డొక్కల కరువు
ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి.
రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు.
1780లో బ్రిటిష్ రాజకీయవేత్త ఎడ్మండ్ బర్క్ ఇండియాలో కంపెనీ విధానాన్ని ‘దోపిడీ రాజ్యం’ అన్నాడు. 19వ శతాబ్దంలో సిపాయి తిరుగుబాటు తరువాత ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ నుండి క్రౌన్‌కి మారటంతో ప్రభుత్వ దృక్పథంలో కాస్త మార్పు వచ్చిన మాట వాస్తవమే. కరువు కారణాలు, పరిస్థితులూ, సహాయక విధానం గురించి స్థానిక ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ‘ఫామైన్ కమిషన్లు’ ఏర్పాటయ్యాయి. ఆ సలహా సంఘాల నివేదికలు ఆనాటి దుర్భర పరిస్థితులను ఏకరువు పెడతాయి.
మత ప్రచారమే ముఖ్యోద్దేశ్యమైనా కాటకాలతో తల్లడిల్లుతున్న బడుగు ప్రజలకి క్రైస్తవ మిషనరీల సేవ గుర్తింపతగ్గది. 16వ శతాబ్దానికే కొందరు ఫ్రాన్సిస్కన్ ప్రచారకులు ఆంధ్రదేశంలోకి వచ్చారు. వారిని రోమా సన్యాసులు అనేవారు. 18వ శతాబ్దిలో క్యాథలిక్ జెసుయైట్ మిషన్లు ఆంధ్రలో ప్రవేశించాయి. ఆ కాలంలో రచింపబడిన తెలుగు గ్రంథాలు పూర్వవేదం, రాజుల చరిత్ర, క్రీస్తు చరిత్ర మొదలైన బైబిల్ కథలు క్రైస్తవ మతానికి ప్రజలలో ప్రాచుర్యాన్ని ఇచ్చాయి. 1805లో విశాఖపట్టణంలో లండన్ మిషనరీ సొసైటీ స్థాపనతో ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాలు రావటం మొదలయింది. 19వ శతాబ్ది మధ్యకాలంలో ఇండియాకి అనేక క్రైస్తవ సంఘాలు వెల్లువలా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది మెథొడిస్ట్ చర్చ్. గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ సహకారంతో గోదావరి మిషన్ రాజమండ్రిలో, హిందుస్తానీ మిషన్ హైదరాబాద్ రామ్‌కోటీలో కార్యకలాపాలు సాగించాయి. హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు రెవరెండ్ వెస్లీ చేసిన సేవలు అపారం.
1847లో జాన్ ఫ్రెడెరిక్ హైయ్యర్ గుంటూరులో స్థాపించిన లూథరన్ చర్చితో అమెరికన్ క్రైస్తవ మిషన్ల ఆగమనం మొదలయింది. మేరీలాండ్‌లోని వాల్టర్ రీడ్ హాస్పిటల్ నమూనాతో నిర్మించిన అమెరికన్ హాస్పిటల్ కోస్తాంధ్రలో ఆధునిక వైద్య సేవలకి కేంద్రబిందువు అయింది. మరో అమెరికన్ శాఖ, బాప్టిస్ట్ సమావేశం. కెనడాకి చెందిన శామ్యూల్ డే ద్వారా నెల్లూరులో వేళ్లూని నెల్లూరు, ఒంగోలు ముఖ్య కేంద్రాలుగా వృద్ధి చెందింది. తెలుగులో మొట్టమొదటి బైబిల్ ఈ సంఘానికి చెందిన లైమన్ జ్యూవెట్‌చే రచించబడింది. ఒంగోలు ప్రాంతంలో జ్యూవెట్ దంపతులు, జాన్ క్లోవ్ కరువు బాధితులకు ఎనలేని సేవలు అందించారు.