నేల విడిచి సాగు | Vertical farming and other cultivation systems have started | Sakshi
Sakshi News home page

నేల విడిచి సాగు

Published Sat, Sep 9 2023 5:27 AM | Last Updated on Sat, Sep 9 2023 5:27 AM

Vertical farming and other cultivation systems have started - Sakshi

సేద్యం సరికొత్త పుంతలు తొక్కుతోంది. పగలనక, రేయనక.. ఎండనక, వాననక.. అరక పట్టి.. మెరక దున్ని.. పంట చేతికి వచ్చే వరకు మట్టిలో కష్టపడే రోజులకు స్వస్తి పలికే విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మట్టి లేకుండా.. నీటితో, గాలితో.. నిలువుగా.. అతి తక్కువ ప్రదేశంలోనే ఎక్కువ పంటలు పండించవచ్చు.

హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్, ఆక్వాపోనిక్స్‌.. వర్టికల్‌ ఫార్మింగ్‌ తదితర సాగు విధానాలు మొదలయ్యాయి. వీటి ద్వారా అవసరమైన పంటలు ఒకేచోట సాగు చేసుకోవచ్చు. సాధారణ వ్యవసాయానికి ఎక్కువ నీళ్లు అవసరమైతే.. ఈ సేద్యానికి అతి తక్కువ నీళ్లు సరిపోతాయి. తెగుళ్ల సమస్య తక్కువ. వివిధ దేశాల్లో ఈ సేద్యం మొదలుపెట్టి.. బోలెడు లాభాలు ఆర్జిస్తున్నవారు కూడా ఉన్నారు. భారత్‌లోనూ ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి.  

ఇతని పేరు సందీప్‌ కన్నన్‌. వ్యవసాయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. తిరుపతికి సమీపంలోని తనపల్లి వద్ద 2 ఎకరాల భూమి లీజుకు తీసుకొని.. రూ.70 లక్షల వ్యయంతో ‘వ్యవసాయి భూమి’ పేరుతో మూడేళ్ల క్రితం హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ ప్రారంభించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాలీహౌస్‌ కోసం రూ.8 లక్షల సబ్సిడీ వచ్చింది.

దాదాపు 17 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల రకాలను సాగు చేస్తున్నాడు. 8125813507 నంబర్‌తో పాటు వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. తిరుపతి, విజయవాడలోని 400కు పైగా కుటుంబాలకు రోజూ తాజా ఆకుకూరలు, కూరగాయలను సరఫరా చేస్తున్నాడు. ‘ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ మందికి నాణ్యమైన కూరగాయలను అందిస్తా’ అని సందీప్‌ చెప్పాడు. 

అతి తక్కువ నీటితో అధిక దిగుబడి.. 
మట్టి అనేదే లేకుండా సూక్ష్మ పోషకాలతో కూడిన నీటితో సాగు చేసే విధానమే హైడ్రోపోనిక్స్‌ వ్యవసాయం. 4 ఎకరాల్లో పండించే పంటలను.. ఎకరంలోపు స్థలంలోనే సాగు చేయవచ్చు. ఇళ్ల వద్ద అతికొద్ది స్థలంలో కూడా పండించవచ్చు. సాధారణ సేద్యంతో పోలి్చతే దీనికి 20 శాతం కంటే తక్కువ నీళ్లు చాలు. ఏడాది పొడవునా ఒకేసారి విభిన్న పంటలు సాగు చేయవచ్చు. హైడ్రోపోనిక్స్‌ వ్యవసాయాన్ని ఎక్కువగా ఎన్‌ఎఫ్‌టీ(న్యూట్రియంట్‌ ఫిల్మ్‌ టెక్ని­క్‌) విధానంలో చేస్తుంటారు.

ఈ పద్ధతిలో ముందుగా ఫాలీహౌస్‌ లేదా షేడ్‌నెట్‌ నిర్మించుకోవాలి. తర్వాత ఎన్‌ఎఫ్‌టీ పైపులు ఏర్పా­టు చేసుకోవాలి. ఆ పైపులలోని రంధ్రాల్లో చిన్న నెట్‌ కప్‌­లు ఉంచాలి. ఆ కప్‌లలో కొబ్బరి పీచు పొడి వేసి మధ్యలో మొక్కలు పెట్టాలి. చిన్నచిన్న ట్యాంక్‌ల నుంచి ఎన్‌ఎఫ్‌టీ పైప్‌లలోని మొక్కలకు సూక్ష్మ పోషకాలతో కూడిన నీళ్లు అందిస్తుండాలి. పాలీహౌస్‌లలో ఉష్ణోగ్రత 18 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌లుగా ఉండాలి. నిపుణుల సిఫార్సు మేరకు సూక్ష్మ పోషకాలను ఆర్వో వాటర్‌లో కలిపి మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ఈ విధానంలో దేశీయ, విదేశీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు పండించవచ్చు.    

గాలిలో పెరిగే బంగాళాదుంపలు.. 
సాధారణంగా దుంపలు మట్టిలో పెరుగుతాయి. కానీ ఇప్పు­డు కేవలం గాలిని ఉపయోగించే బంగాళాదుంపలను పండిస్తున్నారు. మట్టి లేకుండా.. సూక్ష్మపోషకాలతో కూడిన గాలి­తో సాగు చేసే విధానమే ఏరోఫోనిక్స్‌ వ్యవసాయం. సాధారణ వ్యవసాయంతో పోల్చితే దీనికి 10 శాతం కంటే తక్కువ నీళ్లు చాలు. ఈ విధానంలో ముందుగా పాలీహౌస్‌ లేదా, షేడ్‌నెట్‌లు నిర్మించుకోవాలి. అందులో ఇనుప స్టాండ్‌ల మీద రంధ్రాలతో కూడిన ధర్మాకోల్‌ షీట్‌లు ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో మొక్కలతో కూడిన చిన్న నెట్‌ కప్‌లు పెట్టుకోవాలి. వాటి వేర్లకు పైపుల ద్వారా సూక్ష్మ పోషకాలతో కూడిన నీటిని గాలి లేదా పొగ మంచురూపంలో ‘స్ప్రే’ల ద్వారా అందించాలి. మొక్కల వేర్లు ఎప్పుడూ బయటకు వేలాడుతూనే ఉంటాయి.  

ఉపయోగాలు.. 
నీటి వృథా ఉండదు. పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేయొచ్చు. 
   ఒక కిలో టమాటాలు పండించాలంటే సాధారణ పద్ధతుల్లో సుమారు 214 లీటర్ల నీళ్లు అవసరం. అదే హైడ్రోపోనిక్స్‌ విధానంలో 70 లీటర్లు,ఏరోపోనిక్స్‌లో విధానంలో కేవలం 20 లీటర్లు చాలు.  
   నీటి వినియోగం 80 నుంచి 90 శాతం వరకు, ఎరువులవినియోగం 60 శాతానికి పైగా, పురుగుమందుల వాడకం100 శాతం తగ్గుతుందని నాసా పేర్కొంది.  
 బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాదిపొడవునా పంటలు పండించవచ్చు.  
 మట్టిలో లభించే సూక్ష్మపోషకాలు.. ఈ విధానాల్లో నీటి ద్వారా అందుతాయి కనుక ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. 
 ఇంటి వద్దే ఈ విధానాల్లో సేద్యం చేస్తూ నెలకురూ.20 వేలకు పైగా ఆదాయం గడించవచ్చు. 

జాగ్రత్తలు.. 
   ఈ విధానాలను అనుసరించాలనుకునేవారు ముందు తక్కువ స్థలంలో మొదలుపెట్టడం ఉత్తమం. తగిన అనుభవం వచ్చిన తర్వాత విస్తరించాలి. ఎలాంటి అనుభవం లేకుండా ముందే ఎక్కువ పెట్టుబడి పెట్టినష్టపోవద్దు.  
 అర ఎకరంలో సాగు చేయాలంటే మొదటిసారి రూ.20 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పాలీహౌస్‌కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 
 తీగ జాతి మొక్కల పెంపకం వైపు వెళ్లకపోవడం మంచిది.   
 విద్యుత్‌ కోసం సోలార్‌ పెట్టుకుంటే కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు.   

నిట్టనిలువుగా.. బోలెడు మొక్కలు  
ఏరోపోనిక్స్‌ విధానాన్ని వర్టిల్‌(నిలువు)గా టవర్‌ పద్ధతిలోనూచేయవచ్చు. రకాలు, టవర్‌ ఎత్తును బట్టి 45కు పైగా మొక్కలు పెంచవచ్చు. ఏరోపోనిక్స్‌ టవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.నిలువుగా ఉండే పైపుల రంధ్రాలలో మొక్కలతో కూడిన నెట్‌ కప్‌లుపెట్టాలి. పైప్‌కు కింద చిన్న మోటర్‌తో కూడిన టబ్‌ ఉంటుంది. అందులో సూక్ష్మపోషకాలతో కూడిన నీళ్లు పోయాలి. ఆ టబ్‌ నుంచి నీళ్లు స్ప్రేల ద్వారా మొక్కల వేర్లకు గాలి, పొగ మంచు రూపంలో అందుతాయి. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు ఉండాలి. నిపుణుల సూచన మేరకు సూక్ష్మపోషకాలు అందించాలి. ఏరోపోనిక్స్‌ విధా­నంలో దుంప రకాలు, దేశీయ, విదే­శీ ఆకుకూరలు, ఉల్లిపాయలు, టమాటా తదితరాలు సాగు చేయవచ్చు. 

చేప, మొక్క.. చేదోడుగా..  
నీటి సాయంతో ఒకేసారి చేపలు, కూరగాయలను ఉత్పత్తి చేసే విధానమే ఆక్వాపోనిక్స్‌ వ్యవసాయం. ఇళ్ల వద్ద లేదా కాస్త ఎక్కువ స్థలంలో పాలీహౌస్‌ ఏర్పాటు చేసుకొని సాగు చేయవచ్చు. ఆక్వాపోనిక్స్‌ విధానంలో ముందుగా చేపల ట్యాంక్‌ ఏర్పాటు చేసుకోవాలి. దాని పక్కన బయోఫిల్టర్‌.. అనుబంధంగా ఎన్‌ఎఫ్‌టీ పైపులు ఏర్పా టు చేసుకోవాలి. చేపల ట్యాంక్‌ నుంచి వచ్చే అమ్మోనియా నీటిని బయోఫిల్టర్‌.. నైట్రేట్స్‌గా మార్చి ఎన్‌ఎఫ్‌టీ పైపులలోని మొక్కల వేర్లకు అందిస్తుంది. మొక్కలు ఆ నైట్రేట్స్‌తో పాటు ఇతర సూక్ష్మ పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయి. మొక్కల ద్వారా ఫిల్టర్‌ అయిన నీళ్లు మళ్లీ చేపల ట్యాంక్‌లోకి చేరుతాయి. ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉండాలి. దేశీయ, విదేశీ ఆకుకూరలు, కూరగాయలు, చేపలను ఉత్పత్తి చేసుకోవచ్చు. తిలాపియా వంటి చేపలు పెంచవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement