సాక్షి, రంగారెడ్డి : అఖిల భారత పశుగణన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈసారి ట్యాబ్‌లను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి నుంచే ట్యాబ్‌ల ద్వారా పశువుల వివరాలు సేకరించి అప్పడికప్పుడే డేటా సెంటర్‌కు పంపనున్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ గణన మొత్తం మూడు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. జిల్లాలోని సుమారు 5.36 లక్షల ఇళ్లకు ఎన్యుమరేటర్లు తిరుగుతూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు.
ఇందుకోసం సుమారు 190 మంది ఎన్యుమరేటర్లను సిద్ధం చేసింది యంత్రాంగం. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు 1,500, పట్టణ ప్రాంతంలో 2 వేల ఇళ్లకు తిరిగి సమాచారం సేకరించనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి పశు గణన జరుగుతోంది. చివరిసారిగా 2012లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వాస్తవంగా గతేడాది గణన జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జరగబోయే గణనలో అన్ని మూగజీవుల సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సిబ్బందికి సూచించారు.
స్వచ్ఛందంగా వివరాలివ్వండి
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వద్ద అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కేవీఎల్ నర్సింహారావు కోరారు. కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని ఆధారంగానే వచ్చే ఐదేళ్లపాటు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వివరాల సేకరణ చేపట్టే తేదీలను ముందుగానే తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment