal
-
కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత
చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి చౌరస్తా నుంచి మీర్‌పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్లతో వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు
ముంబై : మహారాష్ట్రలో గోరక్షకులు రెచ్చిపోయారు. ఎద్దు మాంసం తీసుకెళ్తున్నారనే అనుమానంతో ముగ్గురు ముస్లింలను చితక బాదారు. వీరిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారు ఎద్దు మాంసం తీసుకెళ్తున్నట్లు అనుమానించిన కొందరు వ్యక్తులు.. తమను తాము గోరక్షకులుగా చెప్పుకుని వారి మీద దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాక జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ వారిని బలవంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడమే కాక ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మోదీ ఓటర్లు తయారు చేసిన ఈ మూక ముస్లింలను ఎలా హింసిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ట్విట్ చేశారు. This is how Muslims are treated by Vigilantes created by Modi voters welcome to a New India which will Inclusive and as @PMOIndia said Secularism Ka Niqaab ...... https://t.co/Cy2uUUTirk — Asaduddin Owaisi (@asadowaisi) May 24, 2019 -
'బతికుండగానే నిప్పంటించే యత్నం'
రాజుల: గుజరాత్ లో దళితులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమను గదిలో బంధించిన గోరక్షక దళ సభ్యులు బతికుండగానే నిప్పంటించి చంపడానికి ప్రయత్నించినట్లు పట్టణానికి చెందిన ఏడుగురు దళితులు ఆరోపించారు. దాదాపు 30 మంది గో రక్షక దళ సభ్యులు తమపై ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులతో ఈ ఏడాది మే 22న దాడి చేసినట్లు తెలిపారు. తమ కులానికి చెందిన మిగలిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడగలిగినట్లు చెప్పారు. బాధితుల్లో ఒకడైన రవి జఖాడ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గో రక్షక దళ సభ్యులు తమ కాళ్లు, చేతులను గట్టిగా కదలకుండా పట్టుకున్నారని, మిగిలిన వారందరూ బ్యాట్లు, రాడ్లతో పాశవికంగా గాయపరిచినట్లు తెలిపాడు. బాధితుల్లో ఎవరైనా మారు మాట్లాడివుంటే తమను చావగొట్టే వాళ్లని, అక్కడికి కోపం చల్లారని కొందరు కిరోసిన్ తీసుకొని రమ్మని తమతో పాటు ఉన్న సభ్యులకు చెపినట్లు వివరించాడు. వీరందరిని గదిలో పడేసి తగులబెడదాం అని సభ్యులు మాట్లాడినట్లు తెలిపాడు. దళ సభ్యుల్లో ఇద్దరు కిరోసిన్ ను తీసుకురావడానికి వెళ్లినట్టు తాను చూశానని రవి వెల్లడించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తన తండ్రి తమ కులం వారితో కలిసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. తామంతా జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి తమను రక్షించినట్లు చెప్పాడు. కాగా, గో రక్షక దళ సభ్యుల దాడిలో రవి కుడి చెయ్యి విరిగింది. అతనికి తగిలిన దెబ్బల కారణంగా రెండు నెలల వరకూ పూర్తిగా నడిచే అవకాశం కనిపించడం లేదు. బాధితుల్లో మరొక వ్యక్తి దిలీప్ బబారియా దాడితో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇప్పటికీ అర్ధరాత్రి నిద్రలోంచి లేచి తనను చంపొద్దని పెద్దగా కేకలు వేస్తున్నానని చెప్పాడు. తమ కులానికి చెందిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో బతికిపోయామని తెలిపాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.