సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతిని జన సునామీ చుట్టేసింది. జనసంద్రం తరలి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం ఒక చారిత్రక ఘట్టానికి వేదిక అయ్యింది. ఒకే రోజు 50,973 మందికి ఇళ్ల స్థల పట్టాలతో పాటు, 5,024 మందికి టిడ్కో గృహాలను సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు.
ఇంటి స్థలం పట్టా వచ్చిన ప్రతి ఇంటి నుంచి లబ్ధిదారులు కుటుంబాలతో సహా రావడంతో ఉదయం 8 గంటలకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నా పట్టించుకోకుండా పట్టాల పండుగకు జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణంతో పాటు ముందు ఉన్న ఖాళీ స్థలం మొత్తం నిండిపోయింది.
ఇప్పటి వరకు పేదలకు చోటు లేని రాజధానిగా ఉన్న అమరావతిలో టీడీపీ కుట్రలను ఎదుర్కొని సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి పేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందని లబ్ధిదారులు చర్చించుకున్నారు. నాలుగేళ్లుగా ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు తమ కల నెరవేరడంతో తమకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, తుళ్లూరు మండలాల నుంచి లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
కట్టుదిట్టంగా ఏర్పాట్లు
సభా ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసి పోవడంతో చాలా మంది పక్కనే ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కింద నిలబడి ముఖ్యమంత్రి ఉపన్యాసం విన్నారు. పట్టాలు వచ్చిన లబ్ధిదారుల సంఖ్యకు రెండింతల మంది తరలి రావడంతో వెంకటపాలెంకు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రాలుగా మారాయి. సీఎం చిత్రపటాలతో కూడిన పోస్టర్లు, ప్లకార్డులు చేతపట్టుకుని పైకి చూపిస్తూ అడుగడుగునా జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంతపెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చినా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు గ్యాలరీలలో ఉన్న మహిళలకు స్నాక్స్ అందజేశారు. వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, ఎంపీ నందిగం సురేష్‌లు సీఎం వైఎస్ జగన్‌కు రహదారి పొడవునా 3 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లు, తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మీ సంకల్పానికి సలాం
దేశంలో ఎక్కడా అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళుతున్న ప్రభుత్వం లేదు. పేదలను ఆస్తిపరులను చేయాలన్న మీ (సీఎం) సంకల్పానికి సలాం. మీ నాయకత్వంలో అన్ని వసతులతో ఊళ్లే నిర్మితమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ముందుకే వెళ్లారు.
చంద్రబాబు దళితులను, బీసీలను.. చివరికి పేదలను అవమానించారు. ఇప్పుడు ఇస్తున్న ఇంటి స్థలాలను కూడా సమాధులతో పోల్చారు. ఇన్ని తప్పులు చేసి నాలుగేళ్లుగా కోట్లు ఖర్చుపెట్టి స్టేలు తెచ్చుకుంటున్నాడేగాని, చేసిన పాపాలకు క్షమాపణ చెప్పలేదు. బాబుతో ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌ను ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలిచి బాబుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలకశాఖ మంత్రి
ప్రజల సీఎం వైఎస్ జగన్
గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వామపక్షాలు ధర్నాలు చేసేవి. కానీ జగన్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి లేదు. వారంతా చంద్రబాబుతో కలిసి డ్రామాలు ఆడుతున్నారు. బాబు సీఎం అయ్యి, అమరావతిలో రైతులను నిలువునా ముంచేశారు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుపడాలని చూశారు.
మరికొందరు అంబేడ్కర్ పేరు అడ్డుపెట్టుకుని అమ్ముడుపోయి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అడ్డుపడుతున్నారు. కానీ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఒకేసారి 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజల ముఖ్యమంత్రిగా నిలిచారు. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
న్యాయం సీఎం పక్షానే
గతంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నాలు, ఆందోళనలు చేసిన వారిని చూశాం. ఇప్పుడు మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ధర్నాలు చేయడం చూస్తున్నాం. వారికి చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు పేదలకు.. పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు పెత్తందార్ల పక్షాన ఉంటే సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారు. అందుకే ధర్మం కూడా ఆయన పక్షానే ఉంది. అన్ని వర్గాల పేదలు ఆయనతో ఉన్నారు. న్యాయం పేదల పక్షాన నిలిచింది. 2024లో మళ్లీ జగన్‌ను సీఎంగా చూస్తాం. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి
సమానత్వానికి నాంది
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది.
ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు.
– కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్‌యూ
ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో..
35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు. – రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా
ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే
అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.
– కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment