అనంత ఔదార్యం పశువులపై మమకారం
♦ పొలాన్ని బీడుగా ఉంచి మూగజీవాలకు నీరు
♦ నాలుగు నెలలుగా మూడు పూటలా..
♦ 200 జీవాలకు నీటి దానం
♦ తిమ్మాపురం రైతు అనంతిపై ప్రశంసల జల్లు
అసలే కరువు... ఆపై వేసవి... ఎక్కడా చుక్క నీరు దొరకని పరిస్థితి. గొంతు తడుపుకునేందుకు రైతులు, ప్రజలే కాదు పశువులు సైతం తల్లడిల్లిపోతున్నాయి. చాలాచోట్ల ప్రాణాలు సైతం వదులుతున్నాయి. ఇలాంటి గడ్డుపరిస్థితుల్లో ఓ రైతన్న కరుణించాడు. పెద్ద మనసుతో తన పొలాన్ని బీడుగా పెట్టి దాదాపు రెండు వందల పశువులకు నిత్యం తాగునీటిని అందిస్తున్నాడు. నాలుగు నెలలుగా మూడుపూటలా నీరందిస్తోన్న రైతు అనంతిని స్థానికులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. - రేగోడ్
ఆనందంగా ఉంది...
నా భూమిని బీడుగా ఉంచి పశువులకు తాగునీటిని అందిస్తున్నా. వాటి దాహార్తిని తీర్చే అవకాశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. పశువులు బతికితేనే వ్యవసాయం నిలుస్తుంది. పాడిపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. - అనంతి, రైతు, తిమ్మాపురం
రే గోడ్ మండలం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మాల అనంతికి రెండు చోట్ల కలిపి మొత్తం మూడెకరాల భూమి ఉంది. ఎకరంన్నర ఉన్న భూమిలో పెద్దబండపై నాలుగు నెలల క్రితం బోరుబావి తవ్వించాడు. తన కష్టానికి ప్రతిఫలంగా వేసిన బోరులో నీళ్లు పుష్కలంగా వచ్చాయి. పంట వేద్దామనుకునే లోపే గ్రామంలో నీటి సమస్య మొదలైంది. ప్రజలతోపాటు పశువులు పడుతున్న ఇబ్బందులను తలచుకుంటేనే భయమేస్తోంది. స్థానికులంతా కలిసి రైతు అనంతిని కలిశారు. నీటి గోసతో పశువులు తల్లడిల్లుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన స్వయాన రైతు కావడం.. స్థానికుల విన్నపంతోపాటు పశువుల బాధను అర్థం చేసుకున్న అనంతి వాటికి తాగు నీటిని అందించేందుకు ముందుకు వచ్చాడు. తన పొలాన్ని బీడుగా ఉంచి బోరునుంచి నీటిని వదులుతున్నాడు. రోజుకు మూడుసార్లు సుమారు రెండు వందల పశువులకు నాలుగు నెలలుగా దాహార్తిని తీరుస్తున్నాడు.
ప్రశంసలు...
పశువులకు నీటిని అందిస్తోన్న రైతు అనంతిని స్థానికులు, రైతులు అభినందిస్తున్నారు. ఆయన తన పొలంలో సాగు చేపడితే కనీసం రూ.25 వేల లాభం వచ్చేది. కానీ డబ్బులను ఆశించకుండా పశుసంతతిని కాపాడాలనే పెద్దమనసుతో ఆయన ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు.