మూగజీవాల ఆకలి వేదన | low animal fooder flows cattle in to meet market | Sakshi
Sakshi News home page

మూగజీవాల ఆకలి వేదన

Published Mon, Aug 3 2015 6:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

మూగజీవాల ఆకలి వేదన

మూగజీవాల ఆకలి వేదన

                                   మూగజీవాలకు పెద్ద కష్టమొచ్చింది. గ్రాసం లేక ఆకలి బాధలు మొదలయ్యాయి. తమ ప్రమేయం లేకుండానే బలిపీఠమెక్కుతున్నాయి. వరుస కరువుతో రాయలసీమలో పొలాలు బీళ్లుగా మారి పశువులకు గ్రాసం కొరత ఏర్పడింది. తమ జీవనోపాధికే ఇబ్బందులు ఎదురైన రైతులు తప్పని పరిస్థితుల్లో పుట్టెడు దుఃఖంతో వాటిని అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఎండనక, వాననక కష్టపడుతూ, చివరకు తమ మల, మూత్రాల ద్వారాకూడా పంటల సాగుకు ఉపయోగపడుతూ మానవజాతికి ప్రాణాధారమైన ఆహార ఉత్పత్తులకు తోడ్పడుతున్న మూగ జీవాలు, చివరి క్షణంలోకూడా మనుషులకు ఆహారంగానే కబేళాలకు తరలిపోతున్నాయి. అప్పటిదాకా ఆలనాపాలనా చూసిన తమ యజమానులకు దూరమవుతున్నామని అవిపడుతున్న మూగ వేదన సీమ జనానికి కంటనీరు పెట్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.
                                                                                                                                                                                     - సాక్షి ప్రతినిధి, అనంతపురం:
 రాయలసీమలో మూడేళ్లుగా పంటల్లేవు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. పంటల్లేకపోవడంతో గ్రాసం నిల్వలు లేవు. వర్షం లేక ‘అనంత’లో ఎక్కడా పచ్చిగడ్డి మొలక కన్పించడం లేదు. దీంతో గ్రాసం సమకూర్చలేక, పశువులను కాపాడుకునేందుకు మరో మార్గం లేక రైతులు వాటికి అమ్మేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దులను ఇతర ప్రాంతాల రైతులు కొంటుంటే, బక్కచిక్కిన వాటిని వ్యాపారులు కబేళాలకు తరలిస్తున్నారు.
 కనిపించని గ్రాసం నిల్వలు
 గతంలో పల్లెలకు వెళితే వేరుశనగ, వరి గడ్డి వాములు కనిపించేవి. ఏడాది పాటు పశువులకు గ్రాసాన్ని నిల్వ చేసుకునేవారు. మరో ఏడాది వర్షం కురవకపోతే నిల్వచేసుకున్న గ్రాసం ఊరట కలిగించేది. జిల్లాలో మూడేళ్లుగా పంటలు లేవు. మరీముఖ్యంగా గతేడాది దారుణమైన పరిస్థితి. 5.06లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుచేయగా వర్షాభావంతో మొత్తం ఊడ్చుకుపోయింది. దీనివల్ల 20-30 ఎకరాలున్న పెద్ద రైతుల కల్లాల్లోనూ గడ్డివాములు కన్పించడం లేదు. పొలాల గట్లపై, కొండ గుట్టలపై కూడా గడ్డి దొరకడం లేదు. భూగర్భజలాలు కూడా అడుగంటడంతో పెద్దపెద్ద వృక్షాలే నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో పశువులకు మేత అందించడం రైతులకు సాధ్యం కాలేదు. ఈ ఏడాది రెండువేల మెట్రిక్‌టన్నుల వరిగడ్డిని పశుసంవర్ధకశాఖ అధికారులు పంపిణీ చేసినా.. కొరత తీరలేదు.
 కబేళాలకు  పశుసంపద
 ప్రతి ఆదివారం అనంతపురం, గోరంట్ల, కదిరిలో పశువుల సంతలు జరుగుతాయి. ఇంతకుముందు రైతులు సంతకు పాడిపశువులు, ఎద్దులను కొనేందుకు వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి రైతూ పశువులను విక్రయించడానికి మాత్రమే వస్తున్నారు. కేరళ, తమిళనాడు, హైదరాబాద్‌లోని 'మీట్ మార్కెట్ల'కు ఈ పశువులు వెళుతున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో తరలిపోతున్నాయి.  2007-08 పశుగణన ప్రకారం జిల్లాలో 15.42 లక్షల గేదెలు, ఆవులు, ఎద్దులు ఉండేవి. 2013కు వీటి సంఖ్య 9.30 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం మరో 1.50 లక్షల పశువులు తగ్గిపోయి ఉంటాయని పశుసంవర్ధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ కదిరి, ధర్మవరం డివిజన్‌లలో పశువుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది.  ఇప్పటికైనా ప్రభుత్వం పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా గడ్డి పంపిణీ చేయకపోతే పశుసంపద మరింత తరగిపోయే ప్రమాదముంది.
 
 గడ్డి లేదయ్యా..
  ఎక్కడా గడ్డి లేదయ్యా! వానలేక తోట మొత్తం ఎండిపోయింది.  రైతుల బతుకు కష్టంగా మారింది. మూగజీవుల పరిస్థితి మరీ దారుణం. ఎక్కడైనా గడ్డి కొందామంటే చేతిలో చిల్లగవ్వలేదు. అప్పుచేసి కొన్నా గడ్డి దొరకడం లేదు. దీనివల్లే ఎద్దులను అమ్ముదామని మార్కెట్‌కు వచ్చినా.                                                           - వన్నూరప్ప, జంతలూరు, బుక్కరాయసముద్రం మండలం
 
 గడ్డి లేకే అమ్మాల్సి వస్తోంది
 ఏడాది కిందట రూ. 40 వేలకు కాడెద్దులను కొన్నా. వ్యవసాయపనులకు ఉపయోగపడతాయి. రైతులకు బాడుగకు వెళితే కాస్త ఆర్థికంగా మేలుంటుందని కొన్నా. తీరా చూస్తే వాటిని పోషించేందుకు గడ్డి  లేదు. దీంతో ఎద్దులను రూ. 24 వేలకు అమ్మేశా. కేవలం గడ్డిలేకనే వాటిని అమ్మేశా. సంతలో పశువుల అమ్మకాలు చూస్తుంటే మళ్లీ నేను ఎద్దులు కొనాలంటే దొరుకుతాయా లేదా అని భయమేస్తోంది.                                                                        - రామన్న, రైతు,  పి. కొత్తపల్లి, ఆత్మకూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement