- వరుస కరువుతో గ్రాసం కొరత
- కబ్జాలకు గురైన మందబయళ్లు, చెరువు భూములు
- పాడి పరిశ్రమకు అమలు కాని ప్రణాళికలు
- ఆందోళనలో అన్నదాతలు
తిరుపతి స్పోర్ట్స్ : వ్యవసాయ ప్రధానమైన మన జిల్లాలో రోజురోజుకూ పశు సంపద అంతరిస్తోంది. మందబయళ్లు, చెరువులు ఆక్రమణలకు గురికావడం, పశుపోషణ రైతులకు భారంగా మారడం, పాలకులు పాడిని పట్టించుకోకపోవడంతో అరుదైన పశుసంపద సైతం అంతరించిపోతోంది.
కాడెద్దులుంటే గౌరవం..
పొలాన్ని దుక్కి చేయాలంటే ఎద్దులుండాలి. పొలానికి ఎరువు తోలాలన్నా, విత్తు వేయాలన్నా, పంట దిగుబడిని ఇంటికి చేర్చాలన్నా.. పశువులు తప్పనిసరి. రైతుల జీవితంతో పశువుల అనుబంధం అంతగా పెనవేసుకుపోయింది. ఇదంతా గతం. ఇప్పుడు కాడెద్దులు లేవు.. వ్యవసాయ పనులు మాత్రం సాగుతున్నాయి. ఈ పనులకు ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్ వాడకం పెరిగాక దాదాపుగా వ్యవసాయ పనుల్లో పశువుల అవసరం బాగా తగ్గింది.
జిల్లాలో అధిక భాగం వ్యవసాయం వర్షాధారంతోనే సాగవుతోంది. ఏడాదికి ఒక పంట మాత్రమే చేతికొస్తుంది. అంటే, రైతులకు ఆరునెలలు పని ఉంటుంది. మిగతా ఆరు నెలలు ఖాళీ. ఇలాంటి వారంతా దుక్కులు చేయడానికి, గింజలు వేయడానికి ట్రాక్టర్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ రెండు పనులకోసం సంవత్సరం పొడవుకూ వీటిని పో షించడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో పశువుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1957లో ప్రతి 1000 మందికి 1800 పశువులు ఉండేవి. 2014 గణాంకాల ప్రకారం ప్రతి 1000 మందికి 186 పశువులు మాత్రమే మిగిలాయంటే ఇవి ఎంతగా అంతరించిపోయాయో తెలుస్తోంది.
అరుదైన పశువులూ అంతరించాయి..
యంత్రాల వాడకం పెరిగాక, పశుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోనే ఎంతో పేరున్న మన జిల్లాకు చెందిన పుంగనూరు పశువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇటీవల పుంగనూరు ప్రాంతానికి చెందిన ఒక రైతు క ర్ణాటక ప్రాంతానికి వెళ్లి ఈ ఆవును కొనుగోలు చేసుకుని వచ్చారు. ఇటీవల ఈ జాతి పశువులను సంరక్షించడం కోసం పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
పాడి ఆదుకుంటున్నా...
అదునుకు వాన లేక, బోరుబావుల్లో నీళ్లు లేక, పంటలు సాగు కాక అల్లాడుతున్న జిల్లా రైతాంగం పాలిట పాడిపరిశ్రమ వరంలా మారింది. చాలా మంది సన్న చిన్నకారు రైతులు ఆవులను పట్టుకుని వాటి నుంచి వచ్చే పాల దిగుబడితో కుటుంబాన్ని నెట్టుకు రావడం ప్రారంభించారు. వీటికి మేతకోసం ఉండే మందబయళ్లు క్రమేణా ఆక్రమణకు గురయ్యాయి. పశుగ్రాసం దొరకడం కష్టంగా మారింది. దాణా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులకు పాలదిగుబడి కంటే పశుపోషణే ఎక్కువ ఖర్చుగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికైనా పశుసంవర్ధక శాఖ, పాలకులు పట్టించుకుని జిల్లాలో పాడి వృద్ధికి ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా రైతాంగం కోరుతోంది.
పాల ఉత్పత్తి తగ్గలేదు
పశువుల సంఖ్య తగ్గిందే కానీ పాల ఉత్పత్తి తగ్గలేదు. పూటకు నాలుగులీటర్ల పాలు ఇచ్చే నాలుగు వాటికి బదులు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే ఆవులు రెండు ఉంటే చాలనుకుంటున్నారు. పశుగణాభివృద్ధి ప్రకారం 40 సంవత్సరాల నుంచి పాల ఉత్పత్తి తగ్గలేదు. చూలు కట్టని ఆవులకు కూడా చూలు నిలిచేవిధంగా ‘సుఫలం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
- శ్రీనివాసరావు, జేడీ, పశుసంవర్ధక శాఖ