ఏపీ: నవంబర్‌ 26న పాడి పండుగ | Distribution Of Dairy Cattle To Women Under YSR Cheyutha November 26th | Sakshi
Sakshi News home page

ఏపీ: నవంబర్‌ 26న పాడి పండుగ

Published Fri, Nov 20 2020 4:16 AM | Last Updated on Fri, Nov 20 2020 8:14 AM

Distribution Of Dairy Cattle To Women Under YSR Cheyutha November 26th - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు నవంబర్‌ 26వ తేదీన పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్చువల్‌ విధానంలో వచ్చే గురువారం రోజు తొలిదశలో ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.

వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా వివరాలను పరిశీలించారు. చేయూత ద్వారా కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పశువులపై పెట్టుబడి పోషకులకు కచ్చితంగా గిట్టుబాటు కావాలని, ఈ మేరకు పాడి పశువులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పాల దిగుబడి బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. పశువుల దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభం అయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం సూచనల్లో ముఖ్యాంశాలివీ..

ఆర్బీకేల్లో సదుపాయాలను వినియోగించుకోవాలి
పెట్టుబడి కచ్చితంగా గిట్టుబాటు అయ్యేలా మేలు జాతిని ఎంపిక చేసేలా జాగ్రత్త వహించాలి. కొనుగోళ్ల కమిటీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారుండాలి. బీమా సంస్థ ప్రతినిధితో పాటు బ్యాంకర్‌ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. పశు సంవర్థక శాఖ సేవలను బలోపేతం చేసి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందించేలా అధికారులు సన్నద్ధం కావాలి. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాలను వైద్య సేవల కోసం వినియోగించుకోవాలి. కాల్‌ సెంటర్ల ద్వారా వైద్యం అందించాలి. 

సహజసిద్ధమైన దాణా..
పశువుల దాణా సక్రమంగా సరఫరా చేస్తూ రసాయనాలు (కెమికల్స్‌) లేకుండా సహజమైన పదార్థాలతో తయారైనవే అందించాలి. పశువులకు కలుషితమైన ఆహారం అందించడం వల్ల క్యాన్సర్‌ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. సేంద్రీయ (ఆర్గానిక్‌) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఉత్పత్తులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ పాల బ్రాండ్‌పై విస్తృత ప్రచారం చేపట్టి మహిళలకు అవగాహన కల్పించాలి.

పశువులకు ఆరోగ్య కార్డులు..
ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ చేశాక లబ్ధిదారులకు అందచేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో నమోదు చేసి ప్రతి నెలా పశువుల ఆరోగ్యాన్ని వైద్యులు పరిశీలిస్తారు. పాడి పశువులకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తారు. పాల దిగుబడి వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. 

లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ ఇలా
2020 నవంబర్‌ 26 : ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో  దాదాపు 7 వేల యూనిట్ల గేదెలు, ఆవుల పంపిణీ
2020 డిసెంబర్‌ 5 – 2021 ఫిబ్రవరి 28 మధ్య :దాదాపు లక్ష యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ
ఆగస్టు 2021 – ఫిబ్రవరి 2022 మధ్య : 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ
2021 నవంబరు 30 నుంచి – 2021 డిసెంబర్‌ 31 వరకు: గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement