'బతికుండగానే నిప్పంటించే యత్నం'
రాజుల: గుజరాత్ లో దళితులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమను గదిలో బంధించిన గోరక్షక దళ సభ్యులు బతికుండగానే నిప్పంటించి చంపడానికి ప్రయత్నించినట్లు పట్టణానికి చెందిన ఏడుగురు దళితులు ఆరోపించారు. దాదాపు 30 మంది గో రక్షక దళ సభ్యులు తమపై ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులతో ఈ ఏడాది మే 22న దాడి చేసినట్లు తెలిపారు. తమ కులానికి చెందిన మిగలిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడగలిగినట్లు చెప్పారు.
బాధితుల్లో ఒకడైన రవి జఖాడ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గో రక్షక దళ సభ్యులు తమ కాళ్లు, చేతులను గట్టిగా కదలకుండా పట్టుకున్నారని, మిగిలిన వారందరూ బ్యాట్లు, రాడ్లతో పాశవికంగా గాయపరిచినట్లు తెలిపాడు. బాధితుల్లో ఎవరైనా మారు మాట్లాడివుంటే తమను చావగొట్టే వాళ్లని, అక్కడికి కోపం చల్లారని కొందరు కిరోసిన్ తీసుకొని రమ్మని తమతో పాటు ఉన్న సభ్యులకు చెపినట్లు వివరించాడు. వీరందరిని గదిలో పడేసి తగులబెడదాం అని సభ్యులు మాట్లాడినట్లు తెలిపాడు. దళ సభ్యుల్లో ఇద్దరు కిరోసిన్ ను తీసుకురావడానికి వెళ్లినట్టు తాను చూశానని రవి వెల్లడించాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన తన తండ్రి తమ కులం వారితో కలిసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. తామంతా జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి తమను రక్షించినట్లు చెప్పాడు. కాగా, గో రక్షక దళ సభ్యుల దాడిలో రవి కుడి చెయ్యి విరిగింది. అతనికి తగిలిన దెబ్బల కారణంగా రెండు నెలల వరకూ పూర్తిగా నడిచే అవకాశం కనిపించడం లేదు. బాధితుల్లో మరొక వ్యక్తి దిలీప్ బబారియా దాడితో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇప్పటికీ అర్ధరాత్రి నిద్రలోంచి లేచి తనను చంపొద్దని పెద్దగా కేకలు వేస్తున్నానని చెప్పాడు. తమ కులానికి చెందిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో బతికిపోయామని తెలిపాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.